Tuesday, November 10, 2009

ఏమే....ఒసేయ్ ....|

ఏమే...ఒసేయ్ .
*****

ఒసేయ్ ...ఇలారా | గర్జించిన తండ్రిముందు వణుకుతూ వచ్చి నిల్చుంది ఏడు సంవత్సరాలు నిండని చిన్నారి మల్లి .
కాళ్లుకడుక్కుందికి నీళ్లుపట్రా... చెప్పులువిడిచీ . .. మల్లివేపుచూస్తూ ఆజ్నాపించేదు తండ్రి.
ఒసేయ్ ... ఇలారా... నేనుకాస్తా రంగమ్మత్త ఇంటికి వెళ్తాను , వచ్చేసరికి ఆ కాస్తా అంట్లు తోమిపెట్టు ,తమ్ముడిని ఎత్తుకువెళ్తూ అమ్మ .....ఆర్డర్ .
ప్రతీరోజూ ఒసేయ్ అన్న పిలుపుతోపాటు మరుగుపడుతున్న తనపేరుని జ్నాపకం తెచ్చుకుందికి కూడా సమయం లేకా...కాలంతో రాజీ పడింది మల్లి. తమ్ముడిని మాధవా ... మాచిన్ని కన్నా అని పిలుస్తూ గారం చేస్తున్న అమ్మ, నాన్నలు తనని '' ఒసేయ్ '' అంటూ ఎందుకు పిలుస్తున్నారో అర్ధంకాకా , కాలంతో పాటు తనకి నచ్చని పిలుపు '' ఒసేయ్ ''తో రాజీ పడింది .

కరిగే కాలంతో , పెరిగే వయసు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది .కన్నుమూసిన తల్లి భారాన్ని పూర్తిగా తనపై వేసుకొని బండెడు చాకిరీతో భారంగా ఒదిగింది పదిహేను సంవత్సారాల మల్లి.

ఒసేయ్ | ఇలారా... తండ్రి పిలుపుకు జవాబుగా ఎదురుగావచ్చి నిల్చుంది పెళ్లివారొస్తున్నారు , వెళ్లి తయారవ్వు , తండ్రి హూంకరింపు . 15'' సం '' తనకు పెళ్లా....? ఆలోచనలమధ్య ,ఇరుగు,పొరుగుల హాస్యాల మధ్య ఏవేవో తీపి లోకాల్లోకి వెళ్లిపోయింది .

అవును , తనకి పెళ్లయితే '' ఒసేయ్ '' అన్నమాట ఇంక వినపడదు . మల్లీ.....అంటూ ..ప్రేమగా పిలిచే భర్త , అత్తగారు , ఆడబిడ్డలూ.... అవును , తను అత్తవారింట '' మల్లి '' గా మన్ననలు అందుకుంటుంది. ఆనందంతో అందంగా తయారయ్యింది .

పెళ్లిచూపులూ, కట్నాలూ, తాంబూలాలూ, ఆఖరికి పెళ్లికూడా అయ్యింది . పులకరించే మనసుతో అత్తారింట అడుగుపెట్టింది .
అత్తింట్లో మొదటిరోజే నిరాశ ఎదురయ్యింది '' ఒసేయ్ '' నా పర్సేదీ... అన్న భర్త పిలుపుకి కంట్లో నీళ్లుతిరిగేయి .ఒకరి తర్వాత ఒకరిగా ఆ యింట్లొ అందరూ పిలిచే '' ఒసేయ్ '' అన్న పిలుపుకి రాజీపడింది ., తమ్ముడిని మాధవ్ గా, తనని '' ఒసేయ్'' గా మార్చిన కాలాన్ని నిందిస్తూ.....

సంవత్సరాలు రోజుల్లా, రోజులు క్షణాల్లా , నలుగురు పిల్లలకి తల్లిగా...బండడు చాకిరీకి బానిసగా...మార్దవం ఎరుగని మల్లి , బడలి, వడలీ , మంచం పట్టింది.

'' ఒసేయ్ '' పొద్దెక్కింది ,వేగం లేచీ తగలడు . వెధవ రోగమా...అని , ఎక్కడలేని డబ్బూ.. దీని జబ్బులకే .''..భర్త విదిలింపు ....
'' ఒసేయ్ | ఎన్నాళ్లీ నంగనాచివేషాలు , పడుక్కుంటే పన్లెలాఅవుతాయీ...'' అత్తగారి ఈసడింపు ..'' చేసినచాకిరీచాలు .. చాలించు నీ ఓర్పు '' నిస్థ్థ్రాణగా పడివున్న శరీరానికి ,మనసు ఇచ్చే తీర్పు , కంట్లోంచీ కారుతున్న కన్నీటి ఓదార్పు .

మగతగా పట్టిన నిద్దురలో... చెదురు మదురుగా మెదులుతున్న జ్నాపకాలు . చెవులో...''.ఒసేయ్ ...ఒసేయ్ ....ఒసేయ్ '' ల హొరు . ఒక్కటంటే ఒక్కటైనా తీపి జ్నాపకం ఎరుగని మల్లి మనసు మూగగా రోదించింది .

'' ఒసేయ్ ''...ఎవరెవరో పిలుస్తూ ....ఏదేదో చెప్తూ ....ఎన్నెన్నో అంటూ.....

మల్లికి మాత్రం ఏమీ స్పష్థ్థంగా వినపడడం లేదు . కంటిముందు బంగారు వెలుగు ....ఆ వెలుగులో ఎవరో చేతులుచాస్తూ ప్రేమగా పిలుస్తున్నారు .'' రా...మల్లీ ''...అంటూ....

అదే...అదే... ఈ పిలుపుకోసమే తను ఇన్ని సంవత్సరాల నుంచీ ఎదురుచూసినది . తనను తానుగా గుర్తింపబడిన ఈ తీయని పిలుపు ......ప్రేమగా తనను అందరూ పిలవాలనుకున్న చల్లని పిలుపు ...చిన్నప్పటినుండీ తను ఆశగా వినాలనుకున్న తీయని పిలుపు ...తనకి పెట్టిన అందమైన పేరుగా మూలపడిన ముద్దుల పిలుపు '' మల్లి ''....మధురంగా.....మృదువుగా......ప్రేమగా.....

'' మల్లి '' కళ్లుమూసింది సంత్రుప్తిగా.....అనంత విస్వబాహువుల్లో సేదతీర్చుకోవడానికి ...అందనితీరాలకి పయనిస్తూ....

'' మల్లి '' గా పరిమళిస్తూ...
___________________

రచన, శ్రిీమతి,

పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.

కల్యాణ్.

మధుర స్మృతి .

*****
మధుర స్మ్రుతి.
---------------------
హడావిడిగా భర్తని ఆఫీస్ కి , అల్లరిచేసే పిల్లలని స్కూల్ కి పంపీ భారంగా ఊపిరితీసుకున్నాను. అలసిన శరీరాన్ని సేదతీరుస్తూ ఈజీ చైర్ లో నడుం వాల్చేను . రిలేక్స్ అవుతున్న నా చెవులకి హాయిగా వినిపిస్తున్నాదొక చప్పుడు. టప్ ....టప్ ......టప్ .......

