కాలుష్య మెరుగని, కల్లక పటము లేని
చిన్ని పాపను నేను , చింత లేవెరుగను॥
చిందులేయుచు ,అమ్మ ఒడి చేరి నిదురించు
చిన్న పిల్లను, చిన్ని పసి పాపను నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
అన్న ,నాన్నా, తాత,మామ నాదీ యనుచు
వలపు పంచెడి పసిడి పాల పలుకు ను నేను॥
అంత రంగము నల్ల-కల్లోల మైనట్టి-
అలోచనలు రాని ,చిన్ని ప్రాణి ని నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
ఆడ -మగలను వేరు, భావమ్ము తెలియని-
పసి మనసు పట్టి నవు వట్టి అబలను నేను.॥
ఏ చేయి రక్షించు ,నే చేయి బక్షించు నను-
మర్మ మెరుగని , లెేత మొగ్గను నేను॥
ముద్దు మురిపెపు వలపు..సద్దు మణగిన పిలుపు_
సరి కీడు లెరుగని , వట్టి వెర్రిని నేను.
పసి దేహమును కామ, చింతనతో చుాచేటి,
కాముకుల నెరిగేటి, మేటి జ్ఞాని ని కాను.
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
ఆదరించిన హాయి ,అన్న మెట్టిన చేయి,
అమ్మ ఒడి సాటనీ...నమ్మి మురిసితి నేను.
నటన నేర్చిన నరుల, వికట రీతుల, వలల
చిక్కి చితికిన చిన్ని, ముద్దు గుమ్మను నేను.
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
నాది , నా వారనుచు నమ్మ, నను గద్దించి,
నిలిపి నలిపిన , భీతి నేడ్చు బేలను నేను.
విధి వంచనకు వాడి , తోలు బొమ్మగ మారి
పలు కాముకుల కొదుగు' బెదురు బొమ్మను నేను
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
--------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
------------------------------
No comments:
Post a Comment