Tuesday, November 10, 2009

ఆ రెండు కళ్లు .

ఆ రెండు కళ్ళు .
*****రెండేళ్ల గౌరిని ఎత్తుకొని ,ఆరు నెలల కన్నాని ఊయలలో ఊచుతూ ,మధ్య మధ్యలో కర్రలపొయ్యి ఊదుతూ, మండే కళ్లని మాటిమాటికి తుడుచుకుంటూ వంట చేస్తున్నాది సావిత్రి .బొగ్గులకుంపటి , కొయిలాపొయ్యి, కర్రలపొయ్యి , ఇల్లు, పిల్లలు, బట్టలు తకడం , అరమైలు పొడుగున్న వాకిలి చిమ్మి ముగ్గువేయడం , ఉదయం పదిగంటలలోపు వంటచేసి భర్తకి క్యేరేజి కట్టడం ఇవన్నీ చంకదిగని గౌరిని ,ఏడుపాపని కన్నాలని సముదాయిస్తూ అవలీలగా చేసుకుపోతున్నాది సావిత్రి.

పనిమనిషి రంగమ్మ గిన్నెలు తోముతూ'' ఈపిల్లలతో ఎలా చేస్తున్నావమ్మా, ఒకరు చంకదిగరు , ఒకరు ఏడుపాపరు '' అంటుంటే సావిత్రి నవ్వుతూ '' పిల్లలు కాక అల్లరి ఎవరు చేస్తారు రంగమ్మా. నాకా ఈ పిల్లలు , ఇల్లు తప్ప ఎక్కడికీ వెళ్ళే అలవాటుకూడా లేదు . అందికే వీళ్లతోడిదే లోకం నాకు. వీళ్లిద్దరూ నారెండు కళ్ళనుకో . వీళ్లతో నాకేబాధా లేదుగానీ నువు తొందరగా పని కానీ , బాబుగారికి టైం అవుతున్నాది ...అంటూ అష్థావధానం చేస్తూనే వంట ముగించి , భర్తకి , అత్త,మామలకి ,కాఫీ,ఫలహారాలు ,ఇచ్చీ, భర్తకి క్యేరేజి చేతికి అందించింది . హడావిడిగా బయలుదేరుతున్న భర్తని గేటుదాకా సాగనంపి తిరిగి పనిలోలీనం అయ్యింది .

పధ్నాలుగు సం '' నిండక ముందే పెళ్లయిన సావిత్రి 18 సం '' వచ్చేసరికి యిద్దరు పిల్లలకి తల్లయ్యింది. చిన్న పల్లెటూరిలో ఎ. ఎస్ . ఎం . గా పనిచేస్తున్న రావుగారికి అన్నివిధాలా సహకరిస్తూ అత్త,మామల సేవలూ , ఆడబిడ్డల అచ్చట్లూ, పిల్లల ముచ్చట్ల్ల మధ్య , బాధ్యత నిండిన బరువుతో , పనిచేసే మరబొమ్మలా తయారయ్యింది .

పొద్దున్నే లేచి దుంగల్లాఉన్న కర్రలు సన్నగా నరకడం , రాక్షసి బొగ్గులు చిన్నవిగా కొట్టడం , మామగారిపూజకి పూలు సిద్ధంచేయడం , పిల్లలకి స్నానం చేయించి , భర్త బట్టలు ఇస్థ్థ్రీ చేసి , టిఫిను, కాఫీలని అందించీ వంటలో జొరబడడం .....నిముషమైనా ఖాళీలేని పనులమధ్య పిల్లల ఆటలు , అల్లర్లూ ,ముద్దుమాటల మధ్య తనచిన్ని ప్రపంచాన్ని అల్లుకుపోయింది సావిత్రి . ఆ పిల్లలంటే ప్రాణం సావిత్రికి .వాళ్లuకి ఏ చిన్నదెబ్బ తగలినా విలవిలలాడిపోయేది .

