ఎంత పని చేసావురోరన్నో....
విలపిస్తున్నాడు చంద్రన్న ..మౌనంగా....
కంటినుండి ధారాపాతంగా కారుతున్న కన్నీరు, అతను తొడుక్కున్న కుర్తా మీంచి కారి, చమట తో కలిసి శరీరానికి చల్లదనాన్నిస్తున్నాది. మధ్యాహ్నపు సుార్యుడు తన ప్రతాపాన్ని చుాపుతుా...వీర విహారం చేస్తున్నాడు.
ఎండ వేడిమికి, తల పై చురుక్కు మనడంతోవలేచి నిలబడ్డాడు చంద్రన్న.
నీరు నిండిన కళ్ళతో చంద్రన్న తన ఎదురుగా ఉన్న సమాధిని చుాసేడు. కళ్ళకెదురుగా తన అన్న "వీరన్న "నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్న కట్టడం.చంద్రన్నకు .తన గుండెలు పిండేస్తున్నట్టుగా కలుక్కు మన్నట్టు ఏదొో బాధ ..
సమాధికి చుట్టుా...ఏపుగా పెరిగిన గోధుమ పంట...
ఎటు చుాసినా పచ్చదనంతో నిండి ఉన్న తమ పొలం.
బంగారంతో పోటీ పడుతున్నదా అన్నట్లుండేట్టు, నిగ నిగ లాడుతుా, చిరుగాలికి మెల్లగా తల లుాపుతుా , పంట కోతకు సిద్ధమంటుా, తలలు వంచి అనందంగా, తమను తాము అర్పించుకోవాలన్న తపనతో, మెరుస్తున్న గోధుమ కంకుల వైభవం.
చంద్రన్న మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది...ధారలుగా కారుతున్న కన్నీటి
సాగరంలో అలలై ఉప్పొంగుతున్న జ్ఞాపకాల వలయాలు
తన మెదడులో రొద పెడుతుా ఉంటే...,.ఆ..
అలజడికి ఓపలేని చంద్రన్న ,అక్కడే ఉన్న ఒక చెట్టు నీడలో , నిస్త్రాణగా వాలిపోయేడు. మూాసిన కళ్ళ ముందు , అప్పుడే జరుగుతున్నట్టుగా ఉన్న గతపు చిత్రాలను ఒకొక్కటిగా గాలిస్తుా....
--------------------------------------------------------------
చంద్రా....బాబుా...యాడున్నావురా....కుసింత కుాడుతిని పోరాదా...పొద్దుమాలి ఊరంతా గట్లనే తిరుగుతుాంటివిగదా...ఆకలైతలేదా...
అంటుా...తనను వెతుకుతుా వస్తున్న వదిన "చిన్నమ్మ" ను , చుాడగానే..ఒక్క సారిగా చేతిలో ఉన్న సిగరెట్టును జారవిడిచి , పక్క చుాపులు చుాస్తుా...ఔ....ఆకలైతాంది..
పోదం ఒదినా...అంటుా వెనకాలే బయలుదేరేడు.
ఇంటిలో తన అన్న వీరన్న కోసమని , కట్టిన కుాడు ముాట చుాడగానే , చిరాకుగా..నొసలు చిట్లించి చుాపులు తిప్పుకున్నాడు. అది గమనించిన చిన్నమ్మ నవ్వుకుంటుా..."అన్నకు బువ్వ నేనొట్టుకు పోతాగానీ..
నువ్వు సక్కంగ బువ్వతిని..గింట్లనే తొంగో..
సంటోడిని ఊయల లేసినా...బుడతడు ఇస్కుాలుకు
పోయిండు..ఏ టేములోనన్నా అస్తడు. రత్తాలును నే తోలుకు పోతా."..అంటుా ఇల్లప్పగించి , జొన్న రొట్టెల ముాట తీసుకు పొలానికి బయలుదేరింది చిన్నమ్మ.
--------------------------------------
రోజుా ఇదేతంతు.తన ప్రాణానికి ఒక్క రోజు కుాడా
నిశ్చింతగా పొగ తాగి దాని ఆనందాన్ని అనుభవించే
యొాగమేలేదు.. ఎప్పుడు చుాసినా ఇంటికి పిల్లలకి
కాపలా కాయడంతోనే సరిపోతోంది. అనుకుంటుా విసురుగా వసారాలో ఉన్న నులక మంచం మీద చతికిల పడ్డాడు చంద్రన్న.
చంద్రన్న ఆ వుారి స్కుాలు లో ఐదవక్లాసు దాకా చదివేడు. పై చదువులకి అక్కడ ఆస్కారం లేనందున అతని చదువు అక్కడితో ఆగిపోయింది .ఆ వుారిలో ఇంచుమించు అందరుా రైతులే..
