వాస్తవానికి దగ్గరగా.......
విలువలు. ( కధపేరు ).
*****
రాత్రి రెండు గంటలు అవుతున్నాది . దించిన తల ఎత్తకుండా బొమ్మలు చేస్తున్నాడు వీరన్న . రెండు రోజులలో బ్రహ్మొత్స్వాలు ప్రారంభం అవబోతున్నాయి .
కులదైవంఐన శ్రీ వేంకటేశ్వరుని వైభవోపేతంగా అలంకరించి జరిపే ఉత్సవాలకి కోట్లకొలదీ వచ్చే జనం , ఈ దేవుని బొమ్మలని , విగ్రహాలని భక్తితో కొని తీసుకువెళతారు . ఈ రెండురోజులూ కష్థపడి మరిన్ని బొమ్మలు చేయగలిస్తే నెల్లాళ్లపాటు తిండిగింజలకి లోటు ఉండదు . ఆలోచిస్తూనే తలెత్తీ యధాలాపంగా చూసేడు వీరన్న .
భార్య మాలచ్చిమి బంకమట్టిని కలిపి , కలిపి ఆ మట్టికొట్టిన చీరతోనే అలసటగా పడుక్కున్నాది . కోడలు రంగి నేడో రేపో ప్రసవించేట్టు ఉంది . బరువుగా కనులు మూసుకొని చిన్నగా మూలుగుతున్నాది. ఎనిమిది సంవత్సరాల మనుమడు సిన్నోడి చిన్నారి చేతులు రంగులు కలిపీ, కలిపీ చిదిమిపోయాయి . చేతికి రాసిన ఆవనూని తుండుగుడ్డమీద మరకలుగా తేలింది . అలసిన సిన్నోడు ఆదమరచి నిద్రపోతున్నాడు .
నిద్రరానిదల్లా వీరన్నకే. ప్రతీఏడూ ఏదోఒక ఉత్సవం జరగడం తనుకాక ఆ చుట్టుపక్కలవాళ్లు కూడా ఈ బొమ్మలమీదే ఆధారపడి ఉండడంతో పోటీలుగా బొమ్మలు తీర్చడం , రంగులు పూసి బారులుగా ఎండబెట్టడం , అమ్మకానికి సిద్ధం అయినవాటిని దొంతులుగా కట్టి , వాటిని దుకాణాలకి అమ్మడం పరిపాటి. వారి ఒప్పందం ప్రకారం బొమ్మకి 15 రూ'' మించి రాదు . అదేబొమ్మ దుకాణం లో 200 కి తక్కువ అమ్మరు .
ఈరకమైన ఉత్సవాల్లో గిరాకీ బాగానే ఉంటుంది . కానీ శ్రమకి తగ్గ ఫలితం రాని కారణంగా గూడెం వారిని బీదరికపుచాయలు వదిలిపోవడం లేదు . ఈసారి మాత్రం తను పాతికకి ఒక్కరూపాయి కూడా తగ్గేదిలేదు .మూడు నెలలక్రితం " ఈ బొమ్మలవల్ల తమసంసారం గడవదు ,పట్నం వెళ్లి కూలడబ్బులు తెస్తా" నంటూ వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు .భార్య, మనుమడితోపాటు కోడలి పురిటిఖర్చు కూడా తనమీద పడడంతో వీరన్నకి నిద్రకరువైయ్యింది .
మొన్న గర్భగుడి పూజారిగారు వచ్చి మూడడుగుల మట్టి విగ్రహాన్ని మలచమని , ఎవరో పెద్దలు స్వామివారి కల్యాణం చేయించుకొని ఆ విగ్రహాన్ని తమతో తీసుకువెళ్తారని ,డబ్బుకూడా బాగానే్ ఇస్తారని చెప్పడంతో , ఆశగా మట్టివిగ్రహానికి శ్రీకారం చుట్టేడు .
విగ్రహం తయ్యారయ్యింది . రంగులకలయిక అద్భుతంగా కుదిరింది. అందమైనవిగ్రహాన్ని అపురూపంగాచూస్తూ జాగ్రత్తగా వారగా పెట్టేడు . రేపు సేఠ్ యిచ్చిన డబ్బులతో కోడలిని ఆసుపత్రిలో చేర్పిస్తాడు . పుట్టబోయే బిడ్డకి మెత్తటి ఊయల కొంటాడు . మాలచ్చింకి పూల రవికెలు కొంటాడు .
ఎవేవో లోకాల్లో విహరిస్తున్న వీరన్న సేఠ్ ని తీసుకొని పూజారిగారు రావడంతో ఈ లోకంలోకి వచ్చేడు . 500 అయినా ముడుతుందనుకున్న విగ్రహం వెల 125 / రూ'' భారంగా ముగిసింది .
