ఏమే...ఒసేయ్ .
*****
ఒసేయ్ ...ఇలారా | గర్జించిన తండ్రిముందు వణుకుతూ వచ్చి నిల్చుంది ఏడు సంవత్సరాలు నిండని చిన్నారి మల్లి .
కాళ్లుకడుక్కుందికి నీళ్లుపట్రా... చెప్పులువిడిచీ . .. మల్లివేపుచూస్తూ ఆజ్నాపించేదు తండ్రి.
ఒసేయ్ ... ఇలారా... నేనుకాస్తా రంగమ్మత్త ఇంటికి వెళ్తాను , వచ్చేసరికి ఆ కాస్తా అంట్లు తోమిపెట్టు ,తమ్ముడిని ఎత్తుకువెళ్తూ అమ్మ .....ఆర్డర్ .
ప్రతీరోజూ ఒసేయ్ అన్న పిలుపుతోపాటు మరుగుపడుతున్న తనపేరుని జ్నాపకం తెచ్చుకుందికి కూడా సమయం లేకా...కాలంతో రాజీ పడింది మల్లి. తమ్ముడిని మాధవా ... మాచిన్ని కన్నా అని పిలుస్తూ గారం చేస్తున్న అమ్మ, నాన్నలు తనని '' ఒసేయ్ '' అంటూ ఎందుకు పిలుస్తున్నారో అర్ధంకాకా , కాలంతో పాటు తనకి నచ్చని పిలుపు '' ఒసేయ్ ''తో రాజీ పడింది .
కరిగే కాలంతో , పెరిగే వయసు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది .కన్నుమూసిన తల్లి భారాన్ని పూర్తిగా తనపై వేసుకొని బండెడు చాకిరీతో భారంగా ఒదిగింది పదిహేను సంవత్సారాల మల్లి.
ఒసేయ్ | ఇలారా... తండ్రి పిలుపుకు జవాబుగా ఎదురుగావచ్చి నిల్చుంది పెళ్లివారొస్తున్నారు , వెళ్లి తయారవ్వు , తండ్రి హూంకరింపు . 15'' సం '' తనకు పెళ్లా....? ఆలోచనలమధ్య ,ఇరుగు,పొరుగుల హాస్యాల మధ్య ఏవేవో తీపి లోకాల్లోకి వెళ్లిపోయింది .
అవును , తనకి పెళ్లయితే '' ఒసేయ్ '' అన్నమాట ఇంక వినపడదు . మల్లీ.....అంటూ ..ప్రేమగా పిలిచే భర్త , అత్తగారు , ఆడబిడ్డలూ.... అవును , తను అత్తవారింట '' మల్లి '' గా మన్ననలు అందుకుంటుంది. ఆనందంతో అందంగా తయారయ్యింది .
పెళ్లిచూపులూ, కట్నాలూ, తాంబూలాలూ, ఆఖరికి పెళ్లికూడా అయ్యింది . పులకరించే మనసుతో అత్తారింట అడుగుపెట్టింది .
అత్తింట్లో మొదటిరోజే నిరాశ ఎదురయ్యింది '' ఒసేయ్ '' నా పర్సేదీ... అన్న భర్త పిలుపుకి కంట్లో నీళ్లుతిరిగేయి .ఒకరి తర్వాత ఒకరిగా ఆ యింట్లొ అందరూ పిలిచే '' ఒసేయ్ '' అన్న పిలుపుకి రాజీపడింది ., తమ్ముడిని మాధవ్ గా, తనని '' ఒసేయ్'' గా మార్చిన కాలాన్ని నిందిస్తూ.....
సంవత్సరాలు రోజుల్లా, రోజులు క్షణాల్లా , నలుగురు పిల్లలకి తల్లిగా...బండడు చాకిరీకి బానిసగా...మార్దవం ఎరుగని మల్లి , బడలి, వడలీ , మంచం పట్టింది.
'' ఒసేయ్ '' పొద్దెక్కింది ,వేగం లేచీ తగలడు . వెధవ రోగమా...అని , ఎక్కడలేని డబ్బూ.. దీని జబ్బులకే .''..భర్త విదిలింపు ....
'' ఒసేయ్ | ఎన్నాళ్లీ నంగనాచివేషాలు , పడుక్కుంటే పన్లెలాఅవుతాయీ...'' అత్తగారి ఈసడింపు ..'' చేసినచాకిరీచాలు .. చాలించు నీ ఓర్పు '' నిస్థ్థ్రాణగా పడివున్న శరీరానికి ,మనసు ఇచ్చే తీర్పు , కంట్లోంచీ కారుతున్న కన్నీటి ఓదార్పు .
మగతగా పట్టిన నిద్దురలో... చెదురు మదురుగా మెదులుతున్న జ్నాపకాలు . చెవులో...''.ఒసేయ్ ...ఒసేయ్ ....ఒసేయ్ '' ల హొరు . ఒక్కటంటే ఒక్కటైనా తీపి జ్నాపకం ఎరుగని మల్లి మనసు మూగగా రోదించింది .
'' ఒసేయ్ ''...ఎవరెవరో పిలుస్తూ ....ఏదేదో చెప్తూ ....ఎన్నెన్నో అంటూ.....
మల్లికి మాత్రం ఏమీ స్పష్థ్థంగా వినపడడం లేదు . కంటిముందు బంగారు వెలుగు ....ఆ వెలుగులో ఎవరో చేతులుచాస్తూ ప్రేమగా పిలుస్తున్నారు .'' రా...మల్లీ ''...అంటూ....
అదే...అదే... ఈ పిలుపుకోసమే తను ఇన్ని సంవత్సరాల నుంచీ ఎదురుచూసినది . తనను తానుగా గుర్తింపబడిన ఈ తీయని పిలుపు ......ప్రేమగా తనను అందరూ పిలవాలనుకున్న చల్లని పిలుపు ...చిన్నప్పటినుండీ తను ఆశగా వినాలనుకున్న తీయని పిలుపు ...తనకి పెట్టిన అందమైన పేరుగా మూలపడిన ముద్దుల పిలుపు '' మల్లి ''....మధురంగా.....మృదువుగా......ప్రేమగా.....
'' మల్లి '' కళ్లుమూసింది సంత్రుప్తిగా.....అనంత విస్వబాహువుల్లో సేదతీర్చుకోవడానికి ...అందనితీరాలకి పయనిస్తూ....
'' మల్లి '' గా పరిమళిస్తూ...
___________________
రచన, శ్రిీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment