అమ్మకానికి అమ్మ పాలు
Mar 26 2017 @ 22:57PM
తల్లి చనుబాలు జీవామృతం! పుట్టుకతో బిడ్డకు ప్రాప్తించే జన్మహక్కు! ఇప్పుడా మాతృ ధర్మం అంగట్లో బేరమై.. కన్నపేగు బావురుమంటోంది. ఆ బేరం - తల్లిపాల వ్యాపారం!!. ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువుల్ని అమ్మినట్లు..‘బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్’ పీపాలు అమ్ముడుపోతున్నాయి. ఆ వ్యాపారంలో ఒకటి - కంబోడియాలో మొదలైన ‘ఆంబ్రోసియా ల్యాబ్’. ఒక దేశం నుంచి మరొక దేశానికి తల్లిపాలను ఎగుమతి చేస్తున్న తొలిసంస్థ ఇదే కాబోలు. కంబోడియాలోని పేద తల్లుల మాతృత్వాన్ని పిండుకుని.. సంపన్న అమెరికా పిల్లల గొంతులు తడుపుతోందీ సంస్థ. ఇటీవలే యూనిసెఫ్ జోక్యం చేసుకుని.. తల్లిపాలతో వాణిజ్యం మంచిది కాదని హెచ్చరించింది. కంబోడియా ప్రభుత్వం కూడా కళ్లు తెరచి.. తల్లిపాల ఎగుమతుల మీద ఆంక్షలు విధించింది. దీంతో ‘బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్’ చర్చనీయాంశం అయ్యిందిప్పుడు..
ఒక తల్లి తన బిడ్డ నోరు కట్టేసి.. సంపన్న పిల్లలకు పాలు అమ్ముకునే అగత్యం ఎందుకు? ఆ తల్లిని పేదరికం నుం
చి బయటపడేసేందుకు మార్గాలను అన్వేషించ కుండా.. తన రక్తంతో వృద్ధి అయిన పాలను అమ్ముకునే పరిస్థితులు తీసుకు రావడం బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా తల్లి పాల విక్రయం పట్ల తీవ్ర నిరసనలు
వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగాలి. లేదంటే, అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాల్లోని తల్లుల రక్తమాంసాలను పిండేసుకుని.. పిల్లలను అనారోగ్యం పాలు చేస్తాయి. కంబో డియాలో మొదలైన తల్లి పాల వ్యాపారం.. మిగిలిన పేద దేశాలకు సోకితే.. ఆ పిల్లలకు అమ్మదనం కరువయ్యే ప్రమాదం ఉంది.
రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఉన్నట్లే - తల్లిపాలను దానం చేసే మదర్ మిల్క్ బ్యాంకులూ లేకపోలేదు. అయితే, వీటన్నిటినీ నడిపించేది దాతృత్వభావన. వాణిజ్యానికి తావు లేని మనిషితనం! అమెరికాలోనూ సేవాభాగ్యంతో వెలసిన తల్లిపాల బ్యాంకులు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ అక్కడి పిల్లల పొట్ట నింపలేకపోతున్నాయి. ఇంటర్నేషనల్ మిల్క్ బ్యాంక్ అధ్యయనం ప్రకారం - అమెరికాలో ఏడాదికి 63 మిలియన్ ఔన్సుల తల్లిపాలు అవసరం. అందులో, కేవలం పది మిలియన్ ఔన్సులు మాత్రమే మిల్క్ బ్యాంకులు సేకరించగలుగుతున్నాయి. ఆ కాసిన్ని పాలు - పురిట్లోనే తల్లులను కోల్పోయిన బిడ్డలకు, ఆస్పత్రుల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లి.. పాలు ఇవ్వలేని తల్లుల పిల్లలకు, అనారోగ్యబాధితుల పిల్లలకే సరిపోతున్నాయని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అసోసియేషన్ చెబుతోంది. ఇది ఉత్తర అమెరికాలో తల్లిపాలను సేకరించే లాభాపేక్షలేని సంస్థ.
