భగ భగ మను మంటల్లో ,
భుగ భుగ మని రగిలి రగిలి
ధుా ధుా మని కాలి కాలి
మసిబారిన నా చెల్లీ....॥
కామాంధుల క్రౌర్యానికి ,
కర్కశ చుాపుకు దాడికి,
కన్నీరై మున్నీరై ,
విలపించన ఓ చెల్లీ॥
మనుషులమని మరచి- మరచి,
వలువలిప్పి తరచి -చెరచి,
పైశాచిక చర్యలతో ,
పొడిచి పొడిచి పాడికట్ట--
-
కాటేసిన కర్కసులను-
కాళ్లుపట్టి వేడి వేడి,
బతిమిలాడి, పెనుగాడీ,
బలిపశువైపోయిన చెల్లీ...॥
మందుమత్తు మాటులోన
మంటల నిను కాల్చి -కాల్చి
చుట్ట చుట్టి వదిలి వేయు,
ముదనష్టపు మగమ్రుగాళ్ల---
మానము ముక్కలు కోసి,
కసిదీరగ చావబాది--
నడి రోడ్డున ఉరితీసే-
న్యాయపు తీర్పేది మనకు.॥
అలనాడొక నిర్భయ...మరి
ఈనాడొక దరి , ప్రియాంక.
తెలిసిన కన్నీటి గాధ---..
లింకెన్నో తెలియనివిట॥
తల్లీ , చెల్లని తేడా.
లెరుగని కుక్కల కొలువులొ.
ప్రతి తల్లికి గుండెకోత...ప్రతి
పడతికి శోషణల రాత.॥
ఎన్నాళ్లింకెన్నా...
ళ్ళింకెన్నాళ్ళీ బ్రతుకు భీతి.
ఆడది, అబలని సాగే--
ఆతంకపు క్రుార రీతి ॥
లేవండిక లేవండిక
పట్టండిక కరవాలం.
క్రుారుల ఛెండాడు, పనికి
ఝళిపించీ యమపాశం..॥
చట్టపు తారీకులొద్దు.
చుట్టపు ఓదార్పులొద్దు.
మీటింగులు, షుాటింగుల-
సిగ్గులేని తీర్పులొద్దు.॥
మీడియాల ఘోషలొద్దు
మేడిపండు బాస లొద్దు
చాపకింద నీరువంటి
సంచలనపు మాటలొద్దు.॥
అగ్నివై రగిలిపోయి..
ఆవేశం పొంగిపొరలి,
ఓపలేని ఆవేదన ...
శక్తై చెలగేటి , హలగ..
ఖండించవె , క్రుారుల నిక,
మహిషాసురమర్దినివై-
ఛండివై , ప్రచండవై
ఛెండాడవె కాళివై.॥
అమ్మగ, అక్కగ ,చెల్లిగ-
ఆలిగ , అగచాట్ల నేలు,
శాంతముార్తి- రగిలిపో....
త్యాగమొదిలి ,చెలగిపో...॥
శక్తిరుాపు చుాపి- చుాపి,
పాపాత్ముల రుాపుమాపి,
భద్రకాళివై చెలగే
తరుణమిదని సాగిపో॥
తరుణమిదని సాగిపో.॥
తరుణమిదని సాగిపో..॥
-------------------------------
మందులేని గాయమిది.
వ్యధలు రేపు కావ్యమిది.
కదలు కథల కొలిమి ఇది..
మారనీ... సమాజమిదీ..॥
ప్రతీ క్షణం, మ్రుగాలవంటి -
మగాళ్ళ కాంక్షలకు ..
ఆహుతవుతున్న..
అక్కలు..చెల్లెళ్ళకు'
పాపలు , పసికందులకు..,
అశ్రు నివాళులతో...
(జగదీశ్వరీముార్తి.)
No comments:
Post a Comment