Tuesday, November 10, 2009

మధుర స్మృతి .

*****
మధుర స్మ్రుతి.
---------------------
హడావిడిగా భర్తని ఆఫీస్ కి , అల్లరిచేసే పిల్లలని స్కూల్ కి పంపీ భారంగా ఊపిరితీసుకున్నాను. అలసిన శరీరాన్ని సేదతీరుస్తూ ఈజీ చైర్ లో నడుం వాల్చేను . రిలేక్స్ అవుతున్న నా చెవులకి హాయిగా వినిపిస్తున్నాదొక చప్పుడు. టప్ ....టప్ ......టప్ .......

అలసట మర్చీ , ఒక్కసారిగా లేచీ కిటికీవైపు పరుగెత్తేను. '' బయట పడుతున్న వర్షం '' ఒక్కసారిగా నాపై చిరుజల్లుగా.....చల్లగా....హాయిగా....... పడీ.... సేద తీర్చినట్లయ్యింది . ఉత్సాహం గా పెరటిలోకి పరుగెత్తేను. వర్షం లో తడుస్తూన్న నన్ను, నా ఆలోచనలు , ఏవేవో మదుర స్మృతులలోకి తీసుకువెళ్లేయి .

'' వర్షం '' ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నులముందు , కదలాడే చిన్నప్పటి చిరుఝల్లుల జ్నాపకాలు.........అవును ...ఇదే వర్షం .....వర్షం లో తనూ, తన స్నేహితురాళ్లూ.... ఆట , పాటలూ....గిల్లికజ్జాలూ.....

*****

చేతుల్లో వేతులువేసీ '' వానా వానా చల్లప్పా...'' అంటూ పాడుకుంటూ , గుండ్రంగా గింగిరాలు తిరిగే
చిన్ననాటి చిలిపి సరదాలు ......

చెట్ల ఆకులపై పడే వర్షపు నీటిబొట్ల ని , నోరుపట్టీ జుర్రుకొనే ఆనందపు క్షణాలు .........

గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడ్తూ జిలిబిలి కబుర్లతో , తడుస్తున్న ఒంటిని తోపులాటలతో ఇంకా తడుపుకుంటూ స్కూలుకి వెళ్లే ఎత్తుపల్లాల కాలిబాటలు ........

వర్షానికి తడిసిన పచ్చని గడ్డి , వేసిన తివాచీల తోరణాలు.........ఎదిగిన పైరు బాలలు తడిసీ తలవంచే సిగ్గు సింగారాలు ....వర్షపు నీటిలో తడిసిన ముద్ద మందారాలు , నిండిన నీటి మడుగుల్లో వయ్యారంగా వాలి, కవ్వించే కలువభామల మేని సొగసుల
......... వయ్యారాలు...................

చిరుజల్లులతో కలిపి వీచే చల్లని గాలుల నుండీ వచ్చే , తడిసిన మట్టి సుగంధాలు .......

పిల్లకాలువల పారే నీటిలో పోటీలతో వేసే , రంగు రంగుల కాగితపు పడవల పరుగుల వరుసలు ......

వేడి, వేడి ఫల్లీలు తింటూ... ఉరుములశభ్దాన్ని వింటూ...., మెరిసే మెరుపుల్ని వింతగా చూసే , అమాయక
విస్మయ చిన్నారి చూపులు .....

శ్రావణమాసపు నోముల సందడిలో , పట్టు పరికిణీ..పావడాల రెప రెపలతో..., అమ్మ చేయి పట్తుకొని,
అమ్మలక్కల ఇళ్లకి '' పేరంటానికి '' వెళ్లే తోవలో , గుడి నుంచీ వినిపించే జేగంటల చిరు గణ, గణలు ......

అట్లతదియరోజు ఐదు గంటలకే లేచీ , '' ఉట్తికింద ముద్దలు '' తిని , ఊయలలాటకై ఉత్సాహంగా
పరుగులుతీసే కాలిమువ్వల గలగలలు ........

రాత్రి కాగానే నానమ్మ పక్కలో వెచ్చగా ఒదిగీ , ఆమె చెప్పే చిట్టి పొట్తి కధలు వింటూ...
భయం, ఆశ్చర్యం , ఆనందాల మిశ్రమాల పసిహృదయపు పులకరింతలు .......

ఇలా ఎన్నో....ఇంకెన్నో.....చిన్ని చిన్ని చిలిపి జ్నాపకాలు, నాలో ఇంకా మాసిపోని బాల్యస్మృతులు .
ఆ రోజుల్లో ప్రతీ రోజూ ఒక కొత్త వెలుగు. ప్రతీక్షణం ఒక నందనవనం , మరువరాని , మరవలేని మధుర తరంగాలు .....

ఆ రోజులు తిరిగి వస్తాయా......? అలోవకగా ఆలోచిస్తున్న నేను, చెవులకి వినిపించే కాలింగ్ బెల్
మోతకి ఉలిక్కి పడి , గడియారం వేపు చూసేను . సాయంత్రం 5.30 కావస్తున్నాది .

పాత జ్నాపకాల అలల్లో కదలాడే నాకు కదలిపోయే సమయం తెలీలేదు '' ఉస్సురంటూ '' పెరట్లోంచీ
కదిలేను . ఆయనా, పిల్లలూ వచ్చినట్లున్నారు ...'' టిఫిను ఏమి చేయాలబ్బా '' అనుకుంటూ , తలుపుతీసీ వంటింటివైపు కదిలేను ............

'' రొటీను '' గా............
-----------
రచన , శ్రీమతి..
పుల్లాభట్ల జగదిీశ్వరిీ ముార్తి.
కల్యాణ్.
-----------

No comments:

Post a Comment