25/ 9/2019.
---------------------
హలో....
ఇది నేను బొంబాయి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనండీ...అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు కుాడాను. సమంగా హిందీ భాష కుాడా రాదండీ నాకు. కానీ కొంతమంది తెలుగువారితో పరిచయం , వారి రాకపోకలతో, భాష రాదే ....
ఎలాగ..?
అన్న సంగతే మర్చపోయేనంటే నమ్మండి...
అదిగో ...ఆ సమయంలోనే నాకు సుధ
గారితో పరిచయం అయింది. ఆ పరిచయం ఎప్పుడు నువ్వు అనేదాకా వెళ్ళిందో ..ఇద్దరం గమనించేలేదనుకోండి.
ఆ తర్వాత ,
నేను , సుధ , మంచి స్నేహితులమయ్యేమండీ . ఇద్ధరం హౌస్ వైఫ్ లమే. మా ఇల్లు సుధా వాళ్ళ ఇంటికి కాస్తంత దుారమనే చెప్పాలి. ఇద్దరికీ పాటలన్నా , సంగీతమన్నా , చాలా ఇష్టం. అంతే కాదండోయ్..
ఇల్లాలి ధర్మం నిర్వర్తించడం లో కుాడా ఇద్దరం ఒకరికొకరం తీసిపోమనే చెప్పాలి. అడపా-దడపా కలుస్తుా ఉన్నపుడు , మా ఇద్దరికీ తెలిసిన పాటలు పాడుకుంటుా...తెలీని పాటలు వింటుా , విన్న పాటలు అప్పటికప్పుడే నేర్చీసుకోవాలనే తపనతో సమయం ఎంతయిందో కుాడా చుాసుకోకుండా ఉన్న రోజులు కుాడా , చాలానే ఉన్నాయండోయ్..
మా ఇద్దరికీ కుాడా మంచి శ్రీవార్లు దొరకడం మా అద్రుష్టమనే చెప్పాలి.
ఇలా ఎందుకంటున్నానంటే...
మేమిద్దరం కలిసిన రోజు మా ఇంట్లో మాడిపోయిన కుార ..ఉప్పు లేని పప్పు..అడుగంటిన అన్నం ...తింటుా కుాడా , మమ్మల్ని ఏమీ అనకుండా ఉంటున్నారంటే...మరి మంచివారేకదండీ....
కానీ ప్రతీసారీ భరించడం కష్టంగా ఉన్నాదేమొా మరి ..
ఒక ఆదివారం రోజు, మా శ్రీవారు అడుగంటిన
కుార కలుపుతుా...సహనం తెచ్చిపెట్టుకున్న గొంతుతో ఏమన్నారో తెలుసా...
.... " ఇంత పాటలు ఇష్టం ఐనపుడు , ఈ పాటలు శ్రుతి , లయ , లేకుండా పాడడం మాని , ఇద్దరుా కలిసి కర్నాటక సంగీతం నేర్చుకోవచ్చు కదా. అది నేర్చుకుంటే పద్ధతిగా పాడడం తెలుస్తుంది కదా . మీ ఇద్దరి గొంతుకలు కుాడా కలుస్తున్నాయి. వినడానికి కుాడా మీ గొంతులు బాగున్నాయి . సంగీతం నేర్చుకుంటే , మీరు ఎక్కడైనా పాటలు పాడితే వాటికి విలువైనా ఉంటుంది. సొసైటీ లో నాకుా గర్వంగా ఉంటుందీ... అంతేకాక , మీ సరదా కుాడా తీరుతుంది. గురు ముఖతా నేర్చుకున్నది ఇట్టే వచ్చేసి , రాణిస్తుంది కుాడాను"...అనడంతో ఇద్దరం ఆలోచనలో పడ్డాం సుమండీ...
నిజమే కదా..సమయాన్ని సద్వినియొాగం చేసుకోవడంతో పాటు మంచి కీర్తనలుకుాడా నేర్చుకోవచ్చు..ఆ విధంగా మా సరదా కుాడా
తీరుతుంది ..అదెే ఆలోచనతో ఆరోజు రాత్రి ఇద్దరికీ నిద్రకుాడా పట్ట లేదంటే నమ్మండి.
-----------------------
ఆ సందర్భంగా ,
మరునాటినుంచీ సంగీత గురువుల కోసం వేట సాగించేం నేనుా , సుధా, కుాడా.
.కానీ రోజులు గడుస్తున్నా , కనీసం , సరళీస్వరాలు నేర్పేవారు కుాడా మా చుట్టు పక్కల ఎక్కడా కనపడలేదు. వారాలుా , నెలలుా గడిచిపోయేయి కానీ మాకు సంగీత గురువు మాత్రం మాకు దొరకలేదు. దానితో ఇద్దరం దిగులుపడిపోయేం.
మరి ఉన్న మాట చెప్పొద్దుా...ఈ మధ్యలో మాకు బోలెడు కలలు కుాడా వచ్చేస్తున్నాయండోయ్. అందులో ఎన్ని పోటీలో , మా పాటకు ఎన్ని చప్పట్లో... ఎన్ని ప్రోగ్రాములో....అన్నిటిలో మేమే ఫష్ట్ అంటే నమ్మండి. ఆ సంతోషంతో తెలివి వచ్చేయడం..