కొందరు స్వార్థపరులు.. ఎక్కడ దేనికి కొరత ఉంటే దాన్ని సొమ్ము చేసుకునేందుకు గద్దల్లా వాలిపోవడం సహజం. అలాంటి వారిని ఈ తల్లిపాల కొరత ఆకర్షించింది. అమెరికా చట్టాల ప్రకారం తల్లి పాలను అమ్మడం అనైతికం కాదు. అలాగని చట్టబద్ధమూ కాదు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి నిబంధనలు లేవు. దాంతో చీకటి వ్యాపారం కింద సాగుతోందీ వ్యవహారం. కొన్నేళ్ల కిందటే సహాయ ధోరణిలో కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లు వెలిశాయి. ఒక తల్లికి మిగులుబాటు పాలు ఉంటే.. మరో పాలులేని తల్లి పిల్లలకు ఇవ్వొచ్చు అన్నది నైతిక సూత్రం. ఆ కోవలోనే కమ్యూనిటీ వెబ్‌సైట్లలో పాలు ఇచ్చే తల్లులు తమ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మధ్యన మరికొన్ని ఆన్‌లైన్ సైట్లు ఏకంగా పాలు అమ్ముకునే తల్లుల వివరాలను క్లాసిఫైడ్స్‌లాగా అడ్వర్‌టైజ్ చేయడం మొదలైంది. అమెరికాలోని చైనా రెస్టారెంట్లు, ఫాన్సీ స్టోర్లు, కిరాణా కొట్ల దగ్గర ‘బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్’ ప్రకటనలు గోడల మీద ప్రత్యక్షమవుతుండటం సాధారణమైపోయింది.
అమెరికాలో తల్లిపాలను విక్ర యించే అతి పెద్ద ఆన్‌లైన్ కంపెనీ- ‘ఓన్లీ ద బ్రెస్ట్’. అందులో ఒకావిడ ‘‘నా పేరు మరియా, నేను వెల్లింగ్టన్‌లో ఉంటాను. నావి ఫ్యాటీమిల్క్. ఎటువంటి జబ్బులు లేవు. ఒక ఔన్సు పాలకు ఐదు డాలర్లు (రూ.325) తీసుకుంటాను..’’ అని ప్రకటించింది. మరొక తల్లి ‘‘నేను శ్రేష్ఠమైన శాఖాహారిని. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని. మీ బిడ్డకు అవసరమైనప్పుడు తాజా పాలను ఇవ్వగలను. ఒక ఔన్స్ ధర ఆరు డాలర్లు (రూ.390)’’ అన్నది ఆమె పోస్టింగ్‌లోని సారాంశం. ఇటువంటి తల్లులు పదివేల మందికి పైగా సైట్‌లలో క్లాసిఫైడ్స్ ఇచ్చారు. ఇంచుమించు 45 మిలియన్ల ఔన్సుల తల్లి పాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. బ్రెస్ట్‌మిల్క్ ఫర్ సేల్.కామ్, కిజిజి, క్రైగ్స్‌లిస్ట్, కిన్‌కీ.కామ్ ఇలా బోలెడన్ని ఆన్‌లైన్ సైట్లు కేవలం తల్లిపాల విక్రయానికే పని చేస్తున్నాయి. పాలు ఇచ్చే తల్లిని సంప్రదించి.. అడిగినంత డబ్బులు చెల్లించి.. పాలు తీసుకెళ్లవచ్చు. ‘‘మా వెబ్‌సైట్‌లో కనీసం పన్నెండువందల మంది నమోదయ్యారు. వాళ్లందరూ స్వచ్ఛందంగా పాలు అమ్మడానికి సిద్ధమైనవాళ్లు. మేము తల్లులకు, పాల కొరత ఉన్న బిడ్డలకు మధ్యవర్తులం మాత్రమే’’ అని చెబుతోంది కిన్‌కీ.కామ్. ఈ సైట్లకు రెండువైపుల నుంచి ఆదాయం వస్తోంది.
‘‘అమెరికాలో తల్లి పాల కొరత రోజు రోజుకు పెరుగుతోంది. నెలలు నిండకనే పుట్టిన బిడ్డలకు పాలు అందడం లేదు. ఆధునిక జీవనశైలి దుష్ప్రభావాల వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది. డ్రగ్స్, మద్యం, ధూమపానం, వేళాపాలలేని పనివేళలు, ఊబకాయం కలిగిన మహిళల్లో పాల ఉత్పత్తి తగ్గుతోంది. అందులోనూ నగరాల్లోని తల్లులు ఉద్యోగినులు కావడం వల్ల.. తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్య పిల్లలకు పాలు పట్టలేకపోతున్నారు. ఇటువంటి కారణాల చేత మరోతల్లి పాలు పిల్లలకు అవసరం అవుతున్నాయి..’’ అంటున్నారు అమెరికాకు చెందిన వైద్యులు. పసికందులకు తల్లి పాలు మాత్రమే సులభంగా జీర్ణం అవుతాయి. అందులోను చిన్నప్పుడు తాగే పాల వల్లనే పిల్లల మెదడులో న్యూరొలాజికల్ టిష్యూలు అభివృద్ధి అవుతాయన్నది డాక్టర్ల మాట. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదగడానికి తల్లి పాలే అతి ముఖ్యమైన పౌష్టికాహారం. కాబట్టి.. అమెరికాలో ఇంత డిమాండ్ ఏర్పడింది.