అలసట మర్చీ , ఒక్కసారిగా లేచీ కిటికీవైపు పరుగెత్తేను. '' బయట పడుతున్న వర్షం '' ఒక్కసారిగా నాపై చిరుజల్లుగా.....చల్లగా....హాయిగా....... పడీ.... సేద తీర్చినట్లయ్యింది . ఉత్సాహం గా పెరటిలోకి పరుగెత్తేను. వర్షం లో తడుస్తూన్న నన్ను, నా ఆలోచనలు , ఏవేవో మదుర స్మృతులలోకి తీసుకువెళ్లేయి .

'' వర్షం '' ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నులముందు , కదలాడే చిన్నప్పటి చిరుఝల్లుల జ్నాపకాలు.........అవును ...ఇదే వర్షం .....వర్షం లో తనూ, తన స్నేహితురాళ్లూ.... ఆట , పాటలూ....గిల్లికజ్జాలూ.....

*****

చేతుల్లో వేతులువేసీ '' వానా వానా చల్లప్పా...'' అంటూ పాడుకుంటూ , గుండ్రంగా గింగిరాలు తిరిగే
చిన్ననాటి చిలిపి సరదాలు ......

చెట్ల ఆకులపై పడే వర్షపు నీటిబొట్ల ని , నోరుపట్టీ జుర్రుకొనే ఆనందపు క్షణాలు .........

గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడ్తూ జిలిబిలి కబుర్లతో , తడుస్తున్న ఒంటిని తోపులాటలతో ఇంకా తడుపుకుంటూ స్కూలుకి వెళ్లే ఎత్తుపల్లాల కాలిబాటలు ........

వర్షానికి తడిసిన పచ్చని గడ్డి , వేసిన తివాచీల తోరణాలు.........ఎదిగిన పైరు బాలలు తడిసీ తలవంచే సిగ్గు సింగారాలు ....వర్షపు నీటిలో తడిసిన ముద్ద మందారాలు , నిండిన నీటి మడుగుల్లో వయ్యారంగా వాలి, కవ్వించే కలువభామల మేని సొగసుల
......... వయ్యారాలు...................

చిరుజల్లులతో కలిపి వీచే చల్లని గాలుల నుండీ వచ్చే , తడిసిన మట్టి సుగంధాలు .......

పిల్లకాలువల పారే నీటిలో పోటీలతో వేసే , రంగు రంగుల కాగితపు పడవల పరుగుల వరుసలు ......

వేడి, వేడి ఫల్లీలు తింటూ... ఉరుములశభ్దాన్ని వింటూ...., మెరిసే మెరుపుల్ని వింతగా చూసే , అమాయక
విస్మయ చిన్నారి చూపులు .....

శ్రావణమాసపు నోముల సందడిలో , పట్టు పరికిణీ..పావడాల రెప రెపలతో..., అమ్మ చేయి పట్తుకొని,
అమ్మలక్కల ఇళ్లకి '' పేరంటానికి '' వెళ్లే తోవలో , గుడి నుంచీ వినిపించే జేగంటల చిరు గణ, గణలు ......

అట్లతదియరోజు ఐదు గంటలకే లేచీ , '' ఉట్తికింద ముద్దలు '' తిని , ఊయలలాటకై ఉత్సాహంగా
పరుగులుతీసే కాలిమువ్వల గలగలలు ........

రాత్రి కాగానే నానమ్మ పక్కలో వెచ్చగా ఒదిగీ , ఆమె చెప్పే చిట్టి పొట్తి కధలు వింటూ...
భయం, ఆశ్చర్యం , ఆనందాల మిశ్రమాల పసిహృదయపు పులకరింతలు .......

ఇలా ఎన్నో....ఇంకెన్నో.....చిన్ని చిన్ని చిలిపి జ్నాపకాలు, నాలో ఇంకా మాసిపోని బాల్యస్మృతులు .
ఆ రోజుల్లో ప్రతీ రోజూ ఒక కొత్త వెలుగు. ప్రతీక్షణం ఒక నందనవనం , మరువరాని , మరవలేని మధుర తరంగాలు .....

ఆ రోజులు తిరిగి వస్తాయా......? అలోవకగా ఆలోచిస్తున్న నేను, చెవులకి వినిపించే కాలింగ్ బెల్
మోతకి ఉలిక్కి పడి , గడియారం వేపు చూసేను . సాయంత్రం 5.30 కావస్తున్నాది .

పాత జ్నాపకాల అలల్లో కదలాడే నాకు కదలిపోయే సమయం తెలీలేదు '' ఉస్సురంటూ '' పెరట్లోంచీ
కదిలేను . ఆయనా, పిల్లలూ వచ్చినట్లున్నారు ...'' టిఫిను ఏమి చేయాలబ్బా '' అనుకుంటూ , తలుపుతీసీ వంటింటివైపు కదిలేను ............

'' రొటీను '' గా............
-----------
రచన , శ్రీమతి..
పుల్లాభట్ల జగదిీశ్వరిీ ముార్తి.
కల్యాణ్.
-----------

స్వామివారి కల్యాణం

Swaamivaari Kalyaanam
స్వామివారి కల్యాణం .
*****

ఆడిటోరియం జనంతో కిటకిట లాడుతోంది . పిల్లలూ , పెద్దలూ ,ముసలివాళ్లూ , వయసులోఉన్నవారూ , అందరూ వచ్చేరు. చిన్నపిల్లల ఆటలకోసం ఒకపక్క రంగులరాట్నం , ఊయలలూ ఏర్పాటు చేసేరు . ఆచుట్టుపక్కల పిల్లలకేరింతలు , ఏడ్పులు , పెద్దల సముదాయింపులతో గందరగోళంగా ఉంది . వయసులోవున్న పిల్లలు మరికొంచంసేపటిలో మొదలవ్వబోయే ఆర్కెష్థ్ర్రా గురించి , పాటలగురించి మాటలాడుకుంటున్నారు . .వృద్ధులు ఉత్తరీయాలు సవరించుకుంటూ , నారాయణనామజపం చేసుకుంటూ , జరగబోయే స్వామివారి కల్యాణం మొదలెట్టే సమయంకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . కొంతమంది కల్యాణంకి కావలసిన పూవులు ,తులసీ కలిపి మాలలు కడుతున్నారు.

కొద్దిదూరంలో ష్టేజ్ మీద కల్యాణమండపం రంగురంగుల లైట్లకాంతితో కళకళలాడుతున్నాది . పూల ఆసనం మీద మంగాసమేతుడైన స్వామివారివిగ్రహం , పట్టుపీతాంబరాలతో శోభాయమానంగావుంది . స్వామితరఫు వారూ , మంగమ్మ తరఫువారూ , పూజాది , వివాహ సరంజామాలతో సిద్ధంగావున్నారు . పూజారులు మైక్ దగ్గర అసహనంగా కూర్చొనివున్నారు . కారణం పూజకిరావలసిన పెద్దమొత్తం చందాదారు లెవరో ఇంకా రాలేదుట . కాలాతీతానికి ప్రజలలో అసహనం పెరిగిపోతున్నాది . మధ్యమధ్యలో సమయం మించిపోతున్నందుకు గానూ, క్షమాపణలుచెప్పుతూ కార్యనిర్వాహకులు కాలయాపనచేస్తున్నారు .