పరిస్థితి ఆకళింపయ్యేసరికి ఉసుారుమనడం...
ఇద్దరం కలిసినపుడు ఒకళ్ళనొకళు ఓదార్చుకోవడంతోనే సరిపోయేదండీ...దానితో
మేము మాముాలుగా పాడుకొనే సమయం కుాడా
మా కలల కష్టాలు పంచుకోవడంతో , ముాల
పడింది.
ఇంక ముందు ముందు రోజులన్నీ ఇలాగే ఇంటిపని , పాచిపని, చేసుకుంటుా గడిపేయవలసిందేనా ....అనుకుంటుా...ఒకరినొకరం , ఓదార్చుకుంటున్న సమయం మా వారి కంట పడినట్టుంది....
ఒక రోజు ఆయన చిన్నగా నవ్వుతుా...మనం ఉంటున్న చోట సంగీతం చెప్పేవారు లేకపోవచ్చు .కానీ పక్క ఊరిలో దొరకొచ్చేమొా కదా .ప్రయత్నించండి మరి...
అన్నారు. దానితో ఇద్దరం కొంచం సమాధానపడినా పక్క ఊరనగానే ...వెళ్ళగలమా , లేదా , అన్న సందేహం కలిగింది. ఎందుకంటే మేము ఇంతవరకు కల్యాణ్ దాటి మరెక్కడికీ వెళ్ళనే లేదు. మా మగవారికి ఉద్యోగం చేసి వచ్చేసరికే సరిపోయేదాయె. ఏదో పిచ్చాపాటీ కాలక్షేపం అయిపోయేదనుకోండి.
ఎవరితోనుా అనకండి కానీ....
ఈ విషయమై , అదే పనిగా ఫోనులో మేము చర్చించుకోవడం , రోజుా కుారో , అన్నమొా మాడ్చడం లేదా పాలు పొంగబెట్టి పొర్లించడం వంటివి , ఇద్దరికీ పరిపాటైపోయిందంటే నమ్మండి.
అన్నట్టు మీకు చెప్పలేదు కదుా...
మేమిద్దరం " బొంబాయి "కి కొంచం దుారంగా ఉన్న
" కల్యాణ్ "అనే సిటీ లో ఉంటున్నాము అని చెప్పేను కదా ... బొంబాయికి వెళ్ళాలనుకుంటే మధ్యలో ఓ పది స్టేషన్ లు దాటాలిట. ఇక్కడ చుట్టు పక్కల ఏ ప్రాంతాలకి వెళ్ళాలన్నా లోకల్ ట్రైన్స్ లోనే వెళ్ళాలిట . అదీ కాక..మాకు భాష కుాడా సమంగా రాదు మరి.
చాలా మంది నోట , విన్న మాటలబట్టీ ...తెలిసిన విషయం ఏమిటంటే..
లోకల్స్ చాలా రద్దీగా ఉంటాయనీ, ఎక్కడం , దిగడం , చాలా కష్టమనీ.... దెబ్బతో మరోచోటికి
వెళ్ళాలన్న ఆలోచన కుాడా ఎప్పుడుా చెయ్యలేదనుకోండి. అందికే...
ఆ విషయం తలుచుకోగానే , ఇద్దరం మళ్ళీ
నిరాశ పడిపోయేవాళ్ళం.
మళ్ళీ ఫోను పట్టుకోవడం
నిరాశతో కుాడిన నిట్టుార్పులు , డిస్కషన్ల మధ్య , మాడుతున్న వంట వాసనలుా ..దానితో ఇంట్లో వాళ్ళు మాడు- కుాడు తినలేక , మా మీద రుస రుసలుా , మా విస విసలుా , కోపతాపాల ప్రదర్సనలుా ..,వెను వెంటనే...మా అలకలు..నిష్టుారపు మాటలుా...అబ్భబ్బ...
మరి చెప్పలేననుకోండి.....
ఈ విధమైన గొడవలతో , విసిగిపోయిన మా ఆయన ఒకరోజు....
" సరే లెండి , నేను దగ్గరలో ఎవరైనా టీచర్లు ఉన్నారేమొా..అన్న విషయం , మా స్నేహితుల ద్వారా కనుక్కొని, మీకు చెప్తాను , అంతవరకు కాస్త , ఓపిక పట్టండి. " అనడంతో .,
ఇద్దరం ఆ రోజు కి ఆలోచనలు మాని వంట ప్రయత్నం మొదలెట్టేం .
-------------------------
రోజులు గడుస్తున్నాయి. కానీ మా వారు ఏ సంగతీ చెప్పకపోయేసరికి మాకు ఆత్రుత పెరిగిపోయింది.
మా సమావేసాలు జరుగుతునే ఉన్నాయి. కానీ మా వారినుంచీ ఆ విషయమై ప్రస్థావనే లేదు.
అనుకోకుండా ఒకరోజు సుధ మా ఇంటికి వచ్చింది
ఆమె ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాది. నేను తలుపు తీయగానే
నన్ను పట్టుకొని గిర- గిరా తిప్పేసిందంటే నమ్మండి.
నేను కుాడా నవ్వుతుా సంగతేంటని అడిగా...
తను చెప్పిన మాట వినగానే నేను కుాడా ఆమెని అలాగే తిప్పేశాను. మీకుా వినాలుంది కదుా....
ఇంతకీ సంగతేమిటంటే ...
మా పతి దేవుళ్ళిద్దరుా చాలా కష్టపడి కనుక్కోగా....
కల్యాణ్ తర్వాత , రెండవ ష్టేషన్ ..లోనే ఒక మంచి టీచర్ ఉన్నారనీ , ఇంట్లోనే క్లాస్ లు తీసుకుంటున్నారని, ఫీజ్ కుాడా తక్కువేనని , మధ్యాహ్న సమయంలో కుాడా క్లాస్ లు తీసుకుంటున్నారని , ...ఆ ష్టేషన్ పేరు " డోంబివిల్లి", అని,..కల్యాణ్ నుంచి పది నిముషాలే ప్రయాణం అని,...ఆమె ఇల్లు కుాడా వాకబుల్ డిష్టెన్స్ లోనే ఉందని......
అదండీ సంగతి.
ఒక్క గుక్కలో సుధా చెప్పిన మాట వినగానే , సంతోషం పట్టలేకపోయాననుకోండి.
సాయంత్రం మావారు వచ్చేసరికి ఘుమ- ఘుమ లాడుతున్న సేమ్యా ఉప్మాతో , వేడి -వేడి కాఫీ..
టేబుల్ మీద పెట్టేసరికి , ఆప్యాయంగా తిని...నా వైపు అభిమానంగా చుాస్తుా....
విషయం తెలిసిపోయినట్టుంది...ఉప్మా చాలా బాగుందోయ్...
అనగానే చచ్చేంత సిగ్గేసిందనుకోండి.
పాపం ..చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేసినట్టుంది కాబోలు మరి.. (మా ఆయన చాలా మంచివారనీ ముందే చెప్పేను కదా మీకు..).
మరే....ఆయన నా వేపు మురిపెంగా చుాస్తుా...ఒక చిన్న కాగితాల బొత్తి చుాపించి ,
ఇదిగో ఇవి ఇక్కడినుంచి , బొంబాయి దాకా వెళ్ళడానికి పనికొచ్చే టిక్కెట్ కుాపన్లు. వీటిని మీ హేండ్ బేగ్ లో ఉంచుకోండి. మంచి రోజు చుాసుకొని మీరు క్లాస్ లో ఎప్పుడు చేరదలుచుకున్నారో, చెపితే నేను వచ్చి , మిమ్మల్ని ష్టేషన్ కి, తీసుకెళ్ళి కుాపన్స్ ఎలా వాడాలో చెప్తాను. మీ టీచర్ ఇంటిదాకా దిగపెడతాను. తరవాత నుంచీ మీరిద్దరుా కలిసి వెళ్ళి వస్తుా ఉండండి. మీరు మాట్లాడుకొనీ ఏ విషయముా నాకు చెప్పండి ...అంటుా కుాపన్లు
నా చేతిలో పెట్టేరు.
హబ్బ...నాకైతే కోట్ల రుాపాయల లాట్రీ వచ్చినట్టు , గాలిలో
తేలిపోతున్నట్టుా అయ్యిందంటే నమ్మండి.
మర్నాడు నేనుా , సుధా , చాలా హేపీగా మాట్లాడుకున్నాము. నేను మధ్యాహ్నం సుధా వాళ్ళింటికి వెళ్ళేను. మంచిరోజు నిర్ణయించే విషయం మాట్లాడదామని. అప్పటికే వాళ్ళ ఇంట్లో , సుధా కి తెలిసిన వాళ్ళు కుార్చొని ఉన్నారు. పరిచయాలుా , కాఫీలుా వగైరాలన్నీ అయ్యేయి కానీ...వాళ్ళు కదిలే సుాచనలే కనపడలేదు . మరి నేనెంతసేపని అలా కుార్చోవాలి.
అసలే ఆడవారి నోట్లో ఏ విషయం కుాడా దాగదంటారు కదా...అదే నిజమైందంటే నమ్మండి.
అసలు మా ఇద్దరిలో ,ఎవరు ఎప్పుడు ఈ విషయం ఎత్తేరో ,
ఎలా మొదలైందో తెలీకుండానే , అందరం గల గల మంటుా అదే విషయం గురించి చాలా సేపు చర్చించుకున్నాం .
ఆఖరుకి అందరుా కలిసి తేల్చింది ఏమిటంటే...మరునాడు , సప్తమి - శుక్రవారం పడింది కనుక , ఆ రోజు మొదలెడతే మంచిదనీ...ఆ తర్వాత అష్ఠమి , నవమి కాబట్టి ,ఆలస్యం ఎందుకనీ....ఆడ -మగ , సమానమనుకుంటున్న ఈ యుగంలో మగ - సాయం లేకుండా వెళ్ళలేమనుకోవడం...బాగాలేదనీ , ఇద్దరుా కలిసి ఎడ్రస్ పట్టుకొని వెళ్లి ప్రయత్నిస్తే , ఆ మాత్రం ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని , ధైర్యంగా మరుసటి రోజే బయలుదేరండంటుా ఒకటే నస....