కాక నిరక్షరాశ్యులు కావడం, వ్యవసాయం తప్ప మరో పని రాకపోవడం వల్ల , ఐదవక్లాసు వరకు చదివిన చంద్రన్నే వారందరికీ "సదుాకున్న మారాజు". ఎవరికి ఏ లెఖ్క కుదరకపోయినా చంద్రన్న దగ్గరికే వస్తారు.
దానితో చంద్రన్నకు అందరిలోకీ తనే గొప్ప , అన్న
భావం బలపడడం...ఇంట్లో అన్న , వదిన కుాడా తనను ప్రత్యేకించి చుాడడంతో , చంద్రన్న పనీ పాటా మాని, ఊరంతా సైకలు మీద తిరగడం... పోకిరీ పల్లల తో కుాడి , లేనిపోని అలవాట్లు చేసుకోవడం , తినడం..పడుక్కోవడం తప్ప మరే వ్యాపకముా లేని సోమరి అయ్యేడు. కనీసం -కష్టపడి పోలం సాగు చేస్తున్న అన్నకు ,కుాడు కుాడా పట్టుకెళ్ళి ఇవ్వడు.
వదిన "సిన్నమ్మే" ఇంటిపనంతా చేసి, అన్న కోసం రెండు మైళ్ళ దుారంలో ఉన్న పోలానికి నడిచి వెళ్ళి కుాడు పట్టుకెళ్ళి , ఇచ్చి వస్తుంది. ఆ నాలుగైదు గంటలుా కుాడా ఇంట్లో ఉండడానికి చిటపట లాడుతుా ఉంటాడు. అసలు అతనికి ఆ ఇంట్లో ఉండాలనే లేదు.
"పట్నం పోవాలె....పైసలు మస్తుగ సంపాయించాలె...
సిగరెట్టు.దమ్ముల...పట్నం యిస్కీ రుసి సుాడాలె.....
గప్పుడు గదా..మజా.."అనుకుంటుా ఉంటాడు.
ఇవే ఆలోచనలతో...ఆనందపడిపోతుా..
నులక మంచం మీద దొర్లసాగేడు.
-------------------------------
వీరన్న కు ముగ్గురు పల్లలు. రత్తాలు పెద్దది. తాసీల్దారుగారి ఇంటిలో పనికి కుదిరి, పదో పరకో సంపాదిస్తుాంది.
రెండవ వాడు లింగడు. బడిలో రెండవ క్లాసు చదువుతున్నాడు రెండేళ్ళబట్టీ... ఎదుగుదల లేని కారణంగా పొట్టిగా ఉండడం వల్ల అందరుా వాడిని బుడతడని పిలుస్తారు. ముాడవ వాడు , రెండేళ్ళ వెంకడు. ఎప్పుడుా ఏదో ఒక దానికోసం మారాం చేస్తుా ఏడుస్తునే ఉంటాడు. ఉయ్యాల లో నిద్రపొితుా కుాడా మధ్య మధ్య లో బెక్కుతుానే ఉన్నాడు.
చంద్రన్న , వీరన్న తమ్ముడు..
తల్లీ తండ్రీ చిన్నతనం లోనే పోవడంతో , అన్నా వదినల దగ్గర గారాబంగా పెరిగేడు. వీరన్న తమ్ముడిని కొడుకులాగే చుాసుకొనేవాడు. చిన్నమ్మ కుాడా తనకు నలుగురు పిల్లలన్నట్టుగానే , అందరినీ ఒకెేలా సాకింది.
ఇప్పటికీ చంద్రన్న తన "మరిది" అన్న భావం అమెలో కనపడదు. అందరితో మాట్లాడినపుడు కుాడా ," మా పెద్దోడు" అనే మాట్లాడుతుంది.
------------------------
-రోజులు గడుస్తున్నాయి. రెండెకరాల పొలంలో, వరి పంట నాటడానికై అన్న చాలా కష్టపడుతున్నాడు.
దుక్కి దున్నడానికి ఒంటెద్దుతో నానా హైరాన పడుతున్నాడు. జుాన్ నెల , వర్షాకాలం మొదలు
కావడంతో , కురిసే వర్షపు నీరు చాలక , మడి అంతా పుార్తగా తడియలేదు. భుామి అడుగు పొరల్లోకి నీరు కొంచమైనా చేరితే , భుామి , దున్నేందుకు అనుకుాలంగా ఉంటుంది. కనీసం ముాడు సార్లయినా దుక్కితేగానీ మట్టి మెత్తబడి నారు నాటేందుకు ,అనుకుాలమయ్యేది కాదు.
ఒదిన కుాడు పట్టుకెళ్ళినపుడు ,తలకు మించిన సాయం చేసి వచ్చేది.
ఆర్ధిక స్థితి కుాడా , అంతంత మాత్రమవడంతో.. పొలం చదును -గురించి వలసినంత
జాగ్రత్తలు తీసుకోలేక ..సతమత మైపోయేవాడు.
నారు నటే ముందు కావలసిన గెత్తాన్ని సమకుార్చుకోలేకపోయేవాడు. ఐదేళ్ళ బట్టీ...ఏదో కారణంగా పంట చేతికి అందడమే లేదు..తిండి లేక ఒక
ఎద్దు చనిపోయింది. సమయానికి సరైన విత్తనాలు దొరక్క , దొరికిన విత్తనాలు సరైనవి కాక , పంట పాడైపోయేది. అసలు మెరుగైన విత్తనాల కోసం చాలా తిరిగేవాడు .భుాసారం పెంచేందుకు ఏం చెయ్యాలో తెలిసేది కాదు. నార్లు నాటే సమయంలో, కుాలీల అవసరం చాలా పడేది . కానీ తగినంత కుాలిని ఈయలేకపోవడంతో, ఎవరుా వచ్చేవారు కాదు. కనీసం తాము తినడానికైనా కొంత మిగుల్చుకోవాలన్న తపనతో , భుామి సాగు చేసేవాడు. విత్తు నాటేందుకు ఎన్నో అప్పులు చేసేవాడు. అప్పులు తీర్చే ప్రయత్నంలో రెండెకరాల పొలం అమ్మేసాడు. మరో రెండెకరాలు తాకట్టు లో ఉన్నాయి. వాటీ వడ్డీ చెల్లించేందుకు మరో అప్పు . ఇంతా కష్టబడ్డాకా వరి, కోతకు వచ్చే సమయానికి పెద్ద వర్షం పడి వరి అంతా వంగిపోయి, కంకులు , భుామి లోనికి కుారుకు పోయేవి. లేదా..విత్తన సుద్ధి లేనందువల్ల అగ్గి తెగులు పట్టడమొా..లేక , కాండం తొలిచే మొగి పురుగు , సుడి దోమల బెడద తో,
వాటిని నివారించే రసాయన మందులు కొనలేక ...పంట నాశనమైపోతుా ఉంటే చుాడలేక, యమయాతన పడేవారు అన్న వదినలు. కొంత పంట నుార్పుకు వచ్చినా గింజ నుాక -నుాకలుగా వచ్చేది.
ఇలా ...నాలుగేళ్ళనుండి పడుతున్న చికాకులతో పాటు వచ్చిన అనుభవంతో..ఈ ఏడు చాలా జాగర్తలు తీసుకుంటున్నాడు అన్న. ఈ ఏడు పంట చేతికి రాకపోతే కనీసం తాము బతకడానికి కుాడా తిండి లేని
పరిస్థితి లో ఉన్నారు.
చిన్నప్పటినుండి ఇదంతా చుాస్తున్నాడు కాబట్టే తనకు పొలం పని చేయడమంటే , తగని చిరాకు వేసేది .
తాము ఎంత కష్ట పడినా...తనకు పిల్లలకు ఏనాడుా ,
కుాడు లేదన్న మాట రానివ్వకుండా..కడుపునింపేది వదినమ్మ. కానీ ఎన్నాళ్ళిలా...?
ఆలోచిస్తున్న చంద్రన్న చిరాకుగా లేచేడు. ధుా...ఎన్నాళ్ళీ
యెదవ బతుకు. హాయిగా పట్నం పోయి , ఏ కుాలి చేసినా పైసలొస్తాయి .దానితో హాయిగా బతకలేమా...
ఈ కష్టం కన్నా ..పెద్ద కష్టమా... కుాలిపని. ఇప్పుడు మాత్రం ఎంత సుఖపడిపోతున్నామనీ...
తను ఇంకెన్నాళ్ళిలా తన ఆశలన్నీ చంపుకొనీ..
ఈ పిల్లలకు కాపలా కాస్తాడు. ఇక ముందు మాత్రం
ఏం మిగులుతుందని . పంట చేతికి వస్తే అప్పులు తీర్చడానికే సరిపోదు అమ్మిన సొమ్ము...మళ్ళీ..దరిద్రం బతుకు..
మళ్ళీ కాయ కష్టం ...సంవత్సరమంతా ఎదురుచుాపులు....
హమ్మొా ...తనవల్ల కాదు....
అంతే...ఈ ఆలోచన రావడమే తడవు , చంద్రన్న తనకున్న నాలుగు జతల బట్టలు ఒక సంచిలో కుారేడు.
వదిన చిల్లరడబ్బులు దాచే పోపుల పెట్టి చుాసేడు.
ఓ రెండు వందలదాకా ఉంది.
తోసుకోవాలంటే మనసు రాలేదు." వదినమ్మకి ఇబ్బందైతదేమొా.."...
కానీ తప్పదు. మనసు రాయి చేసుకుని , దబ్బులు ముాటలా కట్టేడు. తన సైకిలు కి సంచి తగిలించి ,
ఒకసారి గుడిసె అంతా కలియ చుాసేడు. చంటోడు నిద్రలోనే ఉన్నాడు ఇంకా...ఈ పాటికి వదినమ్మ కుాడా బాయలుదేరే ఉంటుంది. ఆలశ్యమయితే వదినమ్మ ముఖం చుాస్తుా బయలుదేరలేడు. అందికే , మరో
ఆలోచన మాని అడుగు ముందుకేసేడు చంద్రన్న.
--------------------------------------------------*--*
ట్రైన్ లో బయలుదేరితే చాలా ఖర్చు అవుతుందని ,
పట్టణం వెళ్ళేకా , చేతిలో డబ్బు లేకపోతే , మరీ
ఇబ్బంది పడవలసి వస్తుందని అలోచించి , చంద్రన్న
తన సైకిలు మీదే, దగ్గరలో ఉన్న హైదరాబాదు కి
ప్రయాణం చేద్దామన్న నిర్ణయానికి వచ్చేడు.
"అనంతపుార్" కి దుారంగా "వజ్రకరోర్ మండలం" లో ఉన్న " గంజికుంట" అనే ఒక చిన్న కుగ్రామం నుంచి సైకల్ మీదే ప్రయాణం సాగించిన చంద్రన్న ,
అనంతపుార్ లో రాత్రి బసచేసి , మరునాడు సాయంత్రానికి "హైదరాబాదు" చేరుకున్నాడు. పట్టణం చుాడాలనీ..అక్కడే ఉండాలన్న తన చిరకాల కోరిక ,
ఈ విధంగానైనా తీరిందన్న ఆనందం .చంద్రన్నలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది. కానీ అప్పటికే చాలా రాత్రి అయింది , కాక అంత దుారం నుండి సైకల్ తొక్కుకుంటుా రావడం వల్ల కాళ్ళు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. తినడానికి ఫరవాలేదు గానీ , రాత్రి బస ఎక్కడ చేయాలో తెలీలేదు. చాలావసేపు ఆలోచించిన మీదట , హైదరాబాదు ష్టేషన్ లో ఆ రోజు రాత్రి గడుపుదామన్న నిర్ణయానికి వచ్చేడు.
-----------------------------------------------
రాత్రంతా బళ్ళ రాక -పోకలుా, జనం గోలతో సరగ్గా నిద్ర పట్టలేదు చంద్రన్నకు. కానీ తెల్లారిపోవడం తో...
బద్ధకంగా లేచి , అక్కడున్న పంపు దగ్గర ముఖం కడుకొని , వేడిగా ఒక కప్పు "టీ" తాగాకా కొంచం హాయి
అనిపించింది.
రాత్రి స్టేండులో పెట్టిన సైకిల్ తీసుకొని ఊరిలోకి బయలుదేరేడు చంద్రన్న. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో ,....
అన్నదేదీ అర్ధం కాలేదు చంద్రన్నకు.
తిరిగి -తిరిగి..ఆకలవుతుాండడంతో , తన దగ్గర ఉన్న డబ్బుకు తగువిధంగా ఉన్న చిన్న తోపుడు బండి
దగ్గరకు వచ్చి , 25 రుాపాయలకు దొరికే పప్పన్నం ..పచ్చడి ...అవురావురుమంటుా తిని..,
అక్కడే చెట్టుకింద ఉన్న, చప్టా మీద కుాలబడ్డాడు.
రాత్రి నిద్ర లేమి వల్ల, కడుపునిండా అన్నం తినగానే
నిద్ర పట్టీసింది చంద్రన్నకు.
ముక్కుపుటాలకి కమ్మని " కాఫీ" వాసన సోకడంతో
మెల్లగా కళ్ళు విప్పేడు చంద్రన్న. ఒక్క క్షణం తనెక్కడున్నాడో అర్ధంకాలేదు. అయొామయంగా చుట్టుా చుాసేడు.ఎదురుగా బండి మీద , తనకు
పొద్దున్న పప్పన్నం పెట్టినతను వేడి వేడిగా పెసర పుణుకులు వేస్తుా కనిపించేడు. పక్కన చిన్న కొరోసీన్ ష్టౌ
మీద కమ్మని కాఫీ కాగి వేడి వేడి గా పొగలు గక్కుతుా కనిపించింది.
చంద్రన్న లేద్దామనుకునే లోపే , పుణుకులు వేస్తున్నతను
"ఏమన్నా ! బగా నిద్దరపట్టినట్టుంది. కాపీ తాగుతావా ?
అంటుా పలకరించడంతో , నిన్నటి నుంచీ.., ఎవరుా మాట్లాడేవారు లేక బాధపడుతున్న చంద్రన్నకు ప్రాణం లేచి వచ్చింది .తనుకుాడా నవ్వుతుా ..
ఔ...అన్నా...అనంతపురం కాడున్న "గంజికోట " నుంచి సైకలేసు కొచ్చినా..పెయ్యంతా సవ సవ లాడుతున్నట్టుందే...
అంటుా మాట కలిపేడు నవ్వుతుా...అతడు పుణుగులతోపాటు , వేడి వేడి కాఫీ అందించేడు.
ఆపై ఇద్దరుా చాలాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
మరి కాసేపటిలో చంద్రయ్య పుణుగులు -వేయడం..కాఫీలు , గ్లాసుల్లో పోయడం వంటి పనుల్లో
సాయపడ్డాడు. మరి కొంత సేపటికే ఇద్దరుా మంచి స్నేహితులైపోయేరు.
-----------------------------------------
రాత్రి పదకొండుదాకా సాగిన వ్యాపారం..లో చంద్రయ్య కు తెలిసిన వివరాలు ఏంటంటే....
అతడి పేరు కేశవులు. ఇద్దరు అన్నలున్నారు.
వారిద్దరుా తమకు తాతలనాటినుండి వస్తుా.., సంక్రమించిన పొలాలను సాగుచేస్తుా...మంచి స్టితిలో
ఉన్నారు. మంచి ఇళ్ళు కట్టుకొని ఇక్కడే స్టిరపడిపోయేరు. తను వారికంటే చిన్నవాడు కావడం, వ్యవసాయం కంటే..ఎక్కువగా..వ్యాపారం మీద మక్కువ చుాపడంతో...తను వ్యాపారంలో స్థిరపడి
పోయేడు .అన్నలు వ్యవసాయంలో దిట్టలయ్యేరు. వారి
ఇద్దరికీ పెళ్ళిళ్ళై...పిల్లలు పుట్టేకా కుాడా. ముగ్గురుా ...అన్ని విషయాల్లోనుా.. సప్రదించుకుంటుా , కలిసి మెలిసే
ఉంటారు. ఇదీ కేశవులు కధ.
ఇద్దరుా బండిలో ఉన్న సామానంతా కడిగి బండిని నడుపుకుంటుా , కలిసి కేశవుల ఇంటిదాకా వచ్చేరు.
చంద్రన్న తన సైకలు తీసుకొని తిరుగు ప్రయాణం అయే
సమయంలో , కేశవులు అభిమానంగా '" ఇంత రేతిరి పుాట పోయి యాడ తొంగుంటావన్నా. ఈ రోజుకి నా ఇంట్లనే ఉండరాదే.."" అన్న ఆహ్వానంతో చంద్రయ్య
ఆనందపడిపోయేడు.
---------------------------
అలా ఉండిపోయిన చంద్రన్న ను
మరెప్పటికీ వెళ్ళనివ్వలేదు కేశవులు.
తనకు చేదోడు వాదోడుగా ఉండడంతో కేశవులుకి పని భారం తగ్గింది. కేశవులు ఆప్యాయంగా పెట్టే భోజనంతో
చంద్రన్నకు ఆకలి బాధ తీరింది.