రాత్రి 7.30 గంటలకు కొందరు భారీకాయులు కార్ల లోంచీదిగేరు కార్యనిర్వాహకులు వారి అడుగులకి,మడుగులొత్తుతూ , స్పెషల్ సీట్లమీద కూర్చోపెట్టీ, కూల్ డ్రింక్ లు ఇచ్చీ, పూజ ప్రారంభించ మని చెప్పగానే , పూజారులు సంకల్పమంత్రాలు ప్రారంభించేరు , కల్యాణ సమయం మించిపోయినా , స్వామి నిత్యకల్యాణుడు కనకా ముహూర్తంతో పనిలేదన్నతీర్పుతో.

అసహనంగా నిరీక్షిస్తున్న జనం '' హమ్మయ్య '' అని ఊపిరితీసుకున్నారు . అక్కడే స్వామివారి ప్రసాదంపేరుతో భోజనవసతి ఏర్పచడంతో జనం దండీగానేఉన్నారు . పూజ ప్రారంభమయ్యి పది నిముషాలుకూడా కాలేదు , ఒక్కనిముషం అంటూ కార్యనిర్వాహకసభ్యుడొకడు పూజారులతో ఏదోచెప్పేడు. పూజ ఆగింది . ఇందాకవచ్చినవారు తమభారీ శరీరాలని మోసుకుంటూ ష్టేజ్ పైకిఎక్కి నిలుచున్నారు . కార్య నిర్వాహకులు వారిని ,వారిచ్చినవిరాళాన్ని,గురించి పొగుడుతూ , వారికి స్వామివారి ఆశీర్వాదాలుగా శాలువకప్పి , గ్రూప్ ఫొటోలూ , వీడియో సెట్టింగులూ , వారిపేరుతో నామార్చనలతో ,మరింతకాలాతీతం చేసేరు . కిందకూర్చున్నవారికి చికాకుగాఉంది . తనివితీరా కల్యాణం చూద్దామనుకుంటే ఈ గొడవేమిటిరాబాబూ అనుకుం టూవుంటే , చిన్నపిల్లలు ఆకలికి, నిద్రకి ఏడుస్తూ మరింతచికాకు పుట్టిస్తున్నారు . భక్తిమీరినవారు ఆదేవదేవుడు మంగమ్మతల్లికి
కట్టే సూత్రాధారణకోసం సహనంగా ఎదురుచూస్తున్నారు .

ఒకపక్క ఆర్కెష్ట్రావారి పాటలు , మరోపక్క సన్నాయి వాద్యాల ఘోష , పిల్లలేడుపూ , వీటన్నిటిమధ్యా ఎవరో పెద్దలంటూ రావడం , మళ్లీ స్పీచ్ లూ , ఫొటోలూ , పొగడ్తలమధ్య స్వామివారి విగ్రహాలు మరుగై , కల్యాణం ఆగుతూ , ఆగుతూ మొత్తానికి పూర్తయ్యిందనిపించేరు .

పూజారులు హారతిని ఎత్తీ చూపడంతో , కల్యాణం పూర్తయ్యిందికాబోలను కొనీ ... ఆకలికి ఆగలేకా కొందరూ , ఐపోతాయేమోఅని కొందరూ భోజనాలలైనులోంచే చేతులూపేరు హారతితీసుకుంటున్నట్లు . ఖాళీగా వున్న స్టేజ్ మీద స్వామివారు మంగాసమేతుడై దర్సనం ఈయడానికి రెడీగాఉన్నా, అందరి దృష్టీ లైనులో తమకన్నా ముందున్నవారిమీదేవుంది ఎప్పుడుకదులు తారాఅనీ... గంటన్నరసేపు సాగినతోపులాటలో ఎవరికివారే తమవంతుకై వేగరపడుతున్నారు భోజనాలు మిగులుతాయో, లేదో అన్న బెంగతో... ఆకలి భక్తిని అధిగమించింది .

తిరిగీ మైక్ లోంచీ భాషణ ...డొనేషను ఇచ్చినవారి పేర్లు ,పొగడ్తలు , ఫొటోలమధ్య దిగ్విజయంగా సాగిన కార్యక్రమంలో, తాముపడిన శ్రమ గురించిన వివరణ . గ్రూప్ ఫొటోల మధ్య మరుగుపడిన విగ్రహాలని చూచే అవకాసం లేకా , తిరుగుముఖం పట్టేరు జనం . వారికి స్వామివారి కల్యాణం కి వచ్చినట్లులేదు . మంత్రాలు వినపడలేదు , విగ్రహాలు కనపడలేదు . అనవసరపు అలసటని ,కొని --------తెచ్చుకున్నట్లనిపించింది .

కార్యవర్గ సభ్యులకందరికీ ఒకటే ఆలోచన ...రేపటి న్యూస్ పేపరులో తమఫొటో వస్తుందా....రాదా ...వస్తే... తమగురించి ఏమని రాస్తారో......

భగవంతునికన్నా , మనిషికి ఇచ్చే విలువలనిచూచీ , '' ఆదేముని దయవల్లనే తాము, గానీ తమవల్ల దేముడు కాదుకదా...'' అటువంటి ఆ దేవుని పూజని మధ్యలోఆపి, తమని స్తుతింపజేసుకోవడం తమగొప్పలు చాటుకోవడం తప్పనితెలియదా....ఎవరికి తోచినంత వారు ఇచ్చేది , భగవంతునికోసమా....బడాయికోసమా ? తమ ఆధిక్యతని చాటుకోవడం అంత అవసరమా ? ....ఆదేవునిముందు అందరూ సమానులేననీ, తాము చేసే ప్రతీ మంచిపనికీ ఆ భగవంతుడు సత్ఫలితాలనే అందజేస్తాడనీ .....ఈరకంగా చాటుకోనవసరం లేదనీ....తెలియదా..? రూపాయిచ్చినవాడూ, కోట్లిచ్చినవాడూ ఇద్దరూ ఆదేవునికి సమానులేకదా....భక్తికి తలవంచే భగవంతునిముందా వీరి .....

ఆర్భాటాలు ...''.భక్తి , శ్రద్ధా , లోపించిన ఈతరం వారి పోకడలకు విచారిస్తూ ....ఆలోచనల మధ్య అడుగులేస్తూ ఇంటిదారి పడుతున్నారు వయోవృద్ధులు .
------------------------------------------------------------
రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

ఆ రెండు కళ్లు .

ఆ రెండు కళ్ళు .
*****రెండేళ్ల గౌరిని ఎత్తుకొని ,ఆరు నెలల కన్నాని ఊయలలో ఊచుతూ ,మధ్య మధ్యలో కర్రలపొయ్యి ఊదుతూ, మండే కళ్లని మాటిమాటికి తుడుచుకుంటూ వంట చేస్తున్నాది సావిత్రి .బొగ్గులకుంపటి , కొయిలాపొయ్యి, కర్రలపొయ్యి , ఇల్లు, పిల్లలు, బట్టలు తకడం , అరమైలు పొడుగున్న వాకిలి చిమ్మి ముగ్గువేయడం , ఉదయం పదిగంటలలోపు వంటచేసి భర్తకి క్యేరేజి కట్టడం ఇవన్నీ చంకదిగని గౌరిని ,ఏడుపాపని కన్నాలని సముదాయిస్తూ అవలీలగా చేసుకుపోతున్నాది సావిత్రి.

పనిమనిషి రంగమ్మ గిన్నెలు తోముతూ'' ఈపిల్లలతో ఎలా చేస్తున్నావమ్మా, ఒకరు చంకదిగరు , ఒకరు ఏడుపాపరు '' అంటుంటే సావిత్రి నవ్వుతూ '' పిల్లలు కాక అల్లరి ఎవరు చేస్తారు రంగమ్మా. నాకా ఈ పిల్లలు , ఇల్లు తప్ప ఎక్కడికీ వెళ్ళే అలవాటుకూడా లేదు . అందికే వీళ్లతోడిదే లోకం నాకు. వీళ్లిద్దరూ నారెండు కళ్ళనుకో . వీళ్లతో నాకేబాధా లేదుగానీ నువు తొందరగా పని కానీ , బాబుగారికి టైం అవుతున్నాది ...అంటూ అష్థావధానం చేస్తూనే వంట ముగించి , భర్తకి , అత్త,మామలకి ,కాఫీ,ఫలహారాలు ,ఇచ్చీ, భర్తకి క్యేరేజి చేతికి అందించింది . హడావిడిగా బయలుదేరుతున్న భర్తని గేటుదాకా సాగనంపి తిరిగి పనిలోలీనం అయ్యింది .

పధ్నాలుగు సం '' నిండక ముందే పెళ్లయిన సావిత్రి 18 సం '' వచ్చేసరికి యిద్దరు పిల్లలకి తల్లయ్యింది. చిన్న పల్లెటూరిలో ఎ. ఎస్ . ఎం . గా పనిచేస్తున్న రావుగారికి అన్నివిధాలా సహకరిస్తూ అత్త,మామల సేవలూ , ఆడబిడ్డల అచ్చట్లూ, పిల్లల ముచ్చట్ల్ల మధ్య , బాధ్యత నిండిన బరువుతో , పనిచేసే మరబొమ్మలా తయారయ్యింది .

పొద్దున్నే లేచి దుంగల్లాఉన్న కర్రలు సన్నగా నరకడం , రాక్షసి బొగ్గులు చిన్నవిగా కొట్టడం , మామగారిపూజకి పూలు సిద్ధంచేయడం , పిల్లలకి స్నానం చేయించి , భర్త బట్టలు ఇస్థ్థ్రీ చేసి , టిఫిను, కాఫీలని అందించీ వంటలో జొరబడడం .....నిముషమైనా ఖాళీలేని పనులమధ్య పిల్లల ఆటలు , అల్లర్లూ ,ముద్దుమాటల మధ్య తనచిన్ని ప్రపంచాన్ని అల్లుకుపోయింది సావిత్రి . ఆ పిల్లలంటే ప్రాణం సావిత్రికి .వాళ్లuకి ఏ చిన్నదెబ్బ తగలినా విలవిలలాడిపోయేది .

క్షణతీరిక లేకుండానే ఇరవై యేళ్లు గ డిచిపోయాయి. నడివయసుదాటిన సావిత్రి పనిభారంతో అలసిపోయింది . అందమైన ముఖం కమిలి వాడిపొయింది. కళ్లకింద నల్లటిచారలు ఏర్పడ్దాయి . ఈమధ్య తరచుగా నడుములో విపరీతంగా నొప్పి వస్తున్నాది . పని కష్థంగాఉంది . వయసు వచ్చినా గౌరికి తన స్నేహితులు, ఆటపాటలు , తప్ప , తల్లిబాధ గమనించే సమయం ఉండేదికాదు. షిఫ్ట్ డ్యూటీలతో , నిద్ర సమంగాలేని భర్తకు ఈ విషయంచెప్పి విసిగించదలచుకోలేదు సావిత్రి . బాధని దిగమింగుకుంటూ భారంగా పనులు చేసుకుపోతున్నాది . ఇంతబాధలోనీ పిల్లలు కళకళలాడుతూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ ,మధ్యమధ్యలో చిన్ని,చిన్ని తగవులుతీర్చమని దగ్గరకి వచ్చినపుడు ఆమె అదొకరకమైన ఆనందాన్నిం అనుభవించేది . వీళ్లు నాప్రాణాలు . వీళ్ల భవిష్యత్తు ఉజ్వలంగాఉండాలంటే తనబాధలు వాళ్లకి తెలియనివ్వకోడదు అనుకున్నాది .