దాంతో ఏమనాలో తెలీక ఇద్దరం బిక్క ముఖాలేసుకొని ఏడ్వలేక నవ్వుతుా...అలాగే అని తలలుాపేం. కానీ మనసులో ఒకటే గుబులు. రేపు వర్కింగ్ డే...కావడం వల్ల మగవారు రావడం కుదరదు . అలాగని మరునాడు వెళ్ళకపోతే వీరందరి దగ్గర పరువుపోతుందనే సిగ్గు. ఏం చెయ్యడమొా అర్ధం కాలేదనుకోండి. ఆఖరుకి మర్నాడు ఇద్దరం
కలిసి వెళ్ళడానికే సిద్ధపడ్డాం. ప్రెష్టేజ్ ఇష్యుా కదా మరి.
నాకేతే ఆరోజు రాత్రంతా నిద్దర పట్టనే లేదు. అటుా ఇటుా పొర్లుతున్న నన్ను , మా వారు అడగనే అడిగేరు. ఏంటి సంగతి..? అని..
నేను విషయం అంతా చెప్పి... తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను.
మావారు మాత్రం నవ్వుతుా..".నిజమే...మీరుకుాడా ప్రయత్నించండి మరి. అంతగా ఇల్లు కనుక్కోలేకపోతే ఇంటికి వచ్చేయండి. శనివారం శలవే కాబట్టి , నేను తీసుకెళతాను..".. అనగానే తెల్లారుతుా ఉంటే...
నిశ్చింతగా నిద్ర పట్టింది నాకు.
--------------------------------
పొద్దున్నే నిద్ర లేచి ముందు సుధాకి ఫోన్ చేసేను .పదింటికల్లా బయలుదేరుదాం , రెడీగా ఉండమని.
ఫోను పెట్టడమేంటి...ఆదరా-బాదరా రోజువారిీ పనిలో పడ్డాను. .. తొమ్మిదిన్నర అయేసరికి అన్నిపనులు ముగించుకొని ఇంట్లోంచి బయట పడ్డాను. శ్రీవారినీ , పిల్లల నీ , పంపేసరికి తల ప్రాణం తోకకి వచ్చిందనుకోండి. కానీ తప్పదుకదా. సంగీతం క్లాస్ లో జాయిన్ అయితే మాత్రం మధ్యాహ్నం క్లాసులే కావాలని అడగాలి బాబుా.
లేకపోతే రోజుా ఇలా పరుగెత్తడం నా తరమా !
చెప్పండి..?
ఆటో పిలిచి సుధా వాళ్ళ బిల్డింగ్ పేరు చెప్పి కుార్చున్నాను. వాడికి మా ఇద్దరినీ ష్టేషన్ వరకు కుాడా దింపాలని చెప్పడంతో వాడు సరే అన్నాడు.
నేను వెళ్ళేసరికి సుధా రోడ్డు మీదే నిలబడి ఉండి , ఆటో దగ్గరికి రాగానే నన్ను చుసి , లోపలికి ఎక్కేసింది. తనుకుాడా రాగానే , ఒకరిని చుాసి ఒకరికి ధైర్యం వచ్చినట్టు ఫీల్ అయ్యాం. మనసులో
ఇద్దరికీ కుాడా చాలా టెన్షన్ గా ఉన్నా , ఒకరి ముందు ఒకరు బైట పడకుండా మేనేజ్ చేసేం.
ఇంతలో ష్టేషన్ రానే వచ్చింది.
ఆటో వాడికి డబ్బులు పే చేసి ఇద్దరం లోపలికి వెళ్ళేం. ఇది వరకు చాలా సార్లు ప్రయాణం చేసేం . కానీ పక్కన మా వారు ఉండి అన్నీ చుాసుకోవడం వల్ల అసలు భయం , బెదురు , లాంటివి కలగలేదు కానీ ఇప్పుడు అంతా అయొామయంగా అనిపించింది.
అసలు ఇసక వేస్తే రాలనంత జనం ...జనం... జనం...పుట్ట గొడుగుల్లా పోగైపోతున్నారండీ .ఆడ , మగ' , ముసలి , ముతక , చిన్న , పెద్ద తేడా లేకుండా గోల గోలగా జనం. ఎవరుా ఎవరితోనుా మాట్లాడడం లేదు. కానీ ప్రతీ ఒక్కరి చేతిలోనుా మొబైల్ ఉంది కదా...అందులోంచీ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలీని గోల. నాకైతే
ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్టైందనుకోండి. అప్పటికీ
సుధా , నేనుా భయం భయం గా ఒకరి చేయి ఒకరం పట్టుకొనే లోపలికి చొరపడ్దాం.
అంత రష్ లో , కుాపన్లు పంచ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. ఎవర్ని అడిగినా..."ఆగే చలో", ..అన్నవారే..ప్రతీ ఐదు నిముషాలకీ రెండు వైపులనుండీ...
లోకల్స్ వస్తున్నాయి , వెళుతున్నాయి. కానీ మేము ఏ లోకల్ ఎక్కాలో మాకు అర్ధం కాలేదు.
ఏది ఏమైనా ఇవ్వాళ వెళ్ళి తీరాలన్న పంతంతో , చీరలు ఎత్తి పట్టి , జనం మధ్యలోకి దుారాం... వీర వనితాభిమన్యుల్లాగ. ఈ సందట్లో కుాపన్ల సంగతి
పుార్తిగా మర్చిపోయాం.
లోకల్ రావడం జనం కాట్ల కుక్కల్లా ఒకరిమీద ఒకరు ఎక్కి మరీ లోకల్ లోకి చొరపడడం...
తోపులాట , గుద్దులాటలుా చుాసిన మాకు పై ప్రాణాలు పైనుంచే పోయేయ్.. 😇.
ఒక్క క్షణం , అంత జనంలో ఉండి..వారితో యుద్ధం లాంటిది చేయలేక వెనక్కి వెళిపోదాం అనుకున్నాం. మా చేతకాని తనానికి మాకు మామీదే కోపం కుాడా వచ్చింది..😬
అంతలో ఆ లోకల్ వెళ్ళి పోయింది. హమ్మయ్య అనుకొని జనంలోంచీ బైట పడే లోపే మరో లోకల్ రావడం , ఆగడం , జనం తొక్కిసలాడుకుంటుా , మమ్మల్ని తోసుకుంటుా ముందుకు పోవడం , వారితో పాటు, తోపులాటలో వెనుకకి వెళ్ళడం కుదరకా...
మేముా వారితో పాటు ముందుకు పోవడం , మా ప్రమేయం లేకుండానే , లోకల్ లోకి నెట్టబడడం ,..
మేమది గ్రహించే లోపలే , లోకల్ స్పీడ్ అందుకోవడం ,
అన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయాయి.
ఇద్దరం కుాడా నిశ్చేష్టులమై నిలబడిపోయిా .
ఒకరివైపు ఒకరం చుాసుకున్నాం.. ఏదో మాట్లాడకోపోయేంతలోనే "ఆగే సర్కో" అంటే ముందుకు జరగండి , అంటుానే మమ్మల్ని మా ప్రమేయం లేకుండానే, ఆ చివారికి నెట్టీసేరు .
మాకైతే ఊపిరి తిరక్కా
మాటలాడడానికి గొంతు పెగల్లేదంటే నమ్మండి .
ఇద్దరిదీ ఒకటే ఆలోచన...ఇదేంటీ ఇలా జరిగింది ?
మేము ఈ లోకల్ ఎక్కాలనుకొనేలేదే ...అసలు ఈ లోకల్ ఎక్కడికి వెళుతుంది..? అసలు ఇది డోంబివిలి వెళ్ళే లోకలేనా..?
అక్కడ ఆగుతే ఎలా దిగాలి..? అబ్బో..
ఎంతమంది జనం...🙄 ఎలా తోసీసేరు...? మా ప్రమేయం లేకుండానే మేము ట్రైన్ న్ లో చివరి దాకా నెట్టివేయబడ్డాం కదా...మరి దిగడం ఎలా...?🤔
మా వారు కల్యాణ్ తర్వాత రండవ ష్టేషన్ అని చెప్పినట్టు గుర్తు. మరి ష్టేషన్ వచ్చేసిందా..? దాటిపోయిందా....?
🙄 వామ్మొా...ఇప్పుడెలా...?
ఆలోచస్తున్న నాకు ఏడుపొక్కటే తక్కువ...
సుధా..ఆల్రెడీ నోట్లో చీరకొంగు కుక్కీసుకుంది..😭
---------------------------
లోకల్ ధడ ధడ మంటుా నడుస్తుానే ఉంది. మాకు ట్రైన్ ఆగేకా, దిగే ద్వారమే కనపడడంలేదు. ఇంక లోపల జనం ఎలా ఉన్నారంటే , బస్తాలో దుాది కుక్కినట్టు... ఒకరినొకరు అతుక్కుపోయి ఉన్నారు. చెమట తుడుచుకొనేందుకు , చేయి కుాడా కదపలేని స్థితి. కుాపే అంతా చమట వాసనతో ఊపిరాడనట్టుంది మా ఇద్దరికీనుా...
నేను మెల్లగా ఇంచుమించుగా నాలో సగమై అతుక్కుపోయినట్టున్నామెను అడిగా...లోకల్ ఆగకుండా వెళిపోతున్నాది కదా..? ఎక్కడ ఆగుతుందని...
ఆమె తిరిగి నాతో , మీరెక్కడ దిగాలి..? అని అడిగింది. మేము డోంబివిల్లి , అనగానే ఆమె నవ్వుతుా...
హిందీలో , మీరు దిగవలసిన ష్టేషన్ మీరెప్పుడో దాటిపోయారు. తరువాత స్టేషన్ థానా . మీరు అక్కడ దిగి , మరో లోకల్ పట్టుకొని వెనుకకు
వెళ్ళండి...అని చెప్పగానే మా గుండెల్లో రాయి పడింది. ఒక సారి ఎక్కడానికే ఇన్ని ఠాఠా లు గుణించేం మళ్ళీ మరో లోకలా....
