కుర్చీలో కుర్చొని తదేకంగా అటువైపే చూస్తున్నాను . రాజమ్మ మాసిన బట్టల్ని సర్ఫ్ లో నానబెట్టి శ్రద్ధగా ఉతుకుతున్నాది .ఆమెకు కొంచం దూరంలో ఐదు సంవత్సరాలు నిండని చిన్నపిల్ల చేతిలో బొమ్మతో కుర్చొని ఉంది రాజమ్మ మధ్య మధ్యలో ఆ పిల్లవైపు చూస్తూ పని చేస్తున్నాది . రాజమ్మ కళ్ళల్లో కోటి వెలుగులు .రాజమ్మ అందగత్తే కాదు .కాని ఆమె ముఖం ఏదో కళ , సంత్రుప్తి కలిపిన కొత్త అందాలతో కళ కళ లాడుతున్నాది . నల్లగా , బలహీనంగా ఉన్న రాజమ్మ చుట్టూ ఒక కాంతిపుంజం వలయంగా తిరుగుతున్నట్టు , ఆమె తెలియని వర్చస్సుతో వెలిగిపోతున్నది .ఏదో తెలియని అందం ,ఆకర్షణ , సంతృప్తి ఆమె వద్ద ఉన్నాయి .
ఆమెకున్న ఆ సంతృప్తి తనకెందుకులేదు? ఎప్పుడు ఏదో వెలితిగ, అసహనంగ ఎందుకుంటుంది?
ఈ ఆలోచనలోకూడా అసంతృప్తే .
తనకి అన్నీ ఉన్నాయి .అందం, ఆస్తి , అంతస్తు, అధికారం , చక్కని సంసారం , మంచి భర్త , ఆర్ధిక స్వాతంత్ర్యం , కానీ.....ఏదో వెలితి , ఏదో పోగొట్టుకున్న భావన ఏంటది?
ఆలోచనలలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కంటిముందు కదలాడాయి .
-------------------------------------------------------
ఆ రోజు బీరువాలో ఉన్న చీరలన్నీ సద్దుతూ ఉండగ , తను కొన్ని సంవత్సరాలనుండీ కట్టని చీరలు
కనిపించేయి .ఎప్పటికప్పుడు ఎవరోఒకరికి ఇచ్చీయాలనుకుంటూనే , సరేలే మరికొన్నిసార్లు వాడేక ఇవ్వొచ్చు , బాగానే ఉన్నాయి కద ! అనుకుంటు వచ్చింది . అవి వాడడం అవలేదు సరికద , వాటికి మరి నాలుగు చీరలు చేరి , మూలపడ్డాయి . చింకి చీరతో వస్తున్న రాజమ్మకి ఓ రెండు చీరలు ఇద్దామన్న ఆలోచన రోజూ వస్తున్నా, మళ్ళీ రాజమ్మ తనకుతానుగా అడిగినపుడు ఇవ్వోచ్చులే అన్న ఆలచనతో రోజులు గడిచిపోయేయి . వర్షాకాలంలో ఒక రోజు
రాజమ్మ తడిచీరతో పనిచేస్తూఉంటే జాలివేసింది . అటువంటి పరిస్థితులలోకూడా రాజమ్మ నన్ను అడగలేదు .సరే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాదికదా ,అడిగేదేముందిలే ,ఓ నాలుగు చీరలు తనే యిస్తే పోలే...పాపం కట్టి,విడుపుకు ఉంటాయి , అనుకుంటు ,బీరువా తీసి చీరలు చూసింది . మళ్ళీ అదే పరిస్తితి . ఏ చీర చూసినా బాగానే ఉన్నట్టు ,మరి
రెండు సార్లు కట్టి ఇవ్వోచ్చులే అన్న భావన .
ఎలాగైతేనేం , ఒకటికి పదిసార్లు చూసి, ఓ రెండు చీరలు తీసి ఆమెకు ఇచ్చింది .ఒకటి పమిట దగ్గర చినిగిఉంది , రెండవది ఫాల్ దగ్గర. రాజమ్మ సంతోషంగా ఆ చీరలు తీసుకుంది .ఆ మర్నాడు ఒక చీర కట్టుకుని వచ్చింది . ఆ తర్వాత మామూలుగా తన చింకి చీరతో వచ్చింది .ఆ తర్వాతకూడా ఆమె తను ఇచ్చిన చీరలు కట్టగా, మరి చూడలేదు. ఉంబట్టలేక ఒకసారి అడిగిందికూడా. కాని చిరునవ్వే సమాధానం . ఆ రోజు తనకి చాలా కోపం వచ్చింది . " చీ ,వీళ్ల బుద్ధే ఇంత , పదికో పరకకో అమ్మేసి ఉంటుంది " మరెప్పుడు ఇలాంటివారికి సహాయం చేయకూడదు " అని నిశ్చయించుకుంది
__________________________
కొన్ని రోజులు గడిచేయి . ఆ రోజు సంతలో కూరలు కొనుక్కొని వస్తూ , అకస్మాత్తుగా ఆగి వెనక్కి తిరిగి చూసింది .ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి మరీ చూసింది .అవును ,అదే చీర ,ఆ రంగూ ,ఆ చిరుగు , ''అమ్మో ! అయితే రాజమ్మ తనిచ్చిన చీరని దీనికి అమ్మిందన్నమాట ,'' విసురుగా ఆమె దగ్గరకు వెళ్ళేను . ఎక్కడనుంచీ ఏరుకొచ్చిందో , కసురు మామిడిపిందెలు కింద పోసి అమ్ముకుంటున్నాది . ఆ మాటా, ఈమాటా ఆడి , చీర విషయం అడిగేను . ఆమె ఆ చీరని అపురూపంగా చూసుకుంటూ,వర్షం లో మునిగిపోయిన తన గుడిసె గురించి ,అన్నీ పోయి ఒంటిమీద తడిచీర తప్ప ఏమీ మిగలని స్థితిలో రాజమ్మ తనకి చేసిన సాయం గురించీ, కన్నీళ్ళతో చెప్పి రాజమ్మని పొగిడిన వైనం ,నన్ను తల దించుకున్నట్టు చేసింది .
ఆలోచిస్తూ ఇంటికి వచ్చీ, రాగానే రాజమ్మని అడిగేను " నీకే లేవుకదా చీరలు కట్టుకుందికి ,ఉన్నవి
దానం ఎందుకు చేసెవని " అడిగేను .
దానికి రాజమ్మ " పోనీలే అమ్మా! అన్నీ పోయి సలిలో ఏడుస్తా కూకోనుండాది .బక్క పానం .పక్కనే నానుండీ సూసినా. కట్టి,యిడుపుకి నాలుగు సీరలున్నాయె , ఓ రెండు ఇచ్చీ మానం కప్పుకోమన్న . నాకు కావాలంటె మీలాంటి దరమాత్ములు ,ఇత్తారు దయతలిసి .అందికే ఓరెండు సీరలిచ్చిన .డబ్బు లేనోటోల్లం . ఒకరి కట్టం ఇంకొకరు పంచుకోవడం తప్ప ఇంకేం సేయగలం " అంటూ తన పనిలో తాను నిమగ్నం అయింది .
నేను చటుక్కున తలొంచుకున్నాను. మూల పడున్న వాటిలో ఓ రెండు చీరలు ఇవ్వడానికి ,
సంవత్సరాలుగా నీను చేసిన ప్రయత్నం , ఏమీ లేకపోయినా ,ఉన్నదానిలోనేఆదుకునే రాజమ్మ ఔన్నత్యం ముందు మసకబారినట్లయ్యింది .
_________________
మరికొన్ని రోజులు గడిచేయి .పేపర్లో వార్తలు చదువుతూ యధాలాపంగా చూసేను . వరదల్లో అన్నీ కోల్పోయి ,అనాదులైన పిల్లలని ఆశ్రమాలకి తరలిస్తున్న వైనం , ఎవరైనా పెద్దమనసుతో చేరదీసి పెంచుకున్నాసరే ,లేదా వారి పెంపకానికి అయ్యే ఖర్చు కొంతైనా జమచేసినాసరే , లేదా ఒక పిల్ల బాద్యత అయినా తీసుకోతలచినవారు
సంప్రదించవలసిన చిరునామాతో పాటు , ఇచ్చిన వివరాలు చదివి , అనాధలైన పిల్లలగురించి వాపోతూ , ఒక భారమైన
నిట్టూర్ఫు విడిచి పనిలో జోరపడ్డాను.
రెండురోజులు గడిచేయి . రోజూ తెల్లారే రావలసిన రాజమ్మ ఆరోజు ఎనిమిది కావస్తున్న రాకపోయేసరికి , పనిమీద బెంగతో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ,రోడ్డు చివరంటా చుడడానికోసం మా హాలు కిటికీ దగ్గరకు వెళ్ళిన నాకు , అక్కడి దృశ్యం చూసేక నోట మాట రాలేదు . కారణం సొసైటి గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తూ రాజమ్మ కనిపించింది ." తన పనులన్నీ వెనక్కిపెట్టి ఈవిడగారు చేస్తున్నపని ఇదన్నమాట . చివ్వున వస్తున్నా కోపాన్ని అణుచుకొంటూ అటే చూస్తున్నాను. చిన్నప్పుడే ఏదో ప్రమాదంలో ఒక కాలు పాదం పోగొట్టుకున్న రాజమ్మ కుంటుతూనే పనికి వస్తూ ఉంటుంది . కూర్చొని చేసేపనులు తప్ప మరేమే చెయ్యననె ఒప్పందంతోనే పనిలో కుదురుకుంది .అలాంటిది ఈ రోజు కుంటుతూ అతి కష్థంతో మొక్కలకి నీళ్లు పోయవలసిన అవసరం ఏమొచ్చింది?
ఆలోచలలో ఉంతుండగానే సమయం గడిచిపోయింది . తొమ్మిదిగంటలౌతుండగా తలుపు కొట్టిన రాజమ్మని చూసి విసుక్కుంటూనే కారణం అడిగేను .ఆమె ఎప్పటిలాగానే చిరునవ్వు సమాధానంగా , పనిలో జొరపడింది . అడిగినదానికి జవాబు చెప్పని దాని నిర్లక్ష్యానికి ఒళ్లు మండినా, ఆ రోజు నాగా పెట్టనందుకు అమ్మయ్య అనుకుంటూ నేనుకూడా నా పనిలో లీనమయ్యాను. కాని నా ప్రశ్నకు సమాధానం మర్నాటి పేపర్లో దొరికింది . కళ్లు పెద్దవిచేసుకు మరీ చూసేను . అవును అది రాజమ్మ ఫొటోయే . ఆశ్చర్యంగా ఫొటో కింద రాసిన లైన్లు చదివేను .
రాజమ్మ తను బతికున్నంతకాలం ఒక అనాధ పిల్లకి అయ్యే ఖర్చులో ,తన వంతుగా ఐదువందలు భరించే బాధ్యత స్వీకరించినట్లు , ఉన్నతహృదయమున్న రాజమ్మ లాంటి సహృదయులు ఉండబట్టే సేవాశ్రమాలు చాలావరకు ఏలోటూలేకుండా నడుస్తున్నాయని , అనాధ పిల్లల సహాయార్ధం మొట్టమొదటి వ్యక్తిగా రాజమ్మ ముందుకు వచ్చిందని , రాజమ్మని పొగుడుతూ రాసిన వైనం కొసదాక చదవలేకపోయాను. ఆ రోజంతా మౌనంగా గడిపేను .ఎవరో అనాధపిల్లకి ఐదువందలు ఇవ్వడంకోసం , సొసైటీపని చేస్తున్న రాజమ్మ మహోన్నతంగా కనిపించసాగింది .
ఆ తర్వాత చాలా రోజులు ఆమె ఎదురుగా కూర్చోని పేపరు చదవలేకపోయాను.కొన్ని నెలలు గడిచేయి .
________________________________
సునామీ ఉదంతం ,ఎవరూ చెప్పకపోయినా ప్రతీ చేవికీ సోకిన వార్త. ప్రతీ టి.వి.లోనూ ,వీధిలోనూ అదే ప్రసంగం. బయట ఎక్కడపెడితే అక్కడ డేరాలు వేసుకొని ,మైకుల్లో చెపుతున్నారు , అనాధలైనవారిని ఆదుకోమని , ధనరూపేణాగానీ, వస్తు రూపేణాగానీ, పాతబట్టలు ఇచ్చిగాని , ఏదో విధంగా సహాయం చెయ్యమని కోరుతున్నారు .
తలిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు ,ఇల్లు ,ఆస్తి పోయి ఆక్రోసిస్తున్నవారిని ,పదే పదే చానల్స్ లో చూపిస్తున్నారు .
ప్రతీ వారి నోటా జాలిమాటలు ,వేడి నిట్టూర్పులు .
మా సొసయిటీవారంతా కలసి , ఏదైనా సహాయం చేద్దామని ,నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నరు .అదిగో అంతలోనే రాజమ్మ ఈ పిల్లని వెంటేసుకువచ్చింది . ఈ పిల్లెవరే రాజమ్మా,అని తను అడిగినదానికి రాజమ్మ " ఏమో ,తెల్వదమ్మా .ఏదైనా సాయం సేద్దామని ,సునామీ జనాలకాడకి పోయినా. ఇదిగో ఈ బిడ్డ నా కొంగట్టుకొని ""అమ్మా ..అంటూ , ఏడుపందుకుంది . నా పానం ఆగనేదు . ఆళ్లని బెతిమినాడీ ఈ పిల్లని పెంచుకుందామని తెచ్చినా.నాతోపాటే ఉంటాది .పనిసేసే ఈడొస్తే దాని కూడదే సంపాదిస్తది'' అంటూ దానిని అక్కున చేర్చుకుంది .
తల దువ్వుకుంటూ రాజమ్మ మాటలు వింటున్న నాలో ఏదో అలజడి ., అశాంతి . అన్యమనస్కం గా బొట్టు పెట్టుకుందామని అద్దం లోకి చూసిన నేను ఉలిక్కి పడ్డాను . అద్దంలో నా మొహం , స్ఫోటకం చుక్కలతో ,బొల్లి మచ్చలతో వికృతంగా కనిపిస్తున్నాది . గాభరాగా , చటుక్కున తల తిప్పుకున్నాను .
ఇదేంటీ..తెల్లగా ,అందంగా ఉన్న నా మొహం ,ఇంత వికృతంగా ఎలాగయ్యింది ? అనుకుంటూ వణుకుతున్న చేతులతో
మొహాన్ని తణుముకున్నాను. అంతే .....నాలో మరో మనిషి వికృతంగా నవ్వింది . " నీ అసలు రూపదే. పైకి కనిపించినంత అందమైనదికాదు నీ లోపలి మనసు. అన్నీ ఉన్నా ఏదో తక్కువ అయిందన్న అసంతృప్తి నిన్ను వేధిస్తున్నదానికి కారణం నీకు సంకుచిత మనస్తత్వం ఉండడం వల్లనే . నీకు మనసు లేదు , మనిషిగా మనిషికి సహాయపడే గుణం అస్సలు లేదు .అందికే నీ రూపానికి అందం లేదు "" అంటూ పగలబడీ నవ్వుతున్నాది .
ఒక్క క్షణం అయోమయంగా నిలుచున్నాను . ఎదురుగా తల వంచుకు పని చేస్తున్న రాజమ్మ మహా మనీషిలా, ఆమె ముందు నేను అతి చిన్న మరుగుజ్జులా అనిపించ సాగేను .
అంతే ! ఒక నిస్చయానికి వచ్చేను . గబ గబా చీర కట్టుకొని , చేక్కు బుక్కు తీసుకొని , బీరువా తెరిచేను .
అవి, ఇవి అని చూడకుండా ,చేతికందిన చీరలు సంచిలో కుక్కి " రాజమ్మా ! తలుపెయ్ ! ఇప్పుడే 'వస్తానంటూ''
బయలుదేరేను .
నడుస్తున్న నాలో నిండుదనం . అవును . నాకిప్పుడెంతో తృప్తిగా ఉంది . ఏదో దివ్యమైన వరం పొందిన సంతృప్తి . ఇన్నాళ్లూ నాలో లేనిది పొందానన్న ఆనందం .
అవును ,ఇకనుంచీ ఏ విషయంలో నైనా సరే నా మనస్సు వెనక్కి లాగదు .లాగనివ్వను ,అనుకుంటూ ఆటోరిక్షాని పిలిచేను .
సమాప్తం.
* * * * *
Sunday, September 13, 2009
Subscribe to:
Posts (Atom)