ఎవరికీ తనబాధని చెప్పనిసావిత్రి యాంత్రికంగా తనపనులు చేసుకుపోతున్నాది . కాలం గడుస్తున్నకొలదీ నీర్సం ,తలనొప్పి, నిస్సత్తువలమధ్య గౌరి పెళ్లి , తర్వాత , పండగలూ , పురుళ్లతో సావిత్రి కండలు కరిగిపోయాయి. అయినాసరే ఆ మొఖం లో చిరునవ్వు చెదరలేదు . మనవల ఆటపాటలమధ్య తన బాధని తాత్కాలికంగా మర్చిపోడానికి ప్రయత్నిస్తూనే, ఇంటిపనులు చేసుకుపోతున్నాది .భర్తతోపాటు ,ఉద్యోగస్తుడైన కన్నాకికూడా క్యేరేజి కట్టవలసి రావడంతో తెల్లారి మూడుగంటలకే లేచి పనులు చేయవలసివస్తున్నాది సావిత్రికి . హడావిడిగా చేస్తున్న పనులతొందరలో నీళ్లుమోస్తూ కాలుజారిపడింది . ఆసుపత్రి , మందులు , ఫ్రాక్చర్ , ఆరునెలల రెష్థ్ , తర్వాత చేతికర్రలిచ్చి ఇంటికి పంపారు డాక్టర్లు. సంవత్సరం వరకు కర్రలతో నానాబధా పడి నలిగిన సావిత్రికి సాయంగా కొన్ని రోజులపాటు గౌరినిరమ్మని కోరిన రావుగారికి '' తనకి తీరదని , వాళ్లాయనకి సెలవులేదని రాసిన గౌరిజవాబుకి నిరాసచెందారు . కళ్లల్లో నీళ్లు చిమ్మేయి ''.కూతురు వస్తుంది , తనని జాగ్రత్తగా చూసుకుంటుంది . కొన్నాళ్లపాటు తనకి విస్రాంతి దొరుకుతుందని '' ఆశగా చూసే సావిత్రికి ఏంచెప్పాలో తెలీలేదు . భర్త ముఖకవలికలబట్టీ విషయాన్ని గ్రహించిన సావిత్రి మనసు బాధగా మూల్గింది . వెంఠనే కోల్కొనీ '' పసిపిల్ల , సంసారమంటే మాటలా ....అది ఎంతబాధపడుతూ అలా రాసిందో .. అసలు మీరు పిల్లకెందుకురాసారు '' అంటూ మందలించింది . ఎన్ని మందులు వాడినా, సావిత్రి తొందరగా కోలుకోలేకపోయింది .సావిత్రిలో వచ్చిన మార్పుని వయసుతెచ్చిన మార్పుగా తీర్పునిస్తూ ,నిర్లక్ష్యగా మట్లాడుతున్న కుటుంబసభ్యులని విస్తుపోయి చూడడంతప్ప ,ఏమీ చేయలేకపొయింది .తనబాధని ఎవరితోనూ చెప్పుకోలేకా సతమతమయ్యే పనులు ఒంటరిగా చేసుకోలేకా ,కాలం కాటుని భరిస్తూ , కన్నా పెళ్లి కూడా చేసింది . కోడలిరాక తర్వాత కొన్నిరోజులుబాగున్నా రానురానూ ముళ్లపోటయ్యింది .కోడలివిసుగు , చీదరింపులమధ్య ,మానసికంగా చితికిపోయింది . మూడువంతులపని తనుచేస్తున్నా ,రిటైర్ అయిన భర్త పెనషను వాళ్ల జల్సాలకి , ఖర్చులకి ఇస్తున్నా బతుకు భారమయ్యింది . కోడలి సూటీపోటీ మాటలు , నిష్థ్థూరాలూ మనసుని గాయపరుస్తూ ఉంటే , సావిత్రి సహనానికి కన్నగాడి మాటలు ఆ గాయానికి కారం పూసినట్లుండేవి . భార్య మాటలునమ్మి ,ఆమెను సమర్ధిస్తూ చేసిన రాద్ధాంతాలతో ఇల్లు నరకం అయేది .
భార్యని సమర్ధించడం , తమని కించపరచడం రోజూవారి కార్యక్రమం అయ్యింది . కొడుకుకి ఉద్యోగరీత్యా బదిలీరావడంతో రావుగారు ,తేలికగా ఊపిరితీసుకుంటే, తల్లిగా సావిత్రి గుండె బరువెక్కింది . కొత్త ఊరిలో చంటి పిల్లలతో , ఏం బాధపడతాడోనని మనసు బాధగామూల్గింది .కొడుకు వెళ్లిపోయాకా సావిత్రి మరీ వంటరిదయ్యింది . పిల్లలు, మనవల `జ్నాపకాలతో కళ్లు తడైయ్యేవి . శరీరపు వివసత్వం , మానసికపు వత్తిడి ఆమెనుబాగా కుంగదీసాయి . మూసిన కళ్లముందు తన చిన్ననాటి సంఘటనలు , తండ్రి వదిలేసిన తల్లి దీనస్థ్థితి , బీదరికం , అక్కచెల్లెళ్ల అవమానాలు, అగచాట్లు , తమపెళ్లికోసం తల్లిపడిన పాట్లు ,సినిమారీళ్లలా కదిలాయి. అక్కకాపరం నిలబెట్టడానికి తన తల్లి పడిన అగచాట్లు , మగదిక్కులేని సంసారపు నిస్సహాయత, డబ్బులేని బెంగ , పసితనం వీడని చేల్లెలి కాయకష్థ్థం ,తన అందమే తన శత్రువై నిలిచిన వైనం గుర్తుకువచ్చి గుండెలోతుల్లో కలుక్కు మంటున్నాది. కన్నీరు ధారాపాతంగా కారుతున్నాది . ఆ కన్నీటి మధ్య ఆనాటి రావుగారిరూపం ,తనని పెళ్లిచేసుకుంటాననడం , తల్లి ఆనందం అన్నీ రెపరెపలాడేయి . కానీ కట్నం లేకుండా తనని పెళ్లి చేసుకున్న రావుగారు భగవంతునిలా తోచేరు . అత్తారింటికి బయలుదేరుతున్న తనతో '' కష్థం ,అయినా, సుఖం అయినా భరించీ జాగ్రత్తగా కాపరంచేసుకోమనీ , అండలేనివాళ్లం కనక అణిగి,మణిగి ఉండమనీ కన్నీటితో వీడ్కోలు చెప్పిన తల్లిరూపం దీనంగా కనిపిస్తున్నాది . ఆమాటమీదే ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సంసారం నెట్టుకొచ్చింది . భర్తని ఏనాడూ ఇది కావాలని అడగలేదు . బయటకు వెళితే ఖర్చని ఇల్లే స్వర్గం ,పిల్లలేలోకంగా బతికింది .

తనకి జీవితాన్నిచ్చిన భర్తమీద గౌరవం ,కృతజ్నతలతో, తనకివచ్చిన ఏకష్థం అతనికి చెప్పేదికాదు . తనపిల్లలు పెద్దయితే వాళ్లే తనని చూసుకుంటారు . తనమనసు తెలుసుకొని తను అడగకుండానే తనకుకావలసినవి చేస్తారన్న నమ్మకం వమ్మయ్యింది . మానసికపు క్షోభకి మందులేదు . సావిత్రి పరిస్తితి రోజురోజుకీ దిగజారితున్నాది .

రోజూ తెల్లారే లేచే సావిత్రి పొద్దున్న ఏడైనా లేవకపొయేసరికి రావుగారికి భయం వేసింది .దగ్గరగావెళ్లిచూసేరు . సావిత్రి శరీరం వేడిగాఉంది . తెల్లటి శరీరం కమిలిపోయింది . మనిషి బాగా సన్నబడింది . కళ్లలోని నిస్పృహ , ఉబ్బిన పొట్ట ...ఇదేంటీ... ఈమె తన సావిత్రేనా... ఎంత అందమైనది , ఎలాగైపొయిందీ... రావుగారి కళ్లలోనీళ్లు తిరిగాయి . బాధ్యతల పరుగులో తను సావిత్రిని ఎంత నిర్లక్ష్యం చేసేడో అర్ధం అయ్యింది . ఏంచెయ్యాలో తోచక పిల్లలిద్దరికీ తెలియజేసేరు . కానీ చిత్రం . ఏ స్పందనాలేని జవాబు .తమకి కుదరదంటూ. ఏవేవో కారణాలు .

సావిత్రి జీవితం లో ఆసుపత్రి , మందులు , ఒక భాగంగా మారేయి . పనిచేయడానికి కూడా లేవలేని సావిత్రిని చూసుకుంటూ, ఒంటరిగా ఆమెని వదిలి , బయటి పనులుచేసుకొలేకా సతమతమయ్యిన రావుగారు కొడుకుదగ్గరకు వెళ్లిపోదామన్న ఆలోచనతో్, పరిస్థితులు వివరిస్తూ రాసిన ఉత్తరానికి జవాబుగా , తమ ఇల్లు చాలాచిన్నదనీ , మరో ఇద్దరు వస్తే ఆర్ధికంగాకూడా ఇబ్బందనీ , పెద్దఇంటికి అద్దె చెల్లించే స్తోమత తనకు లేదన్న కొడుకు జాబు గొడ్డలిపెట్టయ్యింది .
ఆలోచించగా తన పి. ఎఫ్ డబ్బుతో ఒక ఇల్లు కొంటే , ఏమీలేని తమని కోడలు సమంగా చూస్తుందా ...అన్న ఆలోచన, భార్యనే సమర్ధించే గుణమున్న కొడుకు నైజం , తర్జన,భర్జనల రూపమెత్తి , వృద్దాప్యపు బరువు చివరికి వాత్సల్యానికి ఓటు వేసింది . కన్నాపేరుమీద పి.ఎఫ్ ట్రాంస్ఫర్ అయ్యింది .ఇల్లు కొనడం , మారడం ,అన్నీ అయినా కన్నానుంచీ పిలుపురాలేదు .