క్షణతీరిక లేకుండానే ఇరవై యేళ్లు గ డిచిపోయాయి. నడివయసుదాటిన సావిత్రి పనిభారంతో అలసిపోయింది . అందమైన ముఖం కమిలి వాడిపొయింది. కళ్లకింద నల్లటిచారలు ఏర్పడ్దాయి . ఈమధ్య తరచుగా నడుములో విపరీతంగా నొప్పి వస్తున్నాది . పని కష్థంగాఉంది . వయసు వచ్చినా గౌరికి తన స్నేహితులు, ఆటపాటలు , తప్ప , తల్లిబాధ గమనించే సమయం ఉండేదికాదు. షిఫ్ట్ డ్యూటీలతో , నిద్ర సమంగాలేని భర్తకు ఈ విషయంచెప్పి విసిగించదలచుకోలేదు సావిత్రి . బాధని దిగమింగుకుంటూ భారంగా పనులు చేసుకుపోతున్నాది . ఇంతబాధలోనీ పిల్లలు కళకళలాడుతూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ ,మధ్యమధ్యలో చిన్ని,చిన్ని తగవులుతీర్చమని దగ్గరకి వచ్చినపుడు ఆమె అదొకరకమైన ఆనందాన్నిం అనుభవించేది . వీళ్లు నాప్రాణాలు . వీళ్ల భవిష్యత్తు ఉజ్వలంగాఉండాలంటే తనబాధలు వాళ్లకి తెలియనివ్వకోడదు అనుకున్నాది .