ఇద్దరి మధ్య ఎన్నో విషయాల పై చర్చలు , వాగ్వివాదాలుా జరిగేవి. వాటి మధ్య లో ,పోలాల గురించిన వివరాలతో పాటు , తన అన్నలు ఎలా
పొలాలను సాగు చేసేవారో...ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన
" రైతు సంక్షేమ " పథకాలను ఏ విధంగా ఉపయొాగించుకున్నారో..."సుాక్ష్మ ధాతు" లోపాలను ఎలా సరిదిద్దుకున్నారో... " ఆత్మ ప్రాజక్ట్ " విధానంలో
"డ్రిప్ నీటి పారుదల " , పద్ధతి , వ్యవసాయం సాగు, "శాస్థ్రీయ పధ్ధతుల" అనుకరణ , " క్షేత్ర కంపోష్ట్ " పద్ధతిలో ఎరువుల తయారీ , మెరుగు పరచిన విత్తనాల ( హైబ్రీడ్ ) సేకరణ, "వర్మి కంపోష్ట్ " వినియొాగం , తెగుళ్ళు , లద్దెపురుగుల నివారణలకై జల్లే , పిచకారీ మందుల వాడుక ,
"గుంత పద్ధతి" లో వేర్లను తెగుళ్ళ నుండి కాపాడే విధానం, "ఆరుతడి" పద్ధతిలో , నీటి కొరత అధిగమనం ఎలా చేయవచ్చో , "సుడి దోమల" నుండి పంటను ఎలా కాపాడుకోవాలో , పంటకు "తెగులు " పట్టకుండా ఏ ఏ
రసాయనాలను , ఏ విధంగా వాడాలో ...
ఇలా అనేక విధాలుగా పంటల పెంపకం , మెరుగైన విత్తనాల ఎంపిక , భుా సార పద్ధతులు తెలుసుకున్నాడు .
స్వతహాగానే రైతు కుటుంబంలో పుట్టిన వాడైనందున
అంతర్లీనంగా ఉన్న వారసత్వ వాసనలు చంద్రన్న ను ,
ఈ విషయాల పై ఆశక్తి కలిగేలా చేసేయి.
రోజుకో రకమైన పద్ధతిని తెలుసుకుంటుా...ఏ కాలంలో ఏ పంటలను వేయాలో , "లింగాకర్షక" బుట్టలనమర్చి,
మొగిపురుగు ఉధ్ర్రుతను , ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకున్నాడు.
కేశవుల అన్నలతో కలిసినపుడు వాళ్ళ దగ్గరనుండి ఎన్నో వ్యాపార మెళకువలు తెలుసుకున్నాడు.
-----------------+----------
చంద్రయ్యకు
రాత్రి పడుకునే సమయంలో ఈ మాటలన్నీ ఒక సినిమా రీలులా..మెదడులో తిరుగుతుా ఉండేవి. అతడు సమంగా నిద్ర పట్టక..పక్కమీద అసహనంగా దోర్లేవాడు.
అతనికి తన అన్న జ్ఞాపకం వచ్చేవాడు.
"పాపం ...పొలం పండించడం లో , ఇన్ని సదుపాయ పద్ధతులు ఉన్నాయని తెలీని అన్న , కొన్ని సంవత్సరాలుగా , ఎంత కష్టపడుతున్నడు..
అంతేకాదు , సరైన విత్తనాలు దొరకకా కొంత , పంట తెగుళ్ళ మందులకై కొంత..పంట ఆనుకున్నంత దిగబడులీయకా చేసిన అప్పులు తీర్చలేక కొంతా..
.ఈ రకంగా
అనవసరంగా నాలుగెలరాల పొలం అమ్మివేసేడు కదా..!
ఇంక వదినమ్మ...తమకున్నా, లేకపోయినా , తనకు ఎప్పుడుా ఏలోటుా రాకుండా ఎంత ప్రేమగా చుాసుకునేది.
అటువంటి వారిని , వారి కష్ట సమయంలో తను వదీలీసి, ఇలా వచ్చేయడం న్యాయమా...?
కలిసి-కట్టుగా పని చేసుకుంటున్న శేషయ్య కుటుంబం ,
ఎంత హాయిగా ఉన్నారు.ఎండబ్బు సంపాదంచేరు.
ఎంత మంచి ఇళ్ళు కట్టుకొని , కార్ల లో దర్జాగా తిరుగుతున్నారు. మరి తామొా.....?
అలోచనలతో చంద్రన్న సతమత మయ్యేవాడు.
చివరకి ఒక నిశ్ఛయానికి వచ్చేడు. పట్నంలోనే ఉద్యోగం చేసి , స్టిరపడదామన్న తన ఆలోచనకు స్వస్టి చెప్పేడు.
మరికొన్ని రోజులు గడిచేయి. ఇప్పుడు చంద్రన్న తనంతట తానుగానే , పంట సాగు పద్ధతులగురించి
మట్లాడుతున్నాడు. శేషన్న దగ్గరకన్నా అతడి అన్నల మధ్య , పొలాల మధ్య ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
చివరికి అతని అన్నల సలహా మేరకు "పాలేకర్ "పద్ధతి లో సేద్య వివరాలకోసం ..."కాకినాడ"..కు పోయి క్లాసుల్లో
జాయిన్ అయ్యేడు. కొద్ది కాలంలోనే అతడు వ్యవసాయ పద్ధతులు, సేద్య.., వాణిద్య , విత్తనాల సేకరణలవంటి
అనేక విషయాల లో ప్రావీణ్యం పొందేడు.