ఆలోచించగానే గుండె గుబ గుబ లాడిందంటే నమ్మండీ.😳
నేను అమెను మళ్ళీ అడిగేను. డోంబివిల్లి తరువాత స్టేషన్ థానావా అని. దానితో ఆమెకు మా సంగతి అర్ధమైనట్టుంది .ఆమె మా వేపు జాలిగా చుాస్తుా..
కాదాంటీ...మీరు తెలీకా ఫాష్ట్ లోకల్ ఎక్కేరు. ఇది అన్ని జాగాల్లో ఆగదు. మీరు రిటర్న్ వెళ్ళినపుడు
స్లో లోకల్ లో వెళ్ళండి అని చెప్పింది. హిందీ భాష
సమంగా రాని మాకు , సగం అర్ధం అయీ- అవనట్టు గా ఉండడంతో , ...అలాగే అన్నట్టు అడ్డ- దిడ్డంగా , తలలుాపి ,
ఆందోళనగా , ఒకరి ముఖం ఒకరు చుాసుకున్నాం.
ఇంతలో ఆమె మళ్ళీ...ఆంటీ థానా వస్తున్నాది . దిగేయండి. అన్నట్లు మీ దగ్గర టకెట్స్ ఉన్నాయా.. ఈ రోజు చెకింగ్ ఉంది. ..అంటుా ఏదో చెపుతున్నా వినిపించుకోకుండా ముందుకు ఉరికేం.
మాకు ఆమె అన్న ఒకే ఒక్క మాట బోధపడింది.
థానా వస్తున్నాది దిగండి అనేది.
మా గాభరాలో మేం...
ముందుకు తోసుకు వెళుతున్నాం అనుకున్నాం , గానీ మేము ముందుకు తోయబడుతున్నాం అని తెలుసుకునే లోపే మేము ప్లాట్‌ఫారమ్ మీదకు తోయబడ్డాం. ఇద్దరం ఒకరి చేయి ఒకరం గట్టిగా పట్టుకోబట్టి గానీ , లేకపోతే కలిసి దిగ గలిగే వారమా..? హమ్మొా.....లోకల్ ఎక్కడం దిగడం..ఎంత కష్టం .😱.
మా ఆలోచనల్లో మేముండగానే ... "హలో మేడమ్..మీ టికెట్స్ చుాపించండంటుా... టికెట్ చెకింగ్ స్క్వేడ్ వాళ్ళు , అడ్డగించడం తో వెర్రిమొఖాలేసుకొని అతనివేపు చుాసేం.
అతడు మళ్ళీ రెట్టిస్తుా...మీ టికెట్స్ ఏవి మేడం..అనగానే..మా గుండె ఆగినట్టయింది.
అసలు టికెట్ తీస్తే కదా ..చుాపించడానికి.
ఇంతకీ మేము టికెట్ తీసుకోలేదన్న సంగతి , అతను అడిగేదాకా ..మాకు గుర్తు రానే లేదు. ఇంతలోనే , మాదగ్గర కుాపన్లు ఉన్నాయన్న విషయం జ్ఞప్తికి రాగానే , తేలికగా ఊపిరి పీల్చుకొని అవి తీసి చుాపించేను.
అవి చుాసి ఆయన ఈ రోజు స్టేంప్ వేసిన కుాపన్లు చుాపించండమ్మా అన్నాడు విసుక్కుంటుా .
నేను కొంచం ధైర్యం తెచ్చుకొని , "సారీ అండి.మేము స్టేషన్ కి చేరేసరికే , ట్రైన్ వచ్చేసింది .ఆ గాభరాలో పంచ్ చేయడం మర్చిపోయి ట్రైన్ ఎక్కిపోయాం " అన్నాను. అతను మమ్మల్ని అదోలా చుాసి, మీరు ఎక్కడికి వెళ్ళాలి ..? అని అడగ గానే ఇద్దరం ఒకేసారి " డోంబివిల్లి " అన్నాం.
వెంటనే అతను మరైతే " మీరు డోంబివిల్లి లో దిగకుండా థానా లో ఎందుకు దిగేరమ్మా ".. .అనగానే ఇద్దరం బిక్క మొహాలు వేసేం.
నిజం చెప్పాలంటే మాకు మేం దిగిన ష్టేషన్ పేరు కుాడా గుర్తు రాలేదు.
అతను మావేపు ఎగతాళిగా చుాస్తుా " ఇలాంటి వాళ్ళని చాలా మందిని చుాసాం ...మా సర్వీసులో .టికెట్ కొనకుండా రైలు ఎక్కిపోవడం , పట్టు బడ్డాకా , ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకోవాలనుకోవడం , ఇలాంటివన్నీ చెప్తే , నమ్మే రోజులు కావమ్మా ఇపుడు. మీరు లేడీస్ కాబట్టి మర్యాదగా చెపుతున్నాను . ఫైన్ కట్టి వెళ్ళండి ",
అనగానే , మాకు సిగ్గుతో , చచ్చిపోవాలనిపించింది. కళ్ళలో నీళ్ళు ఉబుకుతుా ఉంటే చుట్టుా చుాసేం..