ఎవరికీ తనబాధని చెప్పనిసావిత్రి యాంత్రికంగా తనపనులు చేసుకుపోతున్నాది . కాలం గడుస్తున్నకొలదీ నీర్సం ,తలనొప్పి, నిస్సత్తువలమధ్య గౌరి పెళ్లి , తర్వాత , పండగలూ , పురుళ్లతో సావిత్రి కండలు కరిగిపోయాయి. అయినాసరే ఆ మొఖం లో చిరునవ్వు చెదరలేదు . మనవల ఆటపాటలమధ్య తన బాధని తాత్కాలికంగా మర్చిపోడానికి ప్రయత్నిస్తూనే, ఇంటిపనులు చేసుకుపోతున్నాది .భర్తతోపాటు ,ఉద్యోగస్తుడైన కన్నాకికూడా క్యేరేజి కట్టవలసి రావడంతో తెల్లారి మూడుగంటలకే లేచి పనులు చేయవలసివస్తున్నాది సావిత్రికి . హడావిడిగా చేస్తున్న పనులతొందరలో నీళ్లుమోస్తూ కాలుజారిపడింది . ఆసుపత్రి , మందులు , ఫ్రాక్చర్ , ఆరునెలల రెష్థ్ , తర్వాత చేతికర్రలిచ్చి ఇంటికి పంపారు డాక్టర్లు. సంవత్సరం వరకు కర్రలతో నానాబధా పడి నలిగిన సావిత్రికి సాయంగా కొన్ని రోజులపాటు గౌరినిరమ్మని కోరిన రావుగారికి '' తనకి తీరదని , వాళ్లాయనకి సెలవులేదని రాసిన గౌరిజవాబుకి నిరాసచెందారు . కళ్లల్లో నీళ్లు చిమ్మేయి ''.కూతురు వస్తుంది , తనని జాగ్రత్తగా చూసుకుంటుంది . కొన్నాళ్లపాటు తనకి విస్రాంతి దొరుకుతుందని '' ఆశగా చూసే సావిత్రికి ఏంచెప్పాలో తెలీలేదు . భర్త ముఖకవలికలబట్టీ విషయాన్ని గ్రహించిన సావిత్రి మనసు బాధగా మూల్గింది . వెంఠనే కోల్కొనీ '' పసిపిల్ల , సంసారమంటే మాటలా ....అది ఎంతబాధపడుతూ అలా రాసిందో .. అసలు మీరు పిల్లకెందుకురాసారు '' అంటూ మందలించింది . ఎన్ని మందులు వాడినా, సావిత్రి తొందరగా కోలుకోలేకపోయింది .సావిత్రిలో వచ్చిన మార్పుని వయసుతెచ్చిన మార్పుగా తీర్పునిస్తూ ,నిర్లక్ష్యగా మట్లాడుతున్న కుటుంబసభ్యులని విస్తుపోయి చూడడంతప్ప ,ఏమీ చేయలేకపొయింది .తనబాధని ఎవరితోనూ చెప్పుకోలేకా సతమతమయ్యే పనులు ఒంటరిగా చేసుకోలేకా ,కాలం కాటుని భరిస్తూ , కన్నా పెళ్లి కూడా చేసింది . కోడలిరాక తర్వాత కొన్నిరోజులుబాగున్నా రానురానూ ముళ్లపోటయ్యింది .కోడలివిసుగు , చీదరింపులమధ్య ,మానసికంగా చితికిపోయింది . మూడువంతులపని తనుచేస్తున్నా ,రిటైర్ అయిన భర్త పెనషను వాళ్ల జల్సాలకి , ఖర్చులకి ఇస్తున్నా బతుకు భారమయ్యింది . కోడలి సూటీపోటీ మాటలు , నిష్థ్థూరాలూ మనసుని గాయపరుస్తూ ఉంటే , సావిత్రి సహనానికి కన్నగాడి మాటలు ఆ గాయానికి కారం పూసినట్లుండేవి . భార్య మాటలునమ్మి ,ఆమెను సమర్ధిస్తూ చేసిన రాద్ధాంతాలతో ఇల్లు నరకం అయేది .
భార్యని సమర్ధించడం , తమని కించపరచడం రోజూవారి కార్యక్రమం అయ్యింది . కొడుకుకి ఉద్యోగరీత్యా బదిలీరావడంతో రావుగారు ,తేలికగా ఊపిరితీసుకుంటే, తల్లిగా సావిత్రి గుండె బరువెక్కింది . కొత్త ఊరిలో చంటి పిల్లలతో , ఏం బాధపడతాడోనని మనసు బాధగామూల్గింది .కొడుకు వెళ్లిపోయాకా సావిత్రి మరీ వంటరిదయ్యింది . పిల్లలు, మనవల `జ్నాపకాలతో కళ్లు తడైయ్యేవి . శరీరపు వివసత్వం , మానసికపు వత్తిడి ఆమెనుబాగా కుంగదీసాయి . మూసిన కళ్లముందు తన చిన్ననాటి సంఘటనలు , తండ్రి వదిలేసిన తల్లి దీనస్థ్థితి , బీదరికం , అక్కచెల్లెళ్ల అవమానాలు, అగచాట్లు , తమపెళ్లికోసం తల్లిపడిన పాట్లు ,సినిమారీళ్లలా కదిలాయి. అక్కకాపరం నిలబెట్టడానికి తన తల్లి పడిన అగచాట్లు , మగదిక్కులేని సంసారపు నిస్సహాయత, డబ్బులేని బెంగ , పసితనం వీడని చేల్లెలి కాయకష్థ్థం ,తన అందమే తన శత్రువై నిలిచిన వైనం గుర్తుకువచ్చి గుండెలోతుల్లో కలుక్కు మంటున్నాది. కన్నీరు ధారాపాతంగా కారుతున్నాది . ఆ కన్నీటి మధ్య ఆనాటి రావుగారిరూపం ,తనని పెళ్లిచేసుకుంటాననడం , తల్లి ఆనందం అన్నీ రెపరెపలాడేయి . కానీ కట్నం లేకుండా తనని పెళ్లి చేసుకున్న రావుగారు భగవంతునిలా తోచేరు . అత్తారింటికి బయలుదేరుతున్న తనతో '' కష్థం ,అయినా, సుఖం అయినా భరించీ జాగ్రత్తగా కాపరంచేసుకోమనీ , అండలేనివాళ్లం కనక అణిగి,మణిగి ఉండమనీ కన్నీటితో వీడ్కోలు చెప్పిన తల్లిరూపం దీనంగా కనిపిస్తున్నాది . ఆమాటమీదే ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సంసారం నెట్టుకొచ్చింది . భర్తని ఏనాడూ ఇది కావాలని అడగలేదు . బయటకు వెళితే ఖర్చని ఇల్లే స్వర్గం ,పిల్లలేలోకంగా బతికింది .

తనకి జీవితాన్నిచ్చిన భర్తమీద గౌరవం ,కృతజ్నతలతో, తనకివచ్చిన ఏకష్థం అతనికి చెప్పేదికాదు . తనపిల్లలు పెద్దయితే వాళ్లే తనని చూసుకుంటారు . తనమనసు తెలుసుకొని తను అడగకుండానే తనకుకావలసినవి చేస్తారన్న నమ్మకం వమ్మయ్యింది . మానసికపు క్షోభకి మందులేదు . సావిత్రి పరిస్తితి రోజురోజుకీ దిగజారితున్నాది .

రోజూ తెల్లారే లేచే సావిత్రి పొద్దున్న ఏడైనా లేవకపొయేసరికి రావుగారికి భయం వేసింది .దగ్గరగావెళ్లిచూసేరు . సావిత్రి శరీరం వేడిగాఉంది . తెల్లటి శరీరం కమిలిపోయింది . మనిషి బాగా సన్నబడింది . కళ్లలోని నిస్పృహ , ఉబ్బిన పొట్ట ...ఇదేంటీ... ఈమె తన సావిత్రేనా... ఎంత అందమైనది , ఎలాగైపొయిందీ... రావుగారి కళ్లలోనీళ్లు తిరిగాయి . బాధ్యతల పరుగులో తను సావిత్రిని ఎంత నిర్లక్ష్యం చేసేడో అర్ధం అయ్యింది . ఏంచెయ్యాలో తోచక పిల్లలిద్దరికీ తెలియజేసేరు . కానీ చిత్రం . ఏ స్పందనాలేని జవాబు .తమకి కుదరదంటూ. ఏవేవో కారణాలు .

సావిత్రి జీవితం లో ఆసుపత్రి , మందులు , ఒక భాగంగా మారేయి . పనిచేయడానికి కూడా లేవలేని సావిత్రిని చూసుకుంటూ, ఒంటరిగా ఆమెని వదిలి , బయటి పనులుచేసుకొలేకా సతమతమయ్యిన రావుగారు కొడుకుదగ్గరకు వెళ్లిపోదామన్న ఆలోచనతో్, పరిస్థితులు వివరిస్తూ రాసిన ఉత్తరానికి జవాబుగా , తమ ఇల్లు చాలాచిన్నదనీ , మరో ఇద్దరు వస్తే ఆర్ధికంగాకూడా ఇబ్బందనీ , పెద్దఇంటికి అద్దె చెల్లించే స్తోమత తనకు లేదన్న కొడుకు జాబు గొడ్డలిపెట్టయ్యింది .
ఆలోచించగా తన పి. ఎఫ్ డబ్బుతో ఒక ఇల్లు కొంటే , ఏమీలేని తమని కోడలు సమంగా చూస్తుందా ...అన్న ఆలోచన, భార్యనే సమర్ధించే గుణమున్న కొడుకు నైజం , తర్జన,భర్జనల రూపమెత్తి , వృద్దాప్యపు బరువు చివరికి వాత్సల్యానికి ఓటు వేసింది . కన్నాపేరుమీద పి.ఎఫ్ ట్రాంస్ఫర్ అయ్యింది .ఇల్లు కొనడం , మారడం ,అన్నీ అయినా కన్నానుంచీ పిలుపురాలేదు .

ఇక్కడ పనిచేసుకోలేక , డబ్బుచాలక , మందులకి , టెష్థులకి , బేంక్ బేలంస్ లేకా రావుగారు నానాఅవస్తలూ పడుతున్నారు , కన్నా పిలుపుకోసం ఎదురుచూస్తూ...అన్నీ ఎరిగిన సావిత్రి విరక్తిగా నవ్వుకున్నాది . కానీ కన్నపిల్లలపట్ల ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు . గౌరికి వచ్చిన విష జ్వరం తగ్గడానికి ఆమెచేసిన ఉపవాసాలూ, కన్న ఆర్ధిక పరిస్థ్థితి మెరుగుపడాలని ఆమెచేసిన చన్నీటి స్నానాలూ ఆమె ఒంటిని మరింత గుల్లచేసాయి . ఆమె పూర్తిగా మంచానికి బానిసయ్యింది .

మొట్టమొదటిసారిగా సావిత్రి పిల్లల పిలుపుకై ఎదురుచూసింది , భర్త బాధ చూడలేకా .... పిల్లలదగ్గరకు వెళ్లిపోదామన్న మాటను చిరు నవ్వుతో తోసిపుచ్చే సావిత్రి , ఒకరోజు హఠాత్తుగా కొదుకుదగ్గరకు వెళదామనడంతో , అన్నదే తడవుగా ప్రయాణానికి సిద్ధం అయ్యేరు .

అత్త,మామల రాక కంట్లో నలుసయ్యింది కోడలికి . భర్తతో పోరీ, పోరీ వేరే అద్దెఇంటిలో దింపింది . సావిత్రి, రావుగార్లలకి నోట మాట రాలేదు. గుట్టెరిగిన సావిత్రి మౌనంగా కన్నీరు కార్చింది .తిరిగి చాకిరీ , ఒంట, తప్పలేదు ఇద్దరికీ. ఈ కష్థం లోనే చిన్ని సంతోషం . కొడుకు , మనుమలు దగ్గరగా ఉన్నారు కదా అని . మనుమల ఆట,పాటలతో కొంతవరకు బాధని మర్చిపోగలిగింది . మర్మమెరుగని మనుమల కోరికలు తీర్చేందికు, చిరు వంటలు చేయడానికి ప్రయత్నిస్తున్న సావిత్రి ,ఒకరోజు పనిచేస్తూ కుప్పకూలింది . తిరిగి లేవలేని సావిత్రి ఆసుపత్రిలో పదిరోజుల పోరాటం అనంతరం , డాక్టర్ లు సావిత్రి జీవితాన్ని కొన్నిరోజుల కొలబద్దతో ముడిపెట్టి వెళ్లిపోయారు .

కొన్నిరోజులంటే వారాలా, నెలలా సం వత్సరాలా..? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఈ పరిస్థితిలో ఈమెకు ఎవరు సేవలు చేస్తారు ?

కొడుకు బాధ్యత తీసుకోకపోతే తను ఈ వయసులో ఏం చెయ్యగుడు ? చేసినా ఎన్నాళ్లు ....రావుగారి ఆలోచన .......

చచ్చాం | ఇంక ఈవిడగారి సేవతోనే తన జీవితంకాబోలు ..తొందరగా తేల్చు భగవంతుడా...కోడలి కోరిక ....

ఇప్పటికే వచ్చీ పదిహేను రోజులయ్యింది మరదలి వ్వవహారం చూస్తే ,అమ్మని చూసినట్టు లేదు ..తనుమాత్రం ఎన్నాళ్లు ఉండగలదు ..? కూతురి తర్జన, భర్జన......

ఎన్నాళ్లు ఉంటుందో తెలీని పరిస్తితులలో ఈ ఆసుపత్రి ఖర్చులు తను భరించగలడా....మధ్యతరగతి .కొడుకు సంఘర్షణ .....

ఇవన్నీ కలిపీ , అందరి స్వార్ధపు ఆలోచనలసారం ...'' భగవంతుడా...ఈమెని తొందరగా తీసుకుపో ''...........

ఇవేవీ తెలీని సావిత్రి కళ్లలో కొత్తకాంతి . తనకు బాగులేదనగానే కూతురు పరుగెత్తుకు వచ్చింది . కొడుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు . భర్త పదే పదే భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాడు . ఎంతైనా నా పిల్లలు నాపిల్లలే . నా రెండు కళ్లు . నా ఊపిరి . సావిత్రి సంత్రుప్తిగా కళ్లుమూసుకుంది .

సావిత్రి కళ్లుమూసిన ప్రతీసారీ అందరిలో వచ్చిన ఒకేఒక ఆలోచన ...నిద్రా...నిష్ర్క్రమణా ....

ప్రతీరోజూ అందరి ఎదురుచూపులూ తోసిపుచ్చీ కళ్లుతెరిచిన సావిత్రిని ఉస్సురంటూ చూసేవారు . అందరిమధ్యా వాదోపవాదాలే....చాకిరీగురించి , ఖర్చులగురించి, .....

ప్రతిఒక్కరూ మర్చిపోయారు ఆమె తమకోసం ఎంత శ్రమపడిందనీ.....ఈనాటి ఆమె పరిస్థితికి కారకులు తామేనని . రక్తసంబంధం రిక్తసంబంధం అయ్యింది .ఆదుకోవలసిన క్షణంలో అసహనాన్ని కనపరుస్తున్నారు కావలసినవారంతా......

భర్త, పిల్లల మొహాలలో అసహనాన్ని ,విసుగుని లీలగా గుర్తించిన సావిత్రి చిన్నగా నవ్వుకుంది . మంచం పట్టినవారిని ఎవరుమాత్రం ఎంతకాలం చూడగలరు . బతికున్నన్నాళ్లు తనపనితాను చేసుకున్నాది . ఇంక ఎవరిమీదా ఆధారపడడం తనకిష్థం లేదు . '' భగవంతుడా...తొందరగా నన్ను తీసుకుపో ....అలసిపోయాను ప్రభూ .......నాపిల్లలని కష్థపెట్టకు .నా ఎదురుగా వాళ్లు ఏప్పుడూ సంతోషంగా ఉండాలి . నాగురించి వారిని ఇబ్బంది పెట్టకుతండ్రీ....మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధించింది .

కళ్లుతెరిచి చుట్టూ చూసింది . భర్త , కూతురు . కొడుకు కోడలు , మనుమలు , .....కాంతిహీనమైనకళ్లతో సంత్రుప్తిగా అందరినీచూసింది . అలా చూస్తూనేఉంది ..

ఆకళ్లు తిరిగి మూసుకోలేదు .అందరినీ తనివితీరా చూసిన ఆనందం తట్టుకోలేని ఆమె గుండె చప్పుడు కాకుండా జారుకుంది . విప్పారిన ఆరెండుకళ్లలో గౌరీ, కన్నల ప్రతిరూపాలు అస్పష్థంగా కనిపిస్తున్నాయి .
అన్ని బంధాలూ తెంచుకొని ఆమె ఆత్మ ఆశీర్వాదాల ఆస్తినొదిలి అందరానిలోకాలకు పయనమయ్యింది.

ఎక్కడనుంచో '' అనుబంధం , ఆప్యాయత అంతా ఒక బూటకం , ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకొనే నాటకం '' అనే పాట ,అపశృతిలా విని పిస్తున్నాది, రేపటి మీ పరిస్తితి కూడా యింతే , అన్నట్లుగా...........

                    రచయిత్రి..
శ్రీమతి పుల్లాభట్ల  జగదీశ్వరీ ముార్తి.
                              కల్యాణ్.

-----------------------------

No comments:

Post a Comment