Thursday, January 21, 2021

పాశురాలు 1 or 25

1..వ పాశురము 


మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని

పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో

తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో

స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥ 

నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥

సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥ 
-----------------------------------------------------



పాశురము 2 .


నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ

తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥

పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥

కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥

సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥

నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

--------------------------------------------
పాశురము 4.

శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా

మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడు

కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ 
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే 

లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె 

శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే  వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥
------------------------------------------------------
[
పాశురము 5.

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు

పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... 

మధురాధి పతి మేటి  మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు 
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు 

ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటి
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... 
----------------------

పాశురము  6. 

యదువంశ కులతిలక యాదవ సర్వోత్తమ
రమాపతి రక్ష రక్ష  మాధవ మనోహరా

అక్షరాహంకార ఆది  నియామక
హృదయనామాలంకృత  హృన్నిలయ మాధవా
                                           
చెలియ లారే రండి  చేరి కొలువగ హరిని
శ్రీ రంగ నాధుని  శ్రితజన పాలునీ  

గరుడవాహనుడైన హరి ఆలయమునదెే
సుర శంఖ నాదములు  విను పంకజాక్షీ
పురుషోత్తముడు పుాతనా స్తన్యము గ్రోలుా
ఘనుడు  మొాక్షమునిచ్చు కేశవ ముార్తి 

శేష శయనము సేయు యొాగ నిద్రా వరుడు
దాస పోషణుడితడు దానవారీ
ఋషులు యొాగులు మునులు 
మొాదమున మేల్కొల్ప.....
యశములిడ మత్తు విడు 
మధుర మంగళు డితడుా
                                              
చెలియలారా రారే చేరి కొలువంగ హరిని
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ 
-----------------


పాశురము 7. 

ఎంత పిలుతును నేను ఏమని  పలికెద
వింతగాదే చెలులుా వివరించి తెలుపగా॥

తొలొపొద్దు పొడిచేను తెమిలిరారే చెలులుా..
కులదైవమును తలచి కుార్మి రంగని కొలువ॥ఎంత ॥

ముాడు వేదములకు ముాలమైన స్వామి
ముాడులోకాలకుా  ముార్తి పరమాత్ముడు
సర్వము తానై వ్యాపించు నాధుని
త్రైలోక్య ముార్తిని  తిరుగోవిందుని 

సుక-పికా  రవముల ఆనంద గీతాల-
మేలుకొల్పులు వినవె మీన నేత్రీ...
కేశిని దునిమినా కేశవ ముార్తితడు
వెన్న పాల దొంగ  వేంచేయు వేళాయె 

విద్యలెరిగిన మీకు విజ్ఞతలు తెలియవా
వంద్యమానుని కొలువ వడిగ రారేలనే
తగదు తగదోయమ్మ ఈ నడత మీకు
తడయుటలు మాని తరలి రారండే చెలులుా 
--------------

8. వ పాశురము.

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".
అనుపల్లవి:
దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా

చైత్రమాస ప్రియ చక్ర గదా ధరుని
క్షీర సాగర శయను శ్రీ పద్మనాభుని..
క్షీర రాశికిని  సింహ రాశికినీ
నియామకుని ఆ నీల వర్ణమువాని..
చేరి కొలువగా రారే చెలులుా
శ్రీ వల్లభునీ  శ్రీ రంగ ధామునీ..


పొన్న పుారంగుతో  భానుడుదయించేను
సన్న సన్నగ నింగి తురగలించేనుా
ఎనుములదె మేతకై మేల్గాంచి పరుగులిడె
వినవె చిరు గంటల సవ్వడులు మీనాక్షి.

నీరాడ బోవుమా  నీదు వాకిట నిలచి
నిను పిలువ వచ్చేము ఓ నీరజాక్షీ
కీర్తింప పర నిచ్చు కేశవ ముార్తి ...మా
కుశల మడిగీ సేద దీర్చె శ్రీ విష్ణువు 

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".

దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా

-----------------------------------------------------------

పాశురము-9

శంఖ పద్మ గదా చక్రము ధరియించీ 
మధుసుాదన నామకా అసురుని దృుంచీ...

సాత్విక లోకానందా  సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య  ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా 
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥

రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ 
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥

వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా॥

అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ  పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥

రండి రండే చెలులుా  చెలియ లేపి రండే 
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥
---------------------

పాశురము  10. 


అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని ॥


చెలియలారా రండే  సేవింప హరినీ

  శ్రీ రంగ నాధునీ శ్రీరంగ నాధునీ ॥


ముాడు వేదాల లో ముాడు లోకాల లో

ముాడైన గుణములు, ముాడు కాలాల లో

చేతనాచేతనల  భుాతాది జీవుల లో

చేరియుండెడువాని చెంగల్వ పుాధరుని॥


చెలియలారా రండే  సేవింప హరినీ 

  శ్రీ రంగ ధాముని   శ్రీరంగ ధామునీ ॥


ముాడు లోకాలకుా ముాలమైనా స్వామి

త్రైలోక్య నాధునీ త్రివిక్రమ ముార్తిని  ॥

అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని..॥


శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

సంగతిది వినికుాడ ఉలకవుా? పలుకవుా?

శ్రీరంగనీ నోము నోచియుంటివిగదా..॥


కుంభకర్ణుని  నిదుర నిను చేరెనా ఏమి?

కంబు కంఠీ నిదుర విడువ రావే చెలియ ॥


ఇంపైన తులసీ. సుమ మాల గళము నిడి

సొంపుగా మంగళములందె శ్రీ కరుడుా..

ఒంపు సొంపుల ఘనుడు నందనందనుడు

పురుషార్ధములనిచ్చు సిరి పుణ్యముార్తీ ॥


వేగ తెమిలీ రావే వర మందగమనీ

వేలకీర్తులు పాడి వేల్పు కొలువగ హరిని ॥

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని..


శ్రీరంగ నాధునీ శ్రీ రంగ నాధునీ.

------------------------------------------

పాశురము 11.

చక్ర గదా పద్మ శంఖ ధారీ మురారీ
దైత్య కుల నాశకారి వామనావతారీ
సుఖాభీష్ట సిద్ధి ప్రద ముక్తి మొాక్షకారీ..
జిహ్వ తత్త్వ  నియామకా జిత వైరి మురారినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగనాధునీ...॥
:
శ్రాత్రవ బలముల గొల్ల పట్టివి నీవుా 
పేరుగల పుణ్యవతి పెద్దింటి పడతి
వాలు కన్నులదోయి వంపు నడుము కల్గిన
నెలత, నెమలిని బోలు నడత వన్నెల బోడి॥

చెలయ రావే తెమిలి కొలువంగ హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి విష్ణు నీ..॥

తిరునామముల  పాడి తీరైన వన్నె కాని 
శ్రీకృష్ణుని  పరమాత్ముని సేవింప వస్తిమి
ద్యాన మగ్నవై ఇహమును మరచిన మాయమ్మా
ఉలుకు పలుకు మాని నిదుర నటియించకమ్మా॥

రావే నీ రాకకై వేచి యుంటిమి మేము
బంధు జనుల కుాడి భవుని కొలువ
రావే రమణి నామ కీర్తనల రంగని
సేవింప గానముల పుాజింప హరినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగ నాధునీ....॥

-----------------

పాశురము 12.

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా.

లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.

కొలువగ!  నాధుని,  లెమ్మా!  నిదుర వీడు మమ్మా
వినవే ! శ్రీ విభు కీర్తన ! బంగారు బొమ్మా..

రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ..

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా.

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ ..

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....
-------------------

పాశురము:  13.

చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి  పరంధామ హృషీ -కేశావతారీ

రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ  ఇహ పర హితకారునీ 

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ 

పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి 

పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ 

మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ 

---------------
పాశురము:  14. 

చక్ర పద్మ శంఖ గదా  ధరుడు హృషీకేశుడుా..
వాక్ తత్త్వ సారుడుా  వైకుంఠ  ధాముడుా

ఇంద్రియ నియామకుడు ఇందిరా రమణుడుా
రమ ! బ్రహ్మ  ! రుద్రాదుల కానందమిడువాడు 

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా 

ఎంత గడుసు దానవే  ముద్దుల గుమ్మా
నటనలింక చాలు చాలు మాటకారి వమ్మా

పెరటి తోట కొలనులో కలువలు వికశించెనమ్మ
నిదుర లేచి తలుపు తెరచి మము చేరగ రావమ్మా

"మిమ్ము ! లేపెద "ననుచుా  మాటిచ్చీ మరచితివి
నమ్మికిక  లేటికినే  మధుర వచనా...మాకు
సీమాటి సిరిమల్లీ  సిగ్గులేదటె నీకు
శమము దీరిన రావె సమకట్టి తడయకిక 

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీ గిరి శ్రీ వాసునీ  శ్రీ రంగ నాధునీ .॥

దేవళముల జేరె మునులు   దేవుని పుాజింపగా
దేవ దేవుని హరిని  కీర్తించీ కొలువగా..
ధవళ దంతపు దివ్య తేజ మలరగ నిలచెే
కమలనేత్రుని కొలువ కదలిరా మీనాక్షీ..

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా
------------------------
పాశురము:  15 . 

భక్త హృదయ తేజ భాగవోత్తముడుా
భవబంధ మొాచనుడు శ్రీ పద్మనాభుడుా
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువరావే సఖియ కోరి శ్రీ రంగనీ ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

మున్ను తెలియదు నీదు ముద్దు మాటల తీరు
నమ్మినారము నిన్ని ఓర్మి వేచితిమిచట
కదలి ఇక లేచిరా  కఠినాత్మురాలా....
గోష్టి కలియగ  రావె  గోవిందు కొలువగా..॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

కంసాది దుష్టులా   దునిమి నట్టీ ధవుడు
నంద గోపాలుడుా ఆనంద ధాముడుా...
గొల్ల భామల  తోడ కొల్ల లాడెడు 
మేటి  మాయావి మేల్కొనవె  ముదము 
రంగని కొలువ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

గోపబాలికలార ! కోపమేటకిలింత !
విదితమాయెను తప్పు వదరుటలు మానరో.....
అందరిట జేరితిర !  అతివలారా నాదు-
జాప్యమిక లేదింక ! జలజాక్షు లాగరో...॥

మీ మాట మీపాట పాల మీగడ ముాట
మిము గుాడి వత్తు  నే  జలజాక్షు లాగరో...॥

భక్త హృదయ తేజునీ భాగవోత్తమునీ
భవబంధ మొాచనునీ  శ్రీ పద్మనాభునీ
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువవత్తునే సఖియ  శ్రీ రంగ నాధునీ ॥
శ్రీ రంగ నాధునీ     శ్రీ రంగ నాధునీ.....ఆ.....
----------------------------

పాశురము 16.

భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ 

ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

అందమైన తోరణాల అద్దంపు మెరపులా...
మణి కాంతులు చిమ్మి మెరయు బంగారు పుాతలా...
ధగధగలా మెరయుచున్న ద్వారముల తెరువుమా
మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా ॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...

అతులిత సౌందర్యమలరు నంద ధామము గాచు
వికసిత వదనారవింద రేపల్లె రేడా...
డెప్పరమ్ములైనట్టి  టెక్కపు కంబము లున్న
రంగారు వాకిలినీ తెరువయ్య రంగా...॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

విస్మయపు చేతలా విజ్ఞత లెరిగినవాడు
పరనిత్తు  నని   మమ్ము  నమ్మించినాడుా...
వన్నెకానిని లేపి ఎరిగించు మారాక
తెరిపించవే తలుపు తోయజాక్షీ సఖీ..॥
 

భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ
ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.


మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా
తీయరే తలుపులనుా మా రంగని కొలువగా ॥
----------------------------+

పాశురము:  17. 

త్రైలోక ఆవాస ముక్తి మొాక్ష కారకునీ
యశములిచ్చు  వానినీ యశోదా తనయునీ ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

అక్కసమున ఆదరించి అన్నము  జలముల నిచ్చే
చక్కనైన మాసామీ నందా గోకుల బాలా
మలయు నీ నుతుల పాడ చయమున వేంచేసితిమీ
నిర్గమించు నీరజాక్ష వామన సుర వంద్యమాన  ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

అతులిత బలధామా భ్రాత శ్రీ బలరామా
తురగలించు పాటనలిడి పరమాత్ముని పిలువుమా
మహితుడౌ శ్రీ పాదుని అనుజుని తోడ్కొని రావే
ఈకొని మా మన్ననలను యెలమి హరిని మేల్కొల్పవె॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ...