అమెరికాలో తల్లి పాల విక్రయం జరుగుతున్నప్పటికీ.. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు. అందుకే ఆ ధనిక తల్లుల చూపు బీద దేశాల మీద పడింది. అమెరికాకు చెందిన బ్రాంజ్‌సన్‌వుడ్స్ కంబోడియాలో మిషనరీ నిర్వాహకుడు. ఆయనకు ఒక సంఘటన ఎదురైంది. ‘‘నా మరదలుకు కవలలు పుట్టారు. ఆ పిల్లలకు తల్లి పాలు సరిపోలేదు. నానాయాతన పడాల్సి వచ్చింది. రాత్రిపూట ఆకలి తీరక గుక్కపట్టి ఏడ్చేవారు. కొందరు తల్లులను బతిమాలి కవలల కడుపు నింపాల్సి వచ్చింది..’’ అన్నారాయన. అక్కడితో ఊరుకోలేదు. అదే సంఘటనను వాణిజ్య ఆలోచనగా మార్చుకున్నారు. మారుతల్లిపాలను తాగి బతికే స్టార్టప్ కంపెనీ అన్న మాట! ఆ కంపెనీ పేరు ‘ఆంబ్రోసియా ల్యాబ్’. కంబోడియాలోని కొన్ని బస్తీలు, వాడల్లోకి వెళ్లి.. ఆరు మాసాల క్రితం పిల్లలకు జన్మనిచ్చిన తల్లుల వివరాలు సేకరించారీ కంపెనీ ఉద్యోగులు. పాలు పట్టేందుకు కిట్‌లు సైతం అందించారు. ఎన్ని పాలకు ఎంత డబ్బు అందుతుందో ఆశ చూపారు. తమకు దక్కే లెక్కలూ వేసుకున్నారు.
సౌత ఈస్ట్ ఏసియాలో తమ పిల్లలకు పుష్టిగా పాలు తాగించే తల్లులున్న దేశాల్లో కంబోడియా పెద్ద తల్లి. అక్కడి తల్లుల్లో వాతావరణం, జన్యుపరమైన అంశాలు, తీసుకునే ఆహారం రీత్యా పాలు అధికం. ఆ విషయాన్ని గమనించిన ఈ ఆంబ్రోసియా ల్యాబ్.. ఇక్కడి తల్లిపాలను సేకరించి.. అమెరికాకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. నైతికతను విస్మరించి నిరుపేద పసికూనల కడుపుకొట్టి.. మరొకరి దప్పిక తీర్చాలని భావించింది. అందుకు సంస్థ చెప్పే తర్కం ‘‘కంబోడియా మహిళల్లో ఆదాయం తక్కువ. కూలీనాలీ, చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునే సీ్త్రలు తల్లులు అయిన వెంటనే ఉపాధి ఆగిపోతుంది. తమ పిల్లల కనీస అవసరాలనూ తీర్చలేని దుస్థితి. అలాంటి తల్లులు తమ పిల్లలకు ఇవ్వగా మిగిలిన పాలను మాత్రమే మేము కొని.. విక్రయిస్తున్నాం. ఔన్సుల లెక్కన ధర చెల్లిస్తున్నాం. ఇలా సేకరించిన పాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం..’’ అని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. అయితే, ఈ సంస్థ పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లి పాల వ్యాపారం విస్తరిస్తే.. పేద దేశాల్లోని పిల్లలు పస్తులతో సతమతమై.. మాతృత్వ మధురిమకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నది మానవతావాదుల అభిప్రాయం.
తల్లి పాల వ్యాపారం దోపిడికి దారి తీస్తుంది. తల్లి పాలు రక్తంతో సమానం. ఆరు మాసాల
వరకు ప్రతి బిడ్డ కడుపు నిండా పాలు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు. రెండేళ్ల వరకు పాలు తాగిన బిడ్డలే రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. కంబోడియాలో తల్లి పాల వ్యాపారం దారుణం. - యూనిసెఫ్, కంబోడియా ప్రతినిధి
‘‘అమెరికాకు తల్లి పాలను ఎగుమతి చేయడం అంటే మాటలు కాదు. అక్కడి అమెరికన్ మిల్క్ బ్యాంక్ నిబంధనలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిసే్ట్రషన్ కంటే కఠినంగా ఉంటాయి.
వాటన్నిటినీ దాటుకుని విదేశీ తల్లి పాలను ఆ దేశానికి పంపిస్తున్నాము. ఒకవైపు నిరుపేద తల్లులకు ఆదాయాన్ని అందిస్తూనే.. మరో వైపు పాల కొరత ఉన్న తల్లుల బిడ్డల కడుపు నింపుతున్నాం’’. \
No comments:
Post a Comment