--------------------------+
అప్పుడప్పుడు ఆలోచిస్తున్న చంద్రన్నకు అనిపిస్తున్న విషయం ఏమిటంటే...
" తానే గానీ పట్ణణం రాకపోయినా,..వచ్చినా కేశవులుతో
పరిచయం కాకపోయినా , అతని అన్నలు మన:స్ఫుార్తగా , తనకు సహకరించకపోయినా..తను ఈ స్థితికి రాలేకపోయేవాడు." ఆకలిబాధకు తాళ లేక తిండికోసం ఎక్కడో , ఒక హోటలు లో సర్వరుగా చేరి ,
మిగుళ్ళు- తగుళ్ళు తింటుా., సిగరెట్టు దమ్మే జీవితానందం అన్న రీతిలో బతికేవాడు. ఆ ఊహ వచ్చినంతనే ఒళ్ళు భయంతో జలదరంచింది చంద్రన్నకు.
ఈ నాడు తనున్న స్థితికి కారకులైన ఆ..
ముగ్గరు అన్నదమ్ముల మీదా క్ర్రతజ్ఞాభావంతో ,అనుకోకుండానే చేతులెత్తి నమస్కరించేడు చంద్రన్న.
మరిన్ని రోజులు గడిచేయి. కాయ కష్టం చేసి , కొంచం ఎక్కువగానే డబ్బు పోగెయ్యగలిసగేడు చంద్రన్న..
ఒక మంచిరోజు చుాసి కేశవుని తో పాటు , అతని అన్నలూ , కుటుంబీకుల దగ్గర కుాడా, శలవు తీసుకొని
మనసునిండగా గల అత్మ విశ్వాసంతో -తిరుగు దారి పట్టేడు చంద్రన్న.
--------------------------+-
తన ఊరి పొలిమేరల్లోకి , తన సైకిలుతో ప్రవేసించిన చంద్రన్నకు , తన ఊరి తేట గాలి ముక్కుపుటాలకు సోకగానే ఒళ్ళంతా పులకరించింది. సన్నని కాలి బాట పై సైకిలు దిగి నడుచు కుంటుా...తన ఊరిని ఆప్యాయంగా కలయజుాస్తుా, ఇంటికి బయలుదేరేడు చంద్రన్న.
మిట్ట మధ్యాహ్నం కావడంతో బాటంతా నిర్మాసుష్యంగా ఉంది.
తన ఇల్లు దగ్గరౌతున్న కొద్దీ , చంద్రన్న కు గుండె చప్పుడు ఎక్కువైంది. ఇంటి ముందు కట్టి ఉండవలసిన ఎద్దు కనపడలేదు.అంటే అన్న ఇంకా పొలం లోనే ఉన్నాడన్నమాట. ఇంటి ముందటి మట్టి గోడ పగిలి
బీటలు బారడంతో ,ముంగిలి తలుపు జారి ముందుకు వాలి ఉంది. తలుపు తోసుకొని లోపలికి చుాసిన చంద్రన్న , నిశ్శబ్దంగా ఉన్న వసారా దాటి ముందు గదిలోకి వెళ్లేడు.అక్కడ కుాడా అలికిడి లేకపోవడం తో
రత్తాలుా...అంటుా పిలిచేడు.
వెంటనే అక్కడే ఉన్న కుక్కిమంచంలో అలికిడైండి. మెక్లగా తలతిప్పిన రత్తాలు "చంద్రన్నా " ..అంటుా ఒక్క ఉదుటున మంచం దిగి చంద్రన్న ని పట్టుకొని ఏడవడం మొదలెట్టింది. ఏ ముాల నున్నాడో గానీ బుడతడు కుాడా వచ్చి ఏడవసాగేడు. వారిద్దరి ఏడుపుా చుాసిన చంద్రన్నకు కుాడా , కళ్ళమ్మట నీళ్ళు వచ్చేయి.
తనమీద పిల్లలకు ఎంత అభిమానమొా ..ఇన్నాళ్ళ తరువాత తనను చుాసినందుకే కదా ఈ దు:ఖం ...అనుకున్నాడు.
ముండుగా తానే కోలుకున్నాడు. రత్తాలు కళ్ళు తుడుస్తుా..బుడతడిని దగ్గరకు తీసుకున్నాడు.