*****
చేసిన బొమ్మలు అమ్మకానికి పోనేలేదు. కోడలికి పురిటినొప్పులు ప్రారంభం అయ్యేయి . దిక్కుతోచని వీరన్న మంత్రసానికోసం పరుగెత్తాడు . పురిటినొప్పులతో వేసే కోడలి కేకలకి చెట్టుమీదున్న కాకులు చెల్లాచెదురయ్యాయి .
*****
గుడిలో వీరన్నచేసిన విగ్రహానికి బంగారునగలతో అలంకరణ చేసేరు . స్వామివారి నివేదనకు పంచభక్ష్యాది పానీయాలను సిద్ధంచేసారు .రవ్వలుపొదిగిన బంగారుభరణాలతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాది . ఏడువారాలనగలతో బరువెక్కిన విగ్రహంతోపాటు , భారీకాయాల పూజారులను,పల్లకిలో మోస్తున్నారు నలుగురు బక్కచిక్కిన బడుగు ప్రాణులు . ఊరేగింపు తర్వాత దొరికే 10/ రూపాయలతోపాటు సేఠ్ పెట్టే తిండికోసం .
*****
వీరన్న కోడలికి కానుపు కష్థం అయ్యింది పట్నం తీసుకువెళ్లే స్తోమతలేని వీరన్న, మాలచ్చిమి భోరున విలపిస్తున్నారు, కనపడని దేవుణ్ణి ప్రార్ధిస్థూ . మంత్రసాని బిడ్డ అడ్డంతిరిగిందని చెప్పిన మాట సమ్మెటపోటయ్యింది వీరన్న దంపతులకు. దిక్కుతోచని స్థితిలో , కూరగాయలమ్మే మల్లన్న తోపుడుబండిలో కోడలిని వేసుకొని మైళ్లదూరంలో ఉన్న పట్టణానికి పరుగుతుసేరు వీరన్న దంపతులు .
నడినెత్తిమీద ఎండ, చెప్పులులేని కాళ్లు, కాలే కడుపు, డబ్బులేని బతుకులతో చెడుగుడటలాడుకుంటున్నాయి . బరువుగా బండిలాగుతున్న వీరన్నకి ఊరేగింపు ఎదురయ్యింది .జనం, జనం, జనం. ,గోవిందనామాల హొరు తప్పించుకొని తొందరగావెళ్లాలని '' జరగండెహె '', అంటూ అరుస్తూ అప్రయత్నంగా తలెత్తిన వీరన్నకి , తనుచేసిన స్వామివిగ్రహం సర్వాలంకరణలతో కళకళలాడుతూ కనిపించింది . మనస్సులో ఆనందకెరటం ఉవ్వెత్తునలేచింది . సామీ అంటూ భక్తిగా నమస్కరించేడు . ఊరేగింపుకి అడ్డంగాఉన్న వీరన్నని బండితోసహా ఎవరో ఒక్కతోపు తోసేరు .నొప్పులతో అరుస్తున్న వీరన్నకోడలి అరుపులు గోవిందనామాల గోలలొ కొట్టుకుపోయాయి. ప్రాణమున్న మనిషికాన్నా, ప్రాణం లేని విగ్రహానికి భక్తిపేరుతో '' విలువలు '' కట్టీ , గొర్రెలమందలా తరలిపోతున్నారు జనం . తనుచేసిన ప్రాణమున్న బొమ్మల మూర్ఖత్వానికి మారుమాటరాని దేముడు , వీరన్నకి వచ్చిన కష్థానికి చేయూతనిచ్చే సమయం తనకికూడా లేదన్నట్లు బంగారుపల్లకీలో గుంభనంగా, గంభీరంగా తరలిపోతున్నుడు . పక్కనుండీ వీరన్న తోపుడు బండి బరువుగా కదిలింది .
*****
స్వామివారి కల్యాణం మొదలయ్యింది .దేదీప్యమానంగా అలంకరించబడ్డ పందిరిలో స్వామివారు మంగమ్మలకు నవరత్నాల తలంబ్రాలు పోస్తున్నారు . భక్తులంతా చల్లటిపానీయాలు తాగుతూ ,సేఠ్ జీని కొనియాడుతున్నారు .దర్పంగా కూర్చున్న సేఠ్ , అడుగులకి మడుగులొత్తుతున్నారు పూజారులు .తమకికూడా దండీగా దక్షిణ మట్టవచ్చన్న ఆశతో.
*****
ఊరేగింపురద్దీలో అరగంట ఆలస్యంగా మునిసిపల్ ఆసుపత్రి చేరాడు వీరన్న . స్పృ హ తప్పబోతున్న కోడలిని మోస్తూ లోనికి తీసుకువెళ్లేరు .
ఖాళీల్లేకా వరండాలసైతం నిండిఉన్నారు రోగులు. డాక్టర్ రాని కారణంగా గంతలతరబడీ నిరీక్షిస్తున్న రోగులు వీరన్న పరిస్థితిచూసీ నిట్టూర్పు వదిలేరు . పురిటినొప్పులకి తాళలేని కొడలిని ఒక్కసారి చూడమని దైన్యంగా బతిమాలుతున్నాది మాలచ్చిమి నర్సులని . కోడలి గొంతుక తడారడంతో సోడా తేవడానికి పరుగెత్తాడు వీరన్న , గుక్కెడు నీళ్లుకూడారాని మునిసిపల్ కొళాయిని తిట్టుకుంటూ .
*****
స్వామివారిపై మంగళ స్నానాది, అభిషేకాలపేరుతో పాలు, నీరు ,పెరుగు, తేనె, ఏరులై పారుతున్నాయి. భజంత్రీల ఘోష ఆకాసాన్నంటుతున్నాది . అక్షతలు , పూలూ జల్లుగా కురుస్తున్నాయి స్వామిమీద .
పెళ్లికొడుకుగా స్వామి ప్రత్యేకదర్సనం యిస్తున్నారు వి .ఐ . పి . లకి . నోట్లకట్టలు చేతులు మారుతున్నాయి . ఫలితం... స్వామి వారి గర్భగుడిలోకి కొన్ని గంటలనుంచీ , లక్షలకొలదీ నిలుచున్న జనం లైనులో మొదటి వారుగా పంపబడుతున్నారు .
*****
కొన్ని గంటలతర్వాత వచ్చిన డాక్టరుని కాళ్లా వేళ్లా పడి బతిమాలుతున్నారు వీరన్న దంపతులు .'' కేసు క్రిటికల్ కండీషనులో ఉంది కనకా ఆపరేషనుకి ,టెష్ట్ లకి ఖర్చవుతుందనీ, దబ్బుతేవకుంటే పనికాదని, '' ఖచ్చితంగా చెపుతున్న మాటలు విని నీరుకారిపోయాడు వీరన్న. దేముడా అంటూ కూలబడ్డాడు. అతని కళ్లముందు తను మలచిన స్వామి విగ్రహాలు వలయాల్లా తిరుగుతున్నాయి. ఈరోజుకి తనని ఆదుకుంటుంనుకున్న మట్టివిగ్రహం మాధవుడి రూపం లో మంగళహారతులందుకుంటున్నాది .ఏ రూపాన్ని తను బతుకుతెరువుగా ఎంచుకున్నాడో , ఆ దేవుడు తనని ఏనాడూ కరుణించలేదు.
అయినా తను ఏనాడూ బాధపదలేదు .అంతా తన ఖర్మ అనుకున్నాడు.ఇప్పుడు కనీసం 500/ అయినా ఉంటేగానీ కోడలి పరిస్థ్థితి కుదుటపడినట్లు లేదు.తన దగ్గర 80/ రూ| మించీ లేదు. ఆకలికి పేగులు చుట్టుకు పోతున్నాయి . ఆకలని చెప్పలేకా ముడుచుకొని కూర్చుంది మాలచ్చిమి బేలగా. ఈరోజయినా ఏ దేముడైనా కరుణించీ , డాక్టర్ బాబు రూపం లొ వచ్చి కోడలి పురుడు సవ్యంగా జరిపిస్తాడేమోనని ఆశగా చూడడంతప్ప ఏమీ చేయలేకపోయాడు వీరన్న. నిస్త్రాణ గా కూలబడ్డాడు వెలసినగోడలకానుకొని .
*****
విందుభోజనాలతో స్వామివారి కల్యాణం పూర్తయ్యింది . బ్రేవ్ మన్న త్రేనుపులతో మండపం ప్రతిధ్వనిస్తున్నాది . పెళ్ళిలో అలసిన స్వామివారి జంటని ఉయ్యాలలో సేదతీరుస్తున్నారు పూజారులు. అలసిన స్వామి మంగాసమేతుడై చిద్విలాసంగా నిద్రిస్తున్నాడు , తనకేంపట్టనట్టు .
*****
నొప్పులు ఎక్కువైన వీరన్న కోడలిచుట్టూ అక్కడి ఆడవారంతా మూగేరు . అరగంట యాతన తర్వాత బిడ్డ బయటపడింది . వీరన్న కోడలు అలసటగా మూసిన కళ్ళు తిరిగి విప్పలేదు .
పుట్టిన ఐదినిముషాలలోనే చారెడు కళ్ళు విప్పి చుట్టూ చూసింది పురిటికందు .తనేదో ఈ ప్రపంచం లో బావుకుందామన్న ఆశతో...
రచయిత్రి.. శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్.
No comments:
Post a Comment