ఇక్కడ పనిచేసుకోలేక , డబ్బుచాలక , మందులకి , టెష్థులకి , బేంక్ బేలంస్ లేకా రావుగారు నానాఅవస్తలూ పడుతున్నారు , కన్నా పిలుపుకోసం ఎదురుచూస్తూ...అన్నీ ఎరిగిన సావిత్రి విరక్తిగా నవ్వుకున్నాది . కానీ కన్నపిల్లలపట్ల ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు . గౌరికి వచ్చిన విష జ్వరం తగ్గడానికి ఆమెచేసిన ఉపవాసాలూ, కన్న ఆర్ధిక పరిస్థ్థితి మెరుగుపడాలని ఆమెచేసిన చన్నీటి స్నానాలూ ఆమె ఒంటిని మరింత గుల్లచేసాయి . ఆమె పూర్తిగా మంచానికి బానిసయ్యింది .

మొట్టమొదటిసారిగా సావిత్రి పిల్లల పిలుపుకై ఎదురుచూసింది , భర్త బాధ చూడలేకా .... పిల్లలదగ్గరకు వెళ్లిపోదామన్న మాటను చిరు నవ్వుతో తోసిపుచ్చే సావిత్రి , ఒకరోజు హఠాత్తుగా కొదుకుదగ్గరకు వెళదామనడంతో , అన్నదే తడవుగా ప్రయాణానికి సిద్ధం అయ్యేరు .

అత్త,మామల రాక కంట్లో నలుసయ్యింది కోడలికి . భర్తతో పోరీ, పోరీ వేరే అద్దెఇంటిలో దింపింది . సావిత్రి, రావుగార్లలకి నోట మాట రాలేదు. గుట్టెరిగిన సావిత్రి మౌనంగా కన్నీరు కార్చింది .తిరిగి చాకిరీ , ఒంట, తప్పలేదు ఇద్దరికీ. ఈ కష్థం లోనే చిన్ని సంతోషం . కొడుకు , మనుమలు దగ్గరగా ఉన్నారు కదా అని . మనుమల ఆట,పాటలతో కొంతవరకు బాధని మర్చిపోగలిగింది . మర్మమెరుగని మనుమల కోరికలు తీర్చేందికు, చిరు వంటలు చేయడానికి ప్రయత్నిస్తున్న సావిత్రి ,ఒకరోజు పనిచేస్తూ కుప్పకూలింది . తిరిగి లేవలేని సావిత్రి ఆసుపత్రిలో పదిరోజుల పోరాటం అనంతరం , డాక్టర్ లు సావిత్రి జీవితాన్ని కొన్నిరోజుల కొలబద్దతో ముడిపెట్టి వెళ్లిపోయారు .

కొన్నిరోజులంటే వారాలా, నెలలా సం వత్సరాలా..? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఈ పరిస్థితిలో ఈమెకు ఎవరు సేవలు చేస్తారు ?

కొడుకు బాధ్యత తీసుకోకపోతే తను ఈ వయసులో ఏం చెయ్యగుడు ? చేసినా ఎన్నాళ్లు ....రావుగారి ఆలోచన .......

చచ్చాం | ఇంక ఈవిడగారి సేవతోనే తన జీవితంకాబోలు ..తొందరగా తేల్చు భగవంతుడా...కోడలి కోరిక ....

ఇప్పటికే వచ్చీ పదిహేను రోజులయ్యింది మరదలి వ్వవహారం చూస్తే ,అమ్మని చూసినట్టు లేదు ..తనుమాత్రం ఎన్నాళ్లు ఉండగలదు ..? కూతురి తర్జన, భర్జన......

ఎన్నాళ్లు ఉంటుందో తెలీని పరిస్తితులలో ఈ ఆసుపత్రి ఖర్చులు తను భరించగలడా....మధ్యతరగతి .కొడుకు సంఘర్షణ .....

ఇవన్నీ కలిపీ , అందరి స్వార్ధపు ఆలోచనలసారం ...'' భగవంతుడా...ఈమెని తొందరగా తీసుకుపో ''...........

ఇవేవీ తెలీని సావిత్రి కళ్లలో కొత్తకాంతి . తనకు బాగులేదనగానే కూతురు పరుగెత్తుకు వచ్చింది . కొడుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు . భర్త పదే పదే భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాడు . ఎంతైనా నా పిల్లలు నాపిల్లలే . నా రెండు కళ్లు . నా ఊపిరి . సావిత్రి సంత్రుప్తిగా కళ్లుమూసుకుంది .

సావిత్రి కళ్లుమూసిన ప్రతీసారీ అందరిలో వచ్చిన ఒకేఒక ఆలోచన ...నిద్రా...నిష్ర్క్రమణా ....

ప్రతీరోజూ అందరి ఎదురుచూపులూ తోసిపుచ్చీ కళ్లుతెరిచిన సావిత్రిని ఉస్సురంటూ చూసేవారు . అందరిమధ్యా వాదోపవాదాలే....చాకిరీగురించి , ఖర్చులగురించి, .....

ప్రతిఒక్కరూ మర్చిపోయారు ఆమె తమకోసం ఎంత శ్రమపడిందనీ.....ఈనాటి ఆమె పరిస్థితికి కారకులు తామేనని . రక్తసంబంధం రిక్తసంబంధం అయ్యింది .ఆదుకోవలసిన క్షణంలో అసహనాన్ని కనపరుస్తున్నారు కావలసినవారంతా......

భర్త, పిల్లల మొహాలలో అసహనాన్ని ,విసుగుని లీలగా గుర్తించిన సావిత్రి చిన్నగా నవ్వుకుంది . మంచం పట్టినవారిని ఎవరుమాత్రం ఎంతకాలం చూడగలరు . బతికున్నన్నాళ్లు తనపనితాను చేసుకున్నాది . ఇంక ఎవరిమీదా ఆధారపడడం తనకిష్థం లేదు . '' భగవంతుడా...తొందరగా నన్ను తీసుకుపో ....అలసిపోయాను ప్రభూ .......నాపిల్లలని కష్థపెట్టకు .నా ఎదురుగా వాళ్లు ఏప్పుడూ సంతోషంగా ఉండాలి . నాగురించి వారిని ఇబ్బంది పెట్టకుతండ్రీ....మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధించింది .

కళ్లుతెరిచి చుట్టూ చూసింది . భర్త , కూతురు . కొడుకు కోడలు , మనుమలు , .....కాంతిహీనమైనకళ్లతో సంత్రుప్తిగా అందరినీచూసింది . అలా చూస్తూనేఉంది ..

ఆకళ్లు తిరిగి మూసుకోలేదు .అందరినీ తనివితీరా చూసిన ఆనందం తట్టుకోలేని ఆమె గుండె చప్పుడు కాకుండా జారుకుంది . విప్పారిన ఆరెండుకళ్లలో గౌరీ, కన్నల ప్రతిరూపాలు అస్పష్థంగా కనిపిస్తున్నాయి .
అన్ని బంధాలూ తెంచుకొని ఆమె ఆత్మ ఆశీర్వాదాల ఆస్తినొదిలి అందరానిలోకాలకు పయనమయ్యింది.

ఎక్కడనుంచో '' అనుబంధం , ఆప్యాయత అంతా ఒక బూటకం , ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకొనే నాటకం '' అనే పాట ,అపశృతిలా విని పిస్తున్నాది, రేపటి మీ పరిస్తితి కూడా యింతే , అన్నట్లుగా...........