ఆనందా అనిరుద్ధా ఆదినారాయణా
పసరె నీ ఖ్యాతులెల్ల పరమాత్మా చిద్ఘనా
సొంపైన బంగారు కడియంపు పాదమును
కొలువంగ  చయమున,  గుాడి వచ్చితిమయ్య ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగనాధునీ శ్రీహరి శ్రీ విష్ణు నీ ॥
----------------------------------------

పాశురము 18.  

తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥


పల్లె లేచెను నిదురలేపుమ    
నీల వర్ణుని శ్యామునీ
వేడు చుంటిమి వేల నుతులా 
వేల నామములున్న వానీ
నంద నందను కోడలా  
నాధు లేపుమ ....నీరజాక్శీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ..తలుపు తెరుమా  ॥

మదపుటేనుగు బలము కలిగి 
భుజబలమ్మున పోరు సలిపే
పద్మనాభుని రాణివమ్మా  
పలుకు మొకపరి.... నీలవేణీ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ....తలుపు తెరుమా  ॥

విరతి నేలెడు వాని పొలతి 
విడుమ నలవట్టమును నీవు
విభుని వలపుల రాణి వీ... 
నప్పిన్న  నేర్పరి ... నీవు  సుమ్మ ॥

లలిత రాగపు కంఠి  కలికి
కలల రేడుని ...లేపవమ్మా ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక...... తలుపు తెరుమా  ॥

తరుణి రో ఇక తరలిరమ్మా 
తడయుటలు ఇక  వదలిరమ్మా.
కరపు కంకణ  గలగలల తో 
కురుల కమలిక కోమలాంగీ
చలిపి నవ్వుల కులుకు కొమ్మ 
హరిని కుాడి ...రావె కొమ్మఁ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ...తలుపు తెరుమా  ॥

తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥

----------------------------

పాశురము:  19 


గుణ పుార్ణ సంపుార్ణ  జ్ఞాన , ధ్యానానంద
వేద -విరుద్ధఆచార నిరతీ దుార
బోగాది భాగ్యప్రద  భుారి కరుణాపాంగ
యొాగనిద్రామయా యొాగిజన వంద్యా...

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీల మేఘశ్యామ ॥
నీళా హృధీశా

 గజరాజు దంతంపు కోళ్ళ పానుపు పైన
పవళించు పరమసత్మ పాహి పరమానంద
నీలవేణి ని గుాడి నిదురించు మా సామి
నిత్య పుాజలనందు కొనగ రావేమయ్య ॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనుమయ్య  నీళాహృధీశా ॥

మత్తునిండిన మల్లె పుాలు సిగ ముడిచీ
చిత్తు చేసితి వమ్మ మా సామి చిత్తమును
హత్తుకొన్నది  చాలు అలరు నీ హొయలతో
తగదు తగదోయమ్మ ఈరీతి నీకుా...॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
తురగలించెడు దివ్య మణిరత్నములు పొదుగు
పంచ గుణముల మేటి పరుపు నలరించీ
నీళ వక్షముపైన నిదురించు మా సామి
తలిరు బోడిని వీడి తరలి రావయ్యా...।

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
విరతి చాలించి ఇక విమలయశు వీడవే
నాధు విడువగ నీకు నిదురనటనేలనే ...
తఱచి వెన్నుని నీవు వలచినది చాలులే
మఱుగు సదనము వీడి మాటాడనీయవే ॥


నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥---
-----------------------------

పాశురము: 20. 

కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని ।

సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని
సత్య పరాక్రమ మెరిగిన మాయమ్మ 
మక్కువ మీరగ విభుగొని రమ్మా... ॥

నీదు వాకిట మేము నిలచితి మొాయమ్మ 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ ॥

ముక్కోటి దేవతల భయము బాపెడు దేవ
డెప్పరము లౌ లీలనసురుల దునిమేవ
అక్కసముతో  మమ్ము ఆదరింపగ రావ 
కొల్లలాడుట చాలు నప్పిన్న విడిరావ ॥
నప్పిన్న విడిరా......