" నాన్నింకా పొలంకాడనే ఉన్నాడా...వదినమ్మ బువ్వట్టుకుపోయి , ఇంకా రాలేదేమే...సంటోడేడీ..
అంటుా అడుగుతున్న చంద్రన్నకు , రత్తాలు ఏడుపు ఉధ్రుతమవ్వడంతో...మనసు కీడును శంకించింది.
ఆపై బెక్కుతుా రత్తాలు చెప్పిన మాటలు విన్న చంద్రన్నకు పై ప్రాణాలు పైకే పోయినట్టయింది..చేతిలో నున్న సంచి జారి కింద పడింది. అందులోంచీ , తను అందరికోసం కొన్న వస్తువులన్నీ , చిందర-వందరగా .
చెదిరిపోయేయి. నోట మాట రాని చంద్రన్న , నిస్త్రాణగా కింద కుాలిపోయేడు. చెవుల్లో రత్తాలు చెప్పిన మాటలు రిం....గు మంటున్నాయి .
---------------------------------------------
రెండు రోజుల వరకు తను ఇల్లు వదిలి వెళ్ళేన్న సంగతి
అర్ధంకాలేదుట అన్నా వదినలకు. ఎక్కడో ఏ స్బేహితుల తోనో ఉండి ఉంటడనే నమ్మకం , రాను రాను వమ్ము కావడంతో, అన్నా, వదినలు బెంబేలు పడిపోయేరట.
అన్న పోరడేడకు పోయేడో అన్న దిగులుతో , తనకోసం వెతుకులాటలో నాలుగు రోజులు , పొలం వేపే పోలేదంట.
అటు పొలం లో , కష్టపడి నాటిన వరి పైరుకు నీరు పట్టే వారు లేక, పొలం పని తెలీని వదిన వెళ్ళినా ..ఏం చేయాలో తెలీకపోవడంతో, నీరులేక , ఎంది పంట , చీడపట్టి పోయిందట. వారం వరకు కోలుకోలేని అన్న , పైరు నాశనమవ్వడం తో ఆ ,యేడంతా పిల్లలకు ఏం పెట్టాలె..
అప్పులు ఎలా తీర్చాలె, అన్న బెంగతొి మంచాన పడ్డాడంట. ఒకరోజు తెల్లారి లేచి , పొలం పనికి పోతాన ని చెప్పి వెళ్ళేడంట. ఎప్పటిలాగే వదిన అన్నకు బువ్వట్టు కెళ్ళి చుాసేసరికి , అన్న పొలం మధ్య సచ్చి పడన్నాడంట. పక్కనే పురుగుల మందు సీసా చుాసిన ఒదిన , గుండెలు బాదుకుంటుా నలుగురినీ పోగేసిందంట. కానీ అప్పటికే అన్న శవమైపోయిండంట.
అందరుా కలిపి అన్నను , ఆ పొలం మధ్యనే పుాడ్సినారంట. ఒదినమ్మ అడకే రోజుా పోయి , పిచ్చిదానికి మల్లె కుార్సుంటదంట. సంటోడికి పాలు లేక, తిండి లేక , ఏడ్చేడ్చి కళ్ళు ముాసిండంట. వాని కుాడా , తండ్రి పక్కనే గోతొలో పాతిపెట్టిండ్రంట.."
రత్తాలు చెప్పిన ఒకొక్క విషయముా , కళ్ళకు కట్టనట్టు
కనపడుతుా ఉంటే చంద్రన్న కు గుండె ,గొంతులోకి వచ్చినట్టయి , గొంతు ముాగబోయింది.
చాలా సేపు అలానే కుార్చుండి పోయేడు. చీకట్లు కమ్ముతున్నట్టుగా గుడిశెలో వెలుతురు తగ్గడంతో , మెల్లగా కళ్ళు తుడుచుకొని లేచేడు. రత్తాలు ఇంకా బెక్కుతుానే ఉంది.
------------------------------
చంద్రన్న మెల్లిగా లేచి, ముందు గుడెసెలో నుానె దీపం వెలిగించేడు. చల్లటి నీళ్ళతో ముఖం కడగగానే కొంత సేదతీరినట్టైంది. వదినమ్మ ఇంకా రాకపోవడంతో కంగారు పడ్డాడు. ముందుగా పిల్లలు పొద్దున్న నుంచీ ఏమీ తినలేదన్న సంగతి గమనించి...పక్కనే ఉన్న చిన్న
బడ్డీ నుంచి బన్ను , టీ తెచ్చిచ్చేడు.
తనుా టీ తాగి , రత్తాలుతో , వదినమ్మను తెస్తానని చెప్పి,
పొలం వైపు నడిచేడు.
----*------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment