'నీవు లేక వీణ పలుక లేనన్నది'
కిళాంబి వెంకట నరసింహాచార్యులు ....... పేరు నోరు తిరగదేమో గానీ , ఆయన వ్రాసిన పాటలు మాత్రం పది కాలాల పాటు , పది మంది నోట మరీ , మరీ పాడబడుతూనే వున్నాయ్ . 'పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్ల' కు , 'ఆడుతూ పాడుతూ' పని చేసికునే సామాన్యులకు సైతమూ సులభంగా అర్ధమయ్యే రీతిలో అసామాన్యమైన భావాల్ని పలికించిన 'ఆత్రేయ' - అందరికీ తెలిసిన ఆయన పేరు . ప్రొద్దున్నే 'శేషశైలవాసా , శ్రీ వేంకటేశ ' అని దేవుణ్ణి కొలవాలనుకుంటే , ఆయన పాటే కొలువు ; 'కారులో షికారు కెళ్లే ' పడుచును ఆట పట్టించాలన్న ఆయన పాటే ; 'చిట పట చినుకులు పడుతూ వుంటే' తడుస్తూ సింగారంగా ఏదైనా పాడుకోవాలంటే ఆయన పాటే. 'కనులు లేవని నీవు కలతపడవలదు’ అంధుల కైనా 'కనిపించి , కనువిందు కలిగించు ' 'శిలల పై శిల్పాలను ' - 'నా కనులు నీవిగా చేసి కొని చూడు ' అని సాంత్వనం పలికేది ఆ పూదోటే . 'రాతి స్థంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే' పాడేలా జాలువారింది ఆయన కవితా ధాటే.
'పాల గుండె లో ఏది దాగుందో తెలుసునా ' ' నవ్వినా , ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి ; ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా' అని అమాయకంగా ప్రశ్నిస్తూనే , 'మనసు మూగదే కానీ బాసున్నది దానికి' అన్న భావుకత , 'మనసున్న మనిషికి సుఖం లేదంతే ' అన్న వేదాంతం పలికిందీ ఆయన మాటే. 'చెంగావి రంగు చీర కట్టుకున్న' ' 'తెల్ల చీర కట్టుకున్న ' ' నీ సుఖమే నే కోరుతున్న' అన్న నిస్వార్థ భావన , 'ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే ' అని సతమత మయ్యే తపన, 'ఎవరి కోసం' ఈ భగ్న హృదయం అని భగ్గుమని రగిలే ఆవేదన - అన్నీ ఈ 'మనసు కవి' మది పూదోట విరిసిన 'తేట, తేట తెలుగు' లే.
ఆయన సినీ ప్రస్థానం లో పాట , పాట గా కందళించి, పాటపాట (కొంచం, కొంచం) గా అవఘళించి, గమ గమ గుబాళించి - చిరకాలం నిలిచిపోయే మనస్సు చివుక్కురుమనిపించే చివుళ్లు- ఇలా ఎన్నెన్నో.
క్విట్ ఇండియా ఉద్యమం లో జైలు కెళ్ళిన ఈ దేశ భక్తుడు నాటకాల రచయిత గా రంగ ప్రవేశం జేసినా , సినిమాల్లో చిక్కుకు పోయాడు. చిత్రానికి తానే నిర్మాత అయినా, తనే స్వయంగా రాయగలిగినా , మరో 'మహా కవి'ని ఆహ్వానించి , రాయమని కోరగల మా దొడ్డ సంస్కృతి ఈ మనసున్న మనిషిది . జయభేరి కి అర్వాచీనం కాని ఆయన మాటలు వన్నె తెస్తే, ఎదలు ద్రవించి ఏరులయ్యేలా మనసులు పిండే అయన సంభాషణలు మంచి మనసులు నుండి ప్రేమ నగర్ వరకు.
'విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని ' వక్కాణిస్తూ 1989 లో ఆయన మనల్ను వీడిపోయారు .
ఆ జ్ఞాపకాలు మన మనసులను కలచి వేస్తుంటే ఎటునుండో 'పాడుతా తీయగా చల్లగా' అంటూ ఆయన గొంతు మార్దవంగా విన్పిస్తోంది .
ఆయన పుట్టిన రోజు , ఈ రోజు .
అందుకే ఈ అంకిత భావ కుసుమాల రోజు (నిట్టూర్పు)
No comments:
Post a Comment