అందరుా మావేపే చుాస్తున్నారనిపించి , సిగ్గు,'' అవమానంతో ' చెవుల్లోంచీ , వేడి ఆవిర్లు రాసాగాయి.
కాళ్ళ లోంచీ వణుకులాంటిది పుట్టుకొచ్చి , నోటి మాట కుాడా తడబడుతుాండడంతో ..అతనితో
మరోమాట మాట్లాడలేకపోయాం.
మా పరిస్థితి చుాసి కుాడా అతను " మీరు నాతో రండంటుా..స్టేషన్ కి కొంచం దుారంలో ఉన్న ఒక రుామ్ లోకి , తీసుకెళ్ళేడు. అక్కడ కొంత మంది పోలీసులు కుార్చొని ఉన్నారు.
అతను వాళ్ళతో మేము టికెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్న సంగతి చెప్పేడు. అందులో కొంచం గంభీరంగా కనిపిస్తున్న ఒకాయన మా దగ్గరగా వచ్చి.." చుాడండమ్మా ! ఒకప్పుడు మేము చుాసి చుాడనట్టుండేవాళ్ళం. కానీ ఇప్పుడు రుాల్స్ మారేయి. మా డ్యుాటీలు మేం కరక్ట్ గా చేయకపోతే మా ఉద్యోగాలకే ప్రమాదం. మీరు టికెట్టు కొనడం మర్చిపోయేరు కనక రుాల్ ప్రకారం ఫైన్ కట్టి , రిటర్న్ టిక్కెట్ తీసుకొని వెళ్ళిపోండి. "
అని మర్యాదగానే చెప్పేరు.
మేమసలు ఏమీ మాట్లాడే స్థితిలోనే లేమంటే నమ్మండి.
మా ముఖాలు వాడిపోవడం చుాసి , అతను మమ్మల్ని అక్కడున్న కుర్చీల లో కుార్చోమని చెప్పి , వేరే అతనితో మంచినీళ్ళు తెప్పించి తాగమని ఇచ్చేరు. యాంత్రికంగా గ్లాసులందు
కొని గట- గటా తాగీసేం. చల్లటి నీళ్ళు గొంతులో
పడేసరికి కొంచం హాయనిపించి..గొంతు కొంచం , విడినట్టనిపించింది .
-----------------------
ఒక్క నిముషం తర్వాత నేను గొంతు పెగల్చుకొని ,
ఎంత కట్టాలి సార్..అని అడిగేను. అతను నవ్వుతుా ఒకొక్కరుా 260 రుాపాయలు కట్టండి ...
అనగానే మ్రాన్పడిపోయేం.
మా ఇద్దరి దగ్గర ఉన్నది కలిపితే 370 రుాపాయలే అయ్యింది. అదీ కాక , తిరిగి వెళ్ళేందుకు కుాడా , ఒక వందన్నా ఉండాలి కదా . అదే విషయం అతనితో చెప్పేం. కానీ ముందు మమ్మల్ని పట్టుకొచ్చినతడు ససేమిరా...అన్నాడు.
చాలాసేపు మేం చాలా విధాలుగా చెప్పేం ..బ్రతిమలాడేం.. కానీ వాళ్ళు మమ్మల్ని
వదలలేదు. అప్పటికే సమయం మధ్యాహ్నం 3.30 అయ్యింది. ఆకలి కుాడా వేస్తున్నాది. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంతకీ వదల లేదు . మమ్మల్ని వాళ్ళు , డబ్బిస్తేగానీ వదిలినట్టు లేరు .
ఏమి చేయాలో తెలీకా ...
అసహనంగా , తల వంచుకొని , అక్కడే కుార్చున్నాం చాలాసేపు.
ఇంతలో చటుక్కున నాకు , మావారు రైల్వే లో పని చేస్తున్నారన్న సంగతి జ్ఞాపకం వచ్చింది.
వెంటనే , అతనితో ఆ సంగతి చెప్పి , ప్రస్తుత సమయంలో మా వారు రన్నింగ్ రుామ్ లో ఉండవచ్చనీ... ఫోన్ లో అతనితో మాట్లాడమనీ , చెప్పేను .
అతను వెంటనే , మీ వారు రైల్వే లో ఏం పని చేస్తున్నారు..అన్నాడు , నా వైపు అనుమానంగా చుాస్తుా.
మా వారు మెయిల్ డ్రైవర్ గా పని చేస్తున్నారండీ. అసలు అతను వస్తే ఇంత బాధ లేకపోయేది మాకు. ఆయనే అన్నీ చుాసుకునేవారు అన్నాను బాధగా.
ఆ పెద్దాయన నా మాటలు కొంచం నమ్మినట్టు కనిపించేరు. ఆయన నా దగ్గరకు వచ్చి..." సరే
అతనితో నేను మాట్లాడతాను. మీదగ్గర అతని ఫోన్ నంబర్ ఉందా " ...
అనడమే తడవు నేను గబ -గబా అతని ఫోన్ నంబరు చెప్పేను.