                    రచయిత్రి..
శ్రీమతి పుల్లాభట్ల  జగదీశ్వరీ ముార్తి.
                              కల్యాణ్.

-----------------------------

విలువలు.

వాస్తవానికి దగ్గరగా.......

విలువలు. ( కధపేరు ).
*****

రాత్రి రెండు గంటలు అవుతున్నాది . దించిన తల ఎత్తకుండా బొమ్మలు చేస్తున్నాడు వీరన్న . రెండు రోజులలో బ్రహ్మొత్స్వాలు ప్రారంభం అవబోతున్నాయి .

కులదైవంఐన శ్రీ వేంకటేశ్వరుని వైభవోపేతంగా అలంకరించి జరిపే ఉత్సవాలకి కోట్లకొలదీ వచ్చే జనం , ఈ దేవుని బొమ్మలని , విగ్రహాలని భక్తితో కొని తీసుకువెళతారు . ఈ రెండురోజులూ కష్థపడి మరిన్ని బొమ్మలు చేయగలిస్తే నెల్లాళ్లపాటు తిండిగింజలకి లోటు ఉండదు . ఆలోచిస్తూనే తలెత్తీ యధాలాపంగా చూసేడు వీరన్న .

భార్య మాలచ్చిమి బంకమట్టిని కలిపి , కలిపి ఆ మట్టికొట్టిన చీరతోనే అలసటగా పడుక్కున్నాది . కోడలు రంగి నేడో రేపో ప్రసవించేట్టు ఉంది . బరువుగా కనులు మూసుకొని చిన్నగా మూలుగుతున్నాది. ఎనిమిది సంవత్సరాల మనుమడు సిన్నోడి చిన్నారి చేతులు రంగులు కలిపీ, కలిపీ చిదిమిపోయాయి . చేతికి రాసిన ఆవనూని తుండుగుడ్డమీద మరకలుగా తేలింది . అలసిన సిన్నోడు ఆదమరచి నిద్రపోతున్నాడు .

నిద్రరానిదల్లా వీరన్నకే. ప్రతీఏడూ ఏదోఒక ఉత్సవం జరగడం తనుకాక ఆ చుట్టుపక్కలవాళ్లు కూడా ఈ బొమ్మలమీదే ఆధారపడి ఉండడంతో పోటీలుగా బొమ్మలు తీర్చడం , రంగులు పూసి బారులుగా ఎండబెట్టడం , అమ్మకానికి సిద్ధం అయినవాటిని దొంతులుగా కట్టి , వాటిని దుకాణాలకి అమ్మడం పరిపాటి. వారి ఒప్పందం ప్రకారం బొమ్మకి 15 రూ'' మించి రాదు . అదేబొమ్మ దుకాణం లో 200 కి తక్కువ అమ్మరు .

ఈరకమైన ఉత్సవాల్లో గిరాకీ బాగానే ఉంటుంది . కానీ శ్రమకి తగ్గ ఫలితం రాని కారణంగా గూడెం వారిని బీదరికపుచాయలు వదిలిపోవడం లేదు . ఈసారి మాత్రం తను పాతికకి ఒక్కరూపాయి కూడా తగ్గేదిలేదు .మూడు నెలలక్రితం " ఈ బొమ్మలవల్ల తమసంసారం గడవదు ,పట్నం వెళ్లి కూలడబ్బులు తెస్తా" నంటూ వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు .భార్య, మనుమడితోపాటు కోడలి పురిటిఖర్చు కూడా తనమీద పడడంతో వీరన్నకి నిద్రకరువైయ్యింది .

మొన్న గర్భగుడి పూజారిగారు వచ్చి మూడడుగుల మట్టి విగ్రహాన్ని మలచమని , ఎవరో పెద్దలు స్వామివారి కల్యాణం చేయించుకొని ఆ విగ్రహాన్ని తమతో తీసుకువెళ్తారని ,డబ్బుకూడా బాగానే్ ఇస్తారని చెప్పడంతో , ఆశగా మట్టివిగ్రహానికి శ్రీకారం చుట్టేడు .

విగ్రహం తయ్యారయ్యింది . రంగులకలయిక అద్భుతంగా కుదిరింది. అందమైనవిగ్రహాన్ని అపురూపంగాచూస్తూ జాగ్రత్తగా వారగా పెట్టేడు . రేపు సేఠ్ యిచ్చిన డబ్బులతో కోడలిని ఆసుపత్రిలో చేర్పిస్తాడు . పుట్టబోయే బిడ్డకి మెత్తటి ఊయల కొంటాడు . మాలచ్చింకి పూల రవికెలు కొంటాడు .
ఎవేవో లోకాల్లో విహరిస్తున్న వీరన్న సేఠ్ ని తీసుకొని పూజారిగారు రావడంతో ఈ లోకంలోకి వచ్చేడు . 500 అయినా ముడుతుందనుకున్న విగ్రహం వెల 125 / రూ'' భారంగా ముగిసింది .

*****

చేసిన బొమ్మలు అమ్మకానికి పోనేలేదు. కోడలికి పురిటినొప్పులు ప్రారంభం అయ్యేయి . దిక్కుతోచని వీరన్న మంత్రసానికోసం పరుగెత్తాడు . పురిటినొప్పులతో వేసే కోడలి కేకలకి చెట్టుమీదున్న కాకులు చెల్లాచెదురయ్యాయి .
*****

గుడిలో వీరన్నచేసిన విగ్రహానికి బంగారునగలతో అలంకరణ చేసేరు . స్వామివారి నివేదనకు పంచభక్ష్యాది పానీయాలను సిద్ధంచేసారు .రవ్వలుపొదిగిన బంగారుభరణాలతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాది . ఏడువారాలనగలతో బరువెక్కిన విగ్రహంతోపాటు , భారీకాయాల పూజారులను,పల్లకిలో మోస్తున్నారు నలుగురు బక్కచిక్కిన బడుగు ప్రాణులు . ఊరేగింపు తర్వాత దొరికే 10/ రూపాయలతోపాటు సేఠ్ పెట్టే తిండికోసం .

*****

వీరన్న కోడలికి కానుపు కష్థం అయ్యింది పట్నం తీసుకువెళ్లే స్తోమతలేని వీరన్న, మాలచ్చిమి భోరున విలపిస్తున్నారు, కనపడని దేవుణ్ణి ప్రార్ధిస్థూ . మంత్రసాని బిడ్డ అడ్డంతిరిగిందని చెప్పిన మాట సమ్మెటపోటయ్యింది వీరన్న దంపతులకు. దిక్కుతోచని స్థితిలో , కూరగాయలమ్మే మల్లన్న తోపుడుబండిలో కోడలిని వేసుకొని మైళ్లదూరంలో ఉన్న పట్టణానికి పరుగుతుసేరు వీరన్న దంపతులు .

నడినెత్తిమీద ఎండ, చెప్పులులేని కాళ్లు, కాలే కడుపు, డబ్బులేని బతుకులతో చెడుగుడటలాడుకుంటున్నాయి . బరువుగా బండిలాగుతున్న వీరన్నకి ఊరేగింపు ఎదురయ్యింది .జనం, జనం, జనం. ,గోవిందనామాల హొరు తప్పించుకొని తొందరగావెళ్లాలని '' జరగండెహె '', అంటూ అరుస్తూ అప్రయత్నంగా తలెత్తిన వీరన్నకి , తనుచేసిన స్వామివిగ్రహం సర్వాలంకరణలతో కళకళలాడుతూ కనిపించింది . మనస్సులో ఆనందకెరటం ఉవ్వెత్తునలేచింది . సామీ అంటూ భక్తిగా నమస్కరించేడు . ఊరేగింపుకి అడ్డంగాఉన్న వీరన్నని బండితోసహా ఎవరో ఒక్కతోపు తోసేరు .నొప్పులతో అరుస్తున్న వీరన్నకోడలి అరుపులు గోవిందనామాల గోలలొ కొట్టుకుపోయాయి. ప్రాణమున్న మనిషికాన్నా, ప్రాణం లేని విగ్రహానికి భక్తిపేరుతో '' విలువలు '' కట్టీ , గొర్రెలమందలా తరలిపోతున్నారు జనం . తనుచేసిన ప్రాణమున్న బొమ్మల మూర్ఖత్వానికి మారుమాటరాని దేముడు , వీరన్నకి వచ్చిన కష్థానికి చేయూతనిచ్చే సమయం తనకికూడా లేదన్నట్లు బంగారుపల్లకీలో గుంభనంగా, గంభీరంగా తరలిపోతున్నుడు . పక్కనుండీ వీరన్న తోపుడు బండి బరువుగా కదిలింది .
*****

స్వామివారి కల్యాణం మొదలయ్యింది .దేదీప్యమానంగా అలంకరించబడ్డ పందిరిలో స్వామివారు మంగమ్మలకు నవరత్నాల తలంబ్రాలు పోస్తున్నారు . భక్తులంతా చల్లటిపానీయాలు తాగుతూ ,సేఠ్ జీని కొనియాడుతున్నారు .దర్పంగా కూర్చున్న సేఠ్ , అడుగులకి మడుగులొత్తుతున్నారు పూజారులు .తమకికూడా దండీగా దక్షిణ మట్టవచ్చన్న ఆశతో.

*****

ఊరేగింపురద్దీలో అరగంట ఆలస్యంగా మునిసిపల్ ఆసుపత్రి చేరాడు వీరన్న . స్పృ హ తప్పబోతున్న కోడలిని మోస్తూ లోనికి తీసుకువెళ్లేరు .
ఖాళీల్లేకా వరండాలసైతం నిండిఉన్నారు రోగులు. డాక్టర్ రాని కారణంగా గంతలతరబడీ నిరీక్షిస్తున్న రోగులు వీరన్న పరిస్థితిచూసీ నిట్టూర్పు వదిలేరు . పురిటినొప్పులకి తాళలేని కొడలిని ఒక్కసారి చూడమని దైన్యంగా బతిమాలుతున్నాది మాలచ్చిమి నర్సులని . కోడలి గొంతుక తడారడంతో సోడా తేవడానికి పరుగెత్తాడు వీరన్న , గుక్కెడు నీళ్లుకూడారాని మునిసిపల్ కొళాయిని తిట్టుకుంటూ .

*****

స్వామివారిపై మంగళ స్నానాది, అభిషేకాలపేరుతో పాలు, నీరు ,పెరుగు, తేనె, ఏరులై పారుతున్నాయి. భజంత్రీల ఘోష ఆకాసాన్నంటుతున్నాది . అక్షతలు , పూలూ జల్లుగా కురుస్తున్నాయి స్వామిమీద .

పెళ్లికొడుకుగా స్వామి ప్రత్యేకదర్సనం యిస్తున్నారు వి .ఐ . పి . లకి . నోట్లకట్టలు చేతులు మారుతున్నాయి . ఫలితం... స్వామి వారి గర్భగుడిలోకి కొన్ని గంటలనుంచీ , లక్షలకొలదీ నిలుచున్న జనం లైనులో మొదటి వారుగా పంపబడుతున్నారు .

*****

కొన్ని గంటలతర్వాత వచ్చిన డాక్టరుని కాళ్లా వేళ్లా పడి బతిమాలుతున్నారు వీరన్న దంపతులు .'' కేసు క్రిటికల్ కండీషనులో ఉంది కనకా ఆపరేషనుకి ,టెష్ట్  లకి ఖర్చవుతుందనీ, దబ్బుతేవకుంటే పనికాదని, '' ఖచ్చితంగా చెపుతున్న మాటలు విని నీరుకారిపోయాడు వీరన్న. దేముడా అంటూ కూలబడ్డాడు. అతని కళ్లముందు తను మలచిన స్వామి విగ్రహాలు వలయాల్లా తిరుగుతున్నాయి. ఈరోజుకి తనని ఆదుకుంటుంనుకున్న మట్టివిగ్రహం మాధవుడి రూపం లో మంగళహారతులందుకుంటున్నాది .ఏ రూపాన్ని తను బతుకుతెరువుగా ఎంచుకున్నాడో , ఆ దేవుడు తనని ఏనాడూ కరుణించలేదు.

అయినా తను ఏనాడూ బాధపదలేదు .అంతా తన ఖర్మ అనుకున్నాడు.ఇప్పుడు కనీసం 500/ అయినా ఉంటేగానీ కోడలి పరిస్థ్థితి కుదుటపడినట్లు లేదు.తన దగ్గర 80/ రూ| మించీ లేదు. ఆకలికి పేగులు చుట్టుకు పోతున్నాయి . ఆకలని చెప్పలేకా ముడుచుకొని కూర్చుంది మాలచ్చిమి బేలగా. ఈరోజయినా ఏ దేముడైనా కరుణించీ , డాక్టర్ బాబు రూపం లొ వచ్చి కోడలి పురుడు సవ్యంగా జరిపిస్తాడేమోనని ఆశగా చూడడంతప్ప ఏమీ చేయలేకపోయాడు వీరన్న. నిస్త్రాణ  గా కూలబడ్డాడు వెలసినగోడలకానుకొని .

*****

విందుభోజనాలతో స్వామివారి కల్యాణం పూర్తయ్యింది . బ్రేవ్ మన్న త్రేనుపులతో మండపం ప్రతిధ్వనిస్తున్నాది . పెళ్ళిలో అలసిన స్వామివారి జంటని ఉయ్యాలలో సేదతీరుస్తున్నారు పూజారులు. అలసిన స్వామి మంగాసమేతుడై చిద్విలాసంగా నిద్రిస్తున్నాడు , తనకేంపట్టనట్టు .

*****

నొప్పులు ఎక్కువైన వీరన్న కోడలిచుట్టూ అక్కడి ఆడవారంతా మూగేరు . అరగంట యాతన తర్వాత బిడ్డ బయటపడింది . వీరన్న కోడలు అలసటగా మూసిన కళ్ళు తిరిగి విప్పలేదు .

పుట్టిన ఐదినిముషాలలోనే చారెడు కళ్ళు విప్పి చుట్టూ చూసింది పురిటికందు .తనేదో ఈ ప్రపంచం లో బావుకుందామన్న ఆశతో...

                       రచయిత్రి..   శ్రీమతి  ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.   కల్యాణ్.