నీదు వాకిట నిలచి వేచి యుంటిమి సామి
నిదుర చాలించి యిక  నీరాడ వేమీ ॥
నీరాడ రావేమి...?

ఎఱ్ఱన్ని పెదవులా   ఏపు  గుబ్బలదాన
సన్నన్ని కటిగల సతి నీళ  సిరి వదన
అలవట్ట మిడి, కుాడ అద్దమిచ్చీ పొమ్మ 
నాధు విడువగ పోము నీరాడ నళినాక్షి  

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నమ్మా॥

కుక్కుటములదె కుాసె  కెందమ్మి వికసించె 
 విరతి నిక చాలించి విభు గొని రామ్మా ॥
సారసాక్షుని గుాడి సరిగంగ తానాల
కనుమతించ చోయమ్మ కమలాక్షి మాయమ్మ ॥

కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని 
సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని॥

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ॥

----------------------

పాశురము 21.

నందా...గోపాలబాలానందా  ఆనంద లీలా...
విందులే నీ వేణునాదము వినగ మధురము ఈ జగాన॥ నందా...

పల్లెలో రేపల్లెలో మా చల్ల ముంతల కొల్లగొట్టి
ముందుగా మావెన్న  పాలను ఆరగించిన చిన్ని కృష్ణా 
ఆదుకొన భువినవతరించిన ఆది దేవుడ వీవయ్యా
నిన్ను కలువగ వస్తిమయ్యా నిదురలేవర కన్నయ్యా॥నందా...


పాలకయండలు నిండిన పాలిచ్చు పాడిగల వాడవుా
పాలకుడు ఆ నందునీ పరమ ముద్దుల బాలవుా...
శీల సద్గుణ రాయ గ్వాలా కృష్ణ మేల్కొని రావయ్య
జాలమేలర మాదు మొరవిన జగములేలిన వాడవయ్యా ॥ 


ఆశ్రయించితిమీ..నిన్ను ఆదుకొనగా రావయ్యా...
విశ్రమించుట చాలు చాలిక వేద వేద్యా యొాగి వంద్యా
మధరగీతములాలపించి మంగళ శాశనములిడుచు
నీదు పదముల పుాజింప నీదు వాకిట వేరచియుంటిమి.॥  

యఖుడ వీవని తలచి వస్తిమి
యాదవా కుల దీప ధన్య..
చిన్న నాటీ సఖుల చేరగ 
రార కృష్ణా  రయముగాను
సుప్రభాతము పాడు చుంటిమి 
సుార్య తేజా లేచి రమ్మా ॥ 
---------------------------------------

పాశురము 22.

ఏ పుార్వ పుణ్యమొా ఏ నోము ఫలమొా
రేపల్లె వాసుల మైతిమొా క్రిష్ణయ్య
విరిసిన కలువల రేకు కన్నులవాడ
ఒకపరి మము జుాడ మరుగేలనయ్యా..।॥

ఉభయ శరీరాల ఉన్మాదాకృతితో
ఉరికిన రంగా శ్రీ నారసింహా 
ధర నుద్ధరించిన దానవారివి నీవు
అరమొాడ్పు కన్నుల అలసి పరుండేవ...॥

రణరంగ ధీరులౌ రాజాధిరాజులు
పణమొడ్డి పోరాడి ఓడి దర్పము వీడి
క్షణమైన నిను విడక  నీ దాసులౌ రీతి
వేల నుతులను వేడి నిను జేర నిలచితిమి ॥

డెప్పరములౌ నీదు  నామ కీర్తన తోడ
పులకరింతల మేని నిన్ను కొలిచేము
సుార్య చంద్రుల పోలు కాంతి కన్నుల విప్పి
పాపాలు మడియించి మ మ్మేల రావయ్య.. ॥

కరుణతో మమ్మేల  కన్నడించగనేల 
ప్రహ్లాద వరదా  ప్రభు పాండురంగా...
అతులితమౌ నీదు బల అవతారముల
శాప పాపము గాల్చ  మేల్గాంచుమయ్యా ॥
----------------

పాశురము 23.

అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.

ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ 

శుద్ధ జ్ఞానానంద శుభ గుణ సంపుార్ణ
అవని కార్యము గనుమ అచ్యుతా అనంతా...
శృతి సార సంపుార్ణ  సిరి నిలయ శ్రీరంగ
మాకోర్కెలను దీర్చ మన్నించి వెలికిరా...

వర్ష ఋతువందునా  వర్షించు మేఘాల
సవ్వడికి మేల్గాంచి సింగమ్ము లంఘించి
భీకరాకృతి తోడ  భీషణపు ఘర్జనల
గుహను వదలీ బయలు వెడలు రీతీ....

నిర్గమించర సామి నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్పు నీవేగద పరమేశ 

విచ్చు తామర వోలె వరలు కన్నులు తెరచి
యిచ్చ మము గావుమా సమకట్టి నార్తితో
విజయ పీఠమునెక్కి విను మా విన్నపాలు
హృన్నిలయ శ్రీ చరణ సమ్మతిని  మము బ్రోవ ॥


అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ 
-----------------------------------------------------



పాశురము: 24 .


మంగళ ధాముడవు మంగళ నాముడవు 
అవతారములనెత్తి  ఆదుకొను దేవుడవు..


మంగళమ్ముల నిడి మము బ్రోవ వత్తువని
నమ్మి కొలిచేమయ్య  వ్రత దీక్ష పుానీ ॥

కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

నీ పుాజ చేయంగ నిత్య స్నానములిడి
నీ లీల గానాల నీ పాదముల గొల్చి
మార్గశీర్షపు వ్రతము మనసార సలి్పి
నిత్యమంగ ళముకోరి నిను  కోరి వచ్చితిమి ॥

 కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

ముల్లోకములు గొలువ మలయు పాదములకుా
రావణాది అసురుల మడియించు శక్తికి
పుాతనాదుల గుాల్చు పురుషోత్తమా నీకు 
నిత్య శుభ నీరా జన- మంగళములివే  ॥

కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

గోవర్ధనము నెత్తి   గోవుల గాచేటి
గిరిధారి కృష్ణునకు  ఘన మంగళం ..ఘన మంగళంబిదే
వెన్నిడౌ శ్రీ ముార్తి యఖుడు మా కనినమ్మి
మహిత గుణముల మేటి మంగళము పాడేము  ॥

కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥ .


వేలాయుధమ్మునకు వేద వేద్యా జయము
వేల నామాల శ్రీ హరి  క్రిష్ణ జయము
పురుషార్ధముల నిచ్చి పరనిచ్చు పరమేశ
 నాధ  శ్రీ జనార్దన  గొనుమయ్య  మంగళం ॥

 కనులు తెరచీ చుాచి కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥
మంగళమ్ముల గొని మమ్మేలుమయ్యా
రంగ శ్రీనాధా సిరివర గోపాల .॥

----------------------------

పాశురము 25.

రేపల్లె వాడలో  నడయాడు గ్వాలా 
నంద యశోదల  ముద్దుల బాలా  
ఆపద్బాంధవ  హరి అవతారా
అందాల  శ్రీ క్రిష్ణ మురళి మనోహర ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పాపి కంసును దునుమ  పాపనిగ వచ్చితివి
దేవకి వసుదే వులకు జన్నించితివి
నడి రేయిలో నందు నింట జేరితివి
కొల్ల లీలలు జేసి  కులముద్ధరించితివి ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పురుషార్ధములనిచ్చు పుణ్య చరితవు శ్రీశ
వరముగ సంపదల నొసగు శ్రీ వల్లభా
కెరలుకొను నీ కీర్తి కొనియాడ లేమనీ 
వరలు భక్తిని కీర్తనలు పాడ వస్తిమి ॥ 

అండగ నీవుండ  ఆపదలు మాకేల
 ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

సంపదలనిచ్చేటి శ్రీలక్ష్మి  నిను కోరి
ఇంపైన కోర్తనల నిను కీర్తించీ
హృదయ పీఠము నలరు వలపందలేదా
మొాదమలరగ విరతి నిడి మనలేదా ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళిీ మనోహర ॥
---------------------------------------------





No comments:

Post a Comment