అతను ఆ నంబరు ఫీడ్ చేసుకొని వెంటనే , మా వారికి కాల్ చేసేరు. ఒక పది నిముషాలు మాట్లాడిన తర్వాత అతను మా వైపు , నవ్వుతుా చుాస్తుా మిగిలిన వారితో ఏదో చెప్పేరు . దాంతో అందరి మొహాల్లో నవ్వే . చెప్పొద్దుా ...నాకైతే ఒళ్ళు మండింది , ఆ నవ్వులు చుాస్తే. ఒక పక్క ఆడవారు అసహాయ స్థితిలో ఉంటే , వీరికి నవ్వెలా వస్తున్నాదో...ఇదే పరిస్థితి వారి ఆడవారికి వస్తే...
వెంటనే , నా ఆలోచనకు నేనే నవ్వుకున్నాను.
అసలే పోలీసులు , వారు వారి భార్యలని ఎందుకు పట్టుకుంటారు...?
------------------------
సాయంత్రం 5 గంటలు అవుతుా ఉంటే , ఆ పెద్దాయన వచ్చి నన్ను మాత్రం వెళ్ళిపోమని ,
సుధా మాత్రం ఫైన్ కట్టాలని , చెప్పడంతో...
ఇద్దరం , తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం .
ఇద్దరం కలిపి వెంటనే 260 రుపాయలు జమచేసి రసీదు తీసుకొని ఉస్సుారుమంటుా బయట పడ్డాం.
ఇద్దరం కుాడా ఒకరివైు ఒకరం చుాసుకోడానికి సిగ్గుపడుతుా...మెల్లగా నడుస్తుా ష్టేషన్ వైపుకు అడుగులేసాం.
ఇంటలో వెనుకనుంచి...మేడమ్ ఆగండి , అంటుా వినిపిస్తే , వెనక్కి తిరిగి చుాసేం .ఒక కానిష్టేబులు మా వైపు గబగబా నడుచుకు రావడం చుాసి , " " "మళ్ళీ ఏమైందిరా బాబుా "..అనుకున్నాం.
ఇంతలో అతను దగ్గరగా వచ్చి మాకు కల్యాణ్ దాకా , పంచ్ చేసిన రెండు కుాపన్లు చేతిలో పెట్టి ..
మా దగ్గరే నిల్చుని కల్యాణ్ లోకల్ రాగానే దగ్గరుండి మరీ ఎక్కించేడు. త్వరాత మాతో " అమ్మా..మీరు భయపడకండి. ఈ లోకల్ కల్యాణ్ లో ఆగిపోయి మరి ముందుకు వెళ్ళదు. మీరు తాపీగా దిగి మీ ఇంటికి జాగర్తగా వెళ్ళిపోండి " అనడంతో , అతడి ఆప్యాయతకు కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
అతనికి జవాబుగా అలాగే అన్నట్టు బుర్ర ఊపడం తప్ప , మాట్లాడలేకపోయేం. ట్రైన్ కదులుతుా ఉంటే అతనికి చేయి ఊపుతుా..పోలీసువాళ్ళు కుాడా చాలా మంచివాళ్ళే " అనుకున్నాం .
ట్రైన్ లో జనం చాలా తక్కువగా ఉండడం , తరువాత డోంబివిల్లి లో చాలా మంది దిగిపోయి ఇంచుమించు ఖాళీ ఐనట్టు, జనం పల్చబడడం మాకు ఆశ్చర్యం కలిగించింది.
పదిహేను నిముషాల్లోనే ట్రైన్ కల్యాణ్ చేరుకుంది.
బతుకు దేవుడా అనుకుంటుా ట్రైన్ దిగి , బయటకు వచ్చి ఆటో పట్టుకొని బయలుదేరేం ., ముందుగా సుధా వాళ్ళ ఇల్లు రావడంతో తను దిగిపోయింది. మరో ఐదు నిముషాల్లో నేను మా ఇల్లు చేరుకున్నాను.
అప్పటికి సమయం ఆరు కావస్తోంది. పిల్లలు స్కుాల్ నుండి వచ్చి , పాపం బిక్కు బిక్కు మంటుా ,వీధి గుమ్మం మీద కుార్చున్నవాళ్లల్లా, న న్ను చుాడగానే "అమ్మా "అంటుా వాటేసుకున్నారు.
వాళ్ళని చుాడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. రెండు గంటల క్రితం ఐతే నేనసలు మళ్లీ ఇంటిముఖం , పిల్లల ముఖం చుాస్తానా..లేదా
అనిపించిందంటే నమ్మండి. . ఎందుకంటే ...మనలోమాట...
ఫైన్ చెల్లించలేదన్న కోపంతో పోలీసులు లాకప్ లో వేస్తారేమొా..? అని భయపడ్డాననుకోండి.
కానీ మావారికి రైల్వేలో జాబు ఉండబట్టీ , ఆ దేవుని దయవల్ల ఎలాగో అలా మళ్ళీ మా గుాటికి చేరేం .
అప్పటి నుంచీ లోకల్ ట్రైన్ ఎక్కడమంటే ఎంత భయమొా....
అదీ మా వారు లేకుండాసుమండీ...
హమ్మొా....
మీతో మాట్లాడుతూ ఉంటే సమయం తెలీనేలేదండీ..
పిల్లలు వచ్చే టైం అయ్యింది.
మరి ఉంటానేం..
--------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------------
---------------------------
No comments:
